కేసీఆర్‌ పై గద్దర్‌ పోటీ?

459

ఓ వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారు. మరో వైపు అదే సమయంలో నన్నే టార్గెట్ చేస్తావా అంటూ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ మాస్టర్ ప్లాన్ గీస్తున్నాడు. ఈ ఇద్దరు వారి వారి సీట్లను టార్గెట్ చేసి ముందుకెళ్తుండడం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సామాజిక వేత్త, టీమాస్ లీడర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య తమ సంఘం తరఫున కేసీఆర్ పై గద్దర్ ను నిలబెడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఆ సంగతి వైరల్ అయ్యింది. అయితే బలం లేని టీ మాస్ కంటే బలమున్న కాంగ్రెస్ నుంచి గద్దర్ ను దింపాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ భావిస్తున్నాడు.

అందుకే తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి.. స్వయంగా గద్దర్ ను కలిసి కాంగ్రెస్ టికెట్ పై పోటీచేయాలని ఒత్తిడి తెచ్చాడట.. ఉమ్మడి శత్రువు అయిన కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు తమతో కలిసి రావాలని విన్నవించాడట..

శుక్రవారం ఏకంగా మాజీ రాజ్యసభ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు కూడా గద్దర్ ను కలిసి కాంగ్రెస్ టికెట్ పైనే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో పోటీచేయాలని విన్నవించాడట.. దీనికి గద్దర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

ఇప్పటికే గద్దర్ కుమారుడు సూర్య కిరణ్ కాంగ్రెస్ లోనే నాయకుడిగా చెలామణీ వుతున్నాడు. ఇప్పుడు గద్దర్ కూడా కాంగ్రెస్ టికెట్ పై పోటీచేస్తే మొత్తం ఫ్యామిలీ కాంగ్రెస్ పక్షాన నిలబడ్డట్టే అవుతుంది. మహాకూటమి రూపుదిద్దుకుంటున్న వేళ గద్దర్ వస్తే మరింత బలం, బలగం పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొననని ఎప్పటి నుంచో చెబుతున్న గద్దర్ ఈ కాంగ్రెస్ నేతల మాటలకు తలొగ్గుతాడా.? కేసీఆర్ పై పోటీచేస్తాడా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ చేస్తే మాత్రం అది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పోరు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

NEWS UPDATES

CINEMA UPDATES