కేసీఆర్ డైలాగ్‌తో కామెడీ పాల‌యిన ఎర్ర‌బెల్లి

902

తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికార పీఠం చేప‌ట్టిన త‌ర్వాత‌ త‌ర‌చుగా వాడే ప‌దం…గ‌త పాల‌కుల నిర్ల‌క్ష్యం. సంద‌ర్భం క‌లిసి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా, త‌మ ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డుతోంద‌ని భావించినప్పుడ‌ల్లా…స‌ద‌రు వైఫ‌ల్యం నుంచి దృష్టి మ‌ర‌ల్చేందుకు…గ‌త పాల‌కుల నిర్ల‌క్ష్యం అనే డైలాగ్‌ను కేసీఆర్ వాడేస్తుంటారు. త‌ద్వారా స‌ద‌రు స‌మ‌స్య‌కు త‌మ‌దేం త‌ప్పులేద‌ని దులిపేసుకుంటారు. పాజిటివ్ స్పంద‌న వ‌స్తే మాత్రం త‌మ కోటాలో వేసుకుంటార‌నే టాక్ ఉంది. అయితే తాజాగా కేసీఆర్ వాడిన డైలాగ్‌నే వాడి అసెంబ్లీ సాక్షిగా బుక్ అయిపోయారు…టీడీపీ త‌ర‌ఫున గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే…అసెంబ్లీ జీరో అవ‌ర్‌లో స‌భ్యులు ప‌లు అంశాలు ప్ర‌స్తావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎర్ర‌బెల్లి వంతు రాగా…. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాల‌ని ఎర్ర‌బెల్లి కోరారు. ఈ అంశాన్ని సూటిగా చెప్ప‌కుండా…“ అధ్యక్షా…. గ‌త పాల‌కుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా నా నియోజ‌క‌వ‌ర్గంలో డిగ్రీ కాలేజీ లేదు. ఈ ప్ర‌భుత్వంలో అయినా ఆ ఇబ్బందిని తొల‌గించి డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నాను“ అని అన్నారు.

దీంతో కాంగ్రెస్ స‌భ్యులు న‌వ్వుతూ బ‌ల్ల‌లు చ‌రిచారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత డీకే అరుణ అయితే ఓ అడుగు ముందుకు వేసి “ద‌యాక‌ర్ రావు గారు…. మీరు కూడా గ‌త పాల‌కులు అన‌డం అంటే….“అని త‌న భావాన్ని న‌ర్మ‌గ‌ర్భంగా వెల్ల‌డించారు. దీంతో స‌భ‌లో న‌వ్వులు విరిశాయి. ఈ నేప‌థ్యంలో విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హరి జోక్యం చేసుకొని…ద‌యాక‌ర్ రావు పాత నియోజ‌వ‌ర్గంలో డిగ్రీ కాలేజీ ఉంద‌ని పేర్కొంటూ కొత్త నియోజ‌క‌వ‌ర్గంలో లేక‌పోవ‌డాన్ని ప్ర‌స్తావించినందున దానిని హాస్యంగా తీసుకోవ‌ద్ద‌ని…. వాతావర‌ణాన్ని తేలిక‌ చేసేశారు.

NEWS UPDATES

CINEMA UPDATES