ఒడిషా ఎక్స్ ప్రెస్ సిల్వర్ షో….

1056
  • కష్టాల పరుగులో తిరుగులేని విజేత ద్యుతీ చంద్
  • బాల్యం నుంచే పేదరికంతో ద్యుతీ సావాసం
  • అథ్లెట్ గా ఎదగటానికి ద్యుతీ అష్టకష్టాలు
  • ఏషియాడ్ పతకాలతో దశ తిరిగిన ద్యుతీ చంద్
  • ద్యుతీకి ఒడిషా ప్రభుత్వం 3 కోట్ల రూపాయల నజరానా

జకార్తా ఏషియాడ్ తో భారత్ కమ్ ఒడిషా స్ర్పింటర్ ద్యుతీ చంద్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. కష్టాలు, కన్నీళ్లతో పోరాడుతూ వచ్చిన ద్యుతీ…. ఏషియాడ్ జంట రజతాలతో…. అసలు సిసలు విజేతగా నిలిచింది. మట్టి ఇంటిలో నివాసం ఉంటున్న నిరుపేద అమ్మానాన్నలకు గట్టి ఇంటిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది.

పరుగుతో తిరుగులేని స్థాయికి చేరిన 22 ఏళ్ల ఒడిషా ఎక్స్ ప్రెస్ పై స్పెషల్ స్టోరీ….

కష్టాలకు చిరునామా ద్యుతీ చంద్…

ద్యుతీ చంద్…. ఈ పేరు వినగానే…. నిన్నటి వరకూ కష్టాలు, కన్నీళ్లతో నిండిన ఓ నిరుపేద మహిళా అథ్లెట్ మాత్రమే గుర్తుకు వచ్చేది. అయితే… జకార్తా వేదికగా ముగిసిన 2018 ఆసియా క్రీడల్లో సాధించిన జంట రజతాలతో ఈ మెరుపు రన్నర్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.

ఒడిషాలోని జాజ్ పూర్ జిల్లా…. చకా గోపాల్ పూర్ లోని ఓ నిరుపేద చేనేత కార్మికుల ఇంట్లో జన్మించిన ద్యుతీ చంద్… బాల్యం నుంచి పేదరికంతో సావాసా చేస్తూ నానాకష్టాలు పడుతూ వచ్చింది.

బాల్యం నుంచి ఆటలంటే…. ప్రధానంగా పరుగు పోటీలంటే ద్యుతీ చంద్ కు ఎంతో ఇష్టం. అయితే ఆర్థిక సమస్యలతో పౌష్టికాహారం తీసుకొనే స్థోమత లేకపోయినా…. పరుగును కొనసాగిస్తూనే వచ్చింది.

మహిళే కాదంటూ దుమారం…

ఓ జాతీయస్థాయి అథ్లెట్ గా ఎదిగే క్రమంలో ద్యుతీ చంద్…రకరకాల సమస్యలు, పరీక్షలు ఎదుర్కొంది. అంతేకాదు…ఒకదశలో ద్యుతీ చంద్ …అస్సలు మహిళే కాదంటూ ఆరోపణలు సైతం వచ్చాయి.

వైద్య పరీక్షల ద్వారా వచ్చిన ఫలితంతో ద్యుతీ చంద్ న్యాయపోరాటం చేసి…. చివరకు విజేతగా నిలిచింది. మానసికంగా కృంగిపోయిన ద్యుతీకి కోచ్ నాగపురి రమేష్ కొండంత అండగా నిలిచారు.

అంతేకాదు…ద్యుతీ శిక్షణకు అవసరమైన తోడ్పాటును…హైదరాబాద్ లోని గోపీచంద్ అకాడమీ సైతం అందచేసి.. భుజం తట్టి ప్రోత్సహించింది.                  

జకార్తా వేదికగా ముగిసిన 2018 ఆసియాక్రీడల్లో పాల్గొన్న భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ జట్టులో…. ద్యుతీ చంద్ చోటు సంపాదించింది. మహిళల 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు అంశాలలో పాల్గొనటానికి అర్హత సంపాదించింది.

పరుగులో జంట రజతాలు….

ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ద్యుతీ…100 మీటర్ల రేస్ లో…11.32 సెకన్ల టైమింగ్ తో రెండోస్థానంలో నిలవడం ద్వారా రజత పతకం సొంతం చేసుకొంది.

ద్యుతీ అంతటితోనే ఆగిపోలేదు. చివరకు 200 మీటర్ల రేస్ లో సైతం తానేమిటో నిరూపించుకొంది. 23.20 సెకన్ల టైమింగ్ తో మళ్లీ రెండోస్థానంలో నిలిచింది. వరుసగా రెండో రజత పతకం సాధించింది.

ఆసియాక్రీడల్లో 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత…100, 200మీటర్ల పరుగులో రజత పతకాలు సాధించిన.. ఓ భారత అథ్లెట్ గా ద్యుతీ చంద్ చరిత్ర సృష్టించింది.

కష్టాలు తీర్చిన నజరానాలు…

ద్యుతీ చంద్ ఈ అపురూపమైన విజయాలు చూసి…ఒడిషా రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు…భారత దేశ క్రీడాభిమానులే మురిసిపోయారు.

ద్యుతీ చంద్ కు ఒరిస్సా అథ్లెటిక్స్ సంఘం, ఒరిస్సా ఒలింపిక్ సంఘం…చెరో 50 లక్షల రూపాయలు నజరానాగా ప్రకటించాయి.

మరోవైపు…ఒడిషా ముఖ్యమంత్రి…ద్యుతీ చంద్ కు 3 కోట్ల రూపాయలు ప్రోత్సాహకంగా ప్రకటించడమే కాదు…చెక్ ను సైతం అందచేశారు.

అమ్మానాన్నలకు అపురూప కానుక….

2020 టోక్యో ఒలింపిక్స్ కు ద్యుతీ చంద్ సిద్ధం కావటానికి తగిన సౌకర్యాలు కల్పిస్తామని కూడా ఒడిషా ముఖ్యమంత్రి ప్రకటించారు.

మరోవైపు…. చకా గోపాల్ పూర్ లోని తమ మట్టిఇల్లు కూలిపోడానికి సిద్ధంగా ఉందని… .అమ్మానాన్నలు నానాకష్టాలు పడుతున్నారని…. ప్రోత్సాహక బహుమతుల ద్వారా తనకు లభించిన మొత్తంతో…. ఓ గట్టి ఇంటిని నిర్మించి కానుకగా ఇస్తానని ద్యుతీ చంద్ చెబుతోంది.

ద్యుతీ చంద్ విజయాలు, ఘనతను చూసి ఆమె తల్లిదండ్రులు మాత్రమే కాదు…. గ్రామ ప్రజలు సైతం సంబరపడిపోతున్నారు.

జకార్తా ఏషియాడ్ విజయాల స్ఫూర్తితో…. మరో నాలుగేళ్లలో జరిగే టోక్యో ఒలింపిక్స్ లో సైతం…ద్యుతీ చంద్ ఏదో ఒక పతకం సాధించాలని కోరుకొందాం.

ద్యుతీ చంద్ సాధించిన రజత పతకాల వెనుక…. ఇంత కథ ఉందంటే ఆశ్చర్యమే మరి. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదనటానికి నిదర్శనమే ద్యుతీ చంద్ జీవితం.

NEWS UPDATES

CINEMA UPDATES