మోడీ పరువు తీయాలనే అక్కడ నుంచి పోటీచేస్తున్నాడు

1946

-ఎస్‌.వి.రావు

రాజ్‌కోట పశ్చిమం. ఈ స్థానానికి గుజరాత్‌ ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు మోడి ఇప్పుడు విజయ్‌రూపాని ఇక్కడి నుంచి గెలుపొందారు. వరుసగా ఐదు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తోంది. అటువంటి స్థానంలో బీజెపిని ఛాలెంజ్‌ చేస్తూ రాజ్‌గురు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ తరపున ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. ఇప్పుడు అందరి చూపు ఆయనపైనే. గెలుపు- ఓటమిలకన్న ముందు ఆయన ధైర్యాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రధాని మోడి, బీజెపి అధ్యక్షుడు అమిత్‌ షా సొంత రాష్ట్రమైనందునే గుజరాత్‌ ఎన్నికలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకోగా రాజ్‌కోట పశ్చిమ నియోజకవర్గం మరింత ప్రత్యేకత సంతరించుకుంది.

ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని (విజయ్‌ భాయ్‌) బిజెపి తరపున పోటీకి సిద్ధమవుతుండగా ఇంద్రనీల్‌ రాజ్‌గురు కాంగ్రెస్‌ తరపున తలపడనున్నారు. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయనప్పటికీ రాజ్‌కోట పశ్చిమ స్థానానికి మాత్రం దాదాపు అభ్యర్థులు ఖరారు అయ్యారు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావటంతో తిరిగి ఆయన అక్కడి నుంచే పోటీ చేయటం ఖాయం. కాంగ్రెస్‌ తరపున రాజ్‌గురును అధికారికంగా ప్రకటించడంతో గుజరాత్‌ రాజకీయాల్లో ప్రస్తుతం రాజ్‌గురుకు ప్రత్యేక ప్రాధాన్యత లభించినట్లయింది. రాష్ట్రం మొత్తం మీద 182 నియోజకవర్గాలు ఉండగా కాంగ్రెస్‌ పార్టీ ఈ స్థానానికి ప్రత్యేకంగా ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం, అది కూడా రాజ్‌కోట తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గురును ఎంపిక చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.

గుజరాత్‌లో రాజ్‌కోట స్థానానికి బీజెపిలో ఎంతో ప్రత్యేకత ఉంది. జనసంఘ్‌ సమయం నుంచే ఈ స్థానం బీజెపికి బలమైన కేంద్రంగా ఉంది. 1968 నుంచి ఆ పార్టీ లేదా ఆ పార్టీ (జనసంఘ్‌) బలపరిచిన వారు గెలుపొందుతూ వచ్చారు. 2014 అక్టోబర్‌లో ఇక్కడి నుంచి విజయ్‌ భాయ్‌ గెలుపొంది ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నాయకుడిగా ఉన్న ఇంద్రినీల్‌ రాజ్‌గురు తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా అక్కడి నుంచి మళ్లీ గెలుపొందడం ఆయనకు సులభమైనప్పటికీ ఈ సారి ఛాలెంజ్‌గా తీసుకొని పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇందుకు ఆయన ఆసక్తి చూపడంతో పాటు పార్టీ కూడా ప్రోత్సహించడం వల్ల ఎలాగైనా బీజెపిని 50 ఏళ్ళ తరువాత ఓడించాలని ఆయన కంకణం కట్టుకున్నారు. గత ఆరు నెలలుగా దృష్టి అంతా ఇక్కడే కేంద్రీకరించి పనిచేస్తున్నారు.వ్యాపార వర్గాలకు ప్రధానమైన గుజరాత్‌లో మత ప్రాతిపాదికన బీజెపి వేళ్ళూనుకు పోయినప్పటికీ తాజాగా మారిన సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈయన ఆసక్తికరమైన పోటీని ఇవ్వబోతున్నారు. కనీసం 50వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాలని బీజెపి ఆశిస్తుండగా తాను కనీసం 10వేల ఓట్లతో గెలుపొందుతానని సవాలు విసురుతున్న రాజ్‌గురు కులాల ప్రాతిపాదికన ఓట్లను రాబట్టేందుకు తన శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు. ఆర్థికంగా స్థితిమంతుడు. కులాల పరంగా బ్రాహ్మణ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో మంచి లాబీయింగ్‌ ఉంది. దీనికి తోడు పటేళ్ళు, ఓబీసిలు, దళితులు ముఖ్యంగా ఆయా వర్గాల్లోని యువకులు బీజెపిని ఓడించాలని పట్టుదలతో ఉన్నందున విజయ్‌భాయ్‌కి తన చేతిలో ఓటమి తథ్యమని ఎమ్మెల్యే రాజ్‌గురు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో పాటీదార్లు, బ్రాహ్మణులు 25శాతం ఉన్నందున తన గెలుపు తథ్యమని ఆయన ధీమాతో ఉన్నారు.

రాజ్‌కోట పశ్చిమ స్థానం నుంచి వరుసగా 7 సార్లు గెలుపొందిన విజు భాయ్‌వాలా స్పీకర్‌ పదవిలో ఉండగా కేంద్రం ఆయనను కర్ణాటక గవర్నర్‌గా పంపించడంతో ఇక్కడి నుంచి ప్రస్తుతం సీఎం విజయ్‌భాయ్‌ పోటీ చేసి 23వేల ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్‌ అభ్యర్థి జయంతి కలారియాపై గెలుపొందారు. రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో రాజ్‌కోట పశ్చిమ నియోజకవర్గం అత్యంత పెద్దది. 3.15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక తదితర వర్గాలకు చెందిన వారు తరతరాలుగా బిజెపికి మద్దతు ఇస్తున్నారు.

2002లో ఈ స్థానం నుంచి ప్రధాని మోడి గెలుపొంది ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆయనకోసం అప్పట్లో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన విజుభాయ్‌వాలా రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్లీ ఆయన కూడా రాజీనామా చేయడంతో విజయ్‌రూపాని గెలుపొందారు. ఈ విధంగా ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన కేంద్రంగా రాజ్‌కోట పశ్చిమ ప్రాముఖ్యత సంతరించుకుంది.

ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశామని బీజెపి చెప్పుకోవటానికి కారణం లేకపోలేదు. స్మార్ట్‌ సిటీల్లో తొలుత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత అహ్మదాబాద్‌కు మెరుగైన రవాణా మార్గం, నర్మదా నీటి సరఫరా, ఎయిమ్స్‌ వైద్య సంస్థ మొదలైనవి ఏర్పాటయ్యాయి. ఈ అభివృద్ధి కారణంగా బీజెపి గెలుపు తథ్యమని ఆ పార్టీ భావిస్తుండగా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో పాటు అన్ని వర్గాలు ముఖ్యంగా వ్యాపార వర్గం అసంతృప్తితో ఉన్నందున తమ విజయం తథ్యమని కాంగ్రెస్‌ విశ్వసిస్తోంది.

NEWS UPDATES

CINEMA UPDATES