పోయిన కిరీటం మ‌ళ్లీ వ‌స్తుంది!

465

జుట్టు ఒత్తుగా ఉంటే త‌ల మీద కిరీటం ఉన్న‌ట్లుగానే… భావిస్తారు మ‌గ‌వాళ్లు. అమ్మాయి క‌నిపిస్తే క్రాఫ్ స‌ర్దుకోవ‌డం కూడా ఈ ఫీలింగ్ లో నుంచి వ‌చ్చిన మ్యాన‌రిజ‌మే కావ‌చ్చు.

అంద‌చందాల‌లో జుట్టుకు అంత‌టి ప్రాధాన్యం ఉండ‌బ‌ట్టేనేమో – జుట్టున్న‌మ్మ ఎన్ని కొప్పులైనా పెడుతుంది- అనే నానుడి కూడా వ‌చ్చింది.

ఇదంతా… జుట్టు ఉన్న‌ప్పుడు చెప్పుకోవాల్సిన ముచ్చ‌ట్లు. మ‌రి… జుట్టు క‌ళ్ల ముందే రాలి నేల‌పాల‌వుతుంటే… త‌ల‌క‌ట్టు ప‌ల‌చ‌బ‌డ‌డం కంటికి చేతికి తెలిసిపోతుంటే ఏం చేయాలి?

అన్ని ర‌కాల అనారోగ్యాల‌కూ, దేహంలోని అన్ని భాగాల‌కూ వైద్యం ఉన్న‌ట్లే జుట్టు కోస‌మూ ప్ర‌త్యేక‌మైన చికిత్స విధానం ఉంది. త‌ల పూర్తిగా బ‌ట్ట‌త‌ల అయినా స‌రే తిరిగి జుట్టు మొలిపించే టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ టెక్నాల‌జీ ఇండియాకు వ‌చ్చి ఓ ద‌శాబ్దం దాటుతోంది. కానీ వాటి ఫ‌లితాల మీద ఓ విశ్వాసం ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతోంది. హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ గురించి మాట్లాడుకోవ‌డానికంటే ముందు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసుకోవాలి క‌దా!

ట్రాన్స్ ప్లాంటేష‌న్ కంటే ముందు

జుట్టు రాల‌డానికి కార‌ణాలు ఒక‌టి రెండు కాదు, అనేకం.

పోష‌కాహార లోపం, జ్వ‌రం వ‌చ్చి బ‌ల‌హీన‌ప‌డిన‌ప్పుడు, క్యాన్స‌ర్ కు కీమో ట్రీట్‌మెంట్ చేయించుకున్న‌ప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. వీటికి వైద్య‌మే అక్క‌ర‌లేదు. కీమోతో రాలిన జుట్టు కొంత‌కాలానికి దానంత‌ట అదే వ‌స్తుంది. జ్వ‌రం, పోష‌కాహార లోప‌మైతే మంచి ఆహారమే మందు.

ఇవి కాకుండా దేహం ఆరోగ్యంగా ఉన్నా కూడా జుట్టు రాలిపోతుంటుంది. దీనికి… చుండ్రు ప‌ట్ట‌డం, అలోపేషియా ఏరియేటా (పేను కొరుకుడు), మేల్ పాట‌ర్న్ బాల్డ్‌నెస్‌లు కార‌ణం కావ‌చ్చు. చుండ్రు, పేను కొరుకుడుకి మందులు వాడ‌డంతో ప‌రిష్కారం అవుతుంది. మేల్‌పాట‌ర్న్ బాల్డ్‌నెస్ అనేది పూర్తిస్థాయి వైద్య‌చికిత్స అవ‌స‌ర‌మైన కండిష‌న్‌.

ట్రీట్‌మెంట్ !

ఇందులో ఆర్టిఫీషియ‌ల్ మెథ‌డ్‌, నేచుర‌ల్ మెథ‌డ్ ఉంటాయి. ఆర్టిఫీషియ‌ల్ మెథ‌డ్ అంటే… విగ్గులు వాడ‌డం, మైక్రో వీవింగ్ వంటివి. విగ్గుల‌కు డాక్ట‌ర్‌తో ప‌ని ఉండ‌దు, కానీ మైక్రో వీవింగ్ డాక్ట‌ర్ చేతనే చేయించుకోవాలి. జుట్టును క్లిప్పుల‌తో పుర్రెకు అతికిస్తారు.ఇది చూడ‌డానికి సొంత జుట్టు ఉన్న‌ట్లే క‌నిపిస్తుంది కానీ గ‌ట్టిగా లాగితే ఊడిపోతుంది.

ఇక స‌హ‌జ‌మైన ప్ర‌క్రియ అంటే ట్రాన్స్‌ప్లాంటేష‌నే. ఇది వైద్య ప్ర‌క్రియ, నేచుర‌ల్ మెథ‌డ్ ఎలా అవుతుంది అనే ప్ర‌శ్న రావ‌చ్చు. కానీ ఈ విధానంలో మ‌న సొంత జుట్టునే ఒక చోట నుంచి తీసి మ‌రొక చోట నాటుతారు. మ‌న త‌ల మీద పెరిగేది పూర్తిగా మ‌న జుట్టే. అందుకే దీనిని నేచుర‌ల్ మెథ‌డ్‌గానే ప‌రిగ‌ణిస్తారు.
నారు మొక్క‌ను ఒక చోట నుంచి తీసి మ‌రొక చోట నాటిన‌ట్లేన‌న్న‌మాట‌. వెంట్రుక‌ను కుదురుతోపాటు తీసి నాటుతారు కాబ‌ట్టి అది అక్క‌డే పాదుకునిపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే నారుమ‌డి నుంచి నారు తీసి పొలం మొత్తంలో ప‌లుచ‌గా నాటిన‌ట్లే.

ఎలా తీస్తారు!
త‌ల మీద జుట్టు లేని ఖాళీలో జుట్టును నాట‌డం ఓకే. బాగానే ఉంది. కానీ జుట్టును తీయ‌డం పెద్ద ప‌ని. త‌ల మీద ఒత్తుగా ఉన్న చోట నుంచి వెంట్రుక‌ల‌ను క‌లెక్ట్ చేయాలి. భ‌విష్య‌త్తులో ఆ ప్ర‌దేశంలో బ‌ట్ట‌త‌ల వ‌చ్చే చాన్స్ ఉన్న ప్ర‌దేశాల‌ను ముట్టుకోకూడ‌దు.

జ‌న‌ర‌ల్‌గా ఆక్సిపిట‌ల్ రీజియ‌న్ నుంచి క‌లెక్ట్ చేస్తారు. అంటే త‌ల వెనుక భాగం. పూర్తిగా బ‌ట్ట‌త‌ల ఉన్న వాళ్ల‌కు కూడా త‌ల వెనుక వైపు రెండు చెవుల మ‌ధ్య జుట్టు ఉంటుంది. ఆ ప్ర‌దేశంలో బ‌ట్ట‌త‌ల రాదు. కాబ‌ట్టి ఆక్పిపిట‌ల్ రీజియ‌న్ నుంచి క‌లెక్ట్ చేస్తారు. అందుకే దాన్ని డోనార్ సైట్ అంటారు.
ఇక తీయ‌డం విష‌యానికి వ‌స్తే… ఒక స‌న్న‌ని స్ట్రిప్‌లాగ తీసి దాన్నుంచి వెంట్రుక‌ల‌ను వేరు చేసి అవ‌స‌ర‌మైన చోట ఇంప్లాంట్ చేసేవారు. అలా చేసిన‌ప్పుడు ఆ వ్య‌క్తి గుండు చేయించుకున్న‌ప్పుడు ప్యాచ్ స్ప‌ష్టంగా తెలిసిపోతుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క వెంట్రుక‌ను తీసి ఇంప్లాంట్ చేస్తున్నారు. వెంట్రుక కుదురును ఫాలిక్యులార్ యూనిట్ అంటారు. బ‌ట్ట‌త‌ల విస్తీర్ణాన్ని బ‌ట్టి ఎన్ని ఫాలిక్యులార్ యూనిట్ లు ఇంప్లాంట్ చేయాల్సి వ‌స్తుంద‌నేది అంచ‌నా వేస్తారు. ఆ మేర‌కు ట్రాన్స్‌ప్లాంటేష‌న్ ఖ‌ర్చు పెరుగుతుంటుంది.

ఎలా ఇంప్లాంట్ చేస్తారు?

బ‌ట్ట‌త‌ల ఏర్ప‌డ‌డంలో ర‌క‌ర‌కాల పాట‌ర్న్‌లుంటాయి. నుదురు నుంచి జుట్టు వెన‌క్కి పోవ‌డం, త‌ల మ‌ధ్య గుండ్రంగా ఖాళీ ఏర్ప‌డ‌డం, నుదురు నుంచి రెండు కొమ్ములులాగ జుట్టు లోప‌లికి పోయి మ‌ధ్య (మాడు మీద‌)లో జుట్టు ఉండ‌డం వంటివి. జుట్టు రాలిన పాట‌ర్న్‌ను బ‌ట్టి నాటాల్సిన ప్ర‌దేశాన్ని పెన్సిల్‌తో లైన్ గీస్తారు. ఆ లైన్‌కు అనుగుణంగా త‌ల మీద చిన్న చిన్న రంధ్రాలు వేస్తారు. ప్ర‌తి రంథ్రంలో వెంట్రుక‌ల‌ను నాటుతారు. నుదురు నుంచి అయితే… లైన్ గీసిన త‌ర్వాత మొద‌టి కొన్ని లైన్ల‌లో ఒక్కో వెంట్రుక నాటుతారు. కొంచెం లోప‌లికి వెళ్లే కొద్దీ ఒక్కో రంధ్రానికి రెండు లేదా మూడు వెంట్రుక‌ల‌ను నాటుతారు. నుదుటి మీద తొలి వ‌రుస‌ల‌లో ఒకే రంధ్రంలో ఎక్కువ ఫాలిక్యులార్ యూనిట్ల‌ను నాటితే జుట్టు గాలికి లేచిన‌ప్పుడు చూడ‌డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. నాటిన జుట్ట‌ని తెలిసిపోతుంది. నాచుర‌ల్‌గా క‌నిపించ‌డానికి మొద‌టి లైన్ల‌లో ఒక్కో యూనిట్‌నే నాటుతారు.

బాప్‌రే! త‌ల‌కు రంధ్రాలే!

త‌ల‌కు రంధ్రాలు వేయ‌డం అన‌గానే కొద్దిగా భ‌యం వేస్తుంది. కానీ ఇది సింపుల్ స‌ర్జ‌రీనే. రంధ్రం వేయ‌డానికి గ‌తంలో క‌త్తిని వాడేవారు, ఇప్పుడు లేజ‌ర్‌తో రంధ్రాలు చేస్తున్నారు. ఈ స‌ర్జ‌రీకి హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన ప‌ని ఉండ‌దు. లోక‌ల్ అన‌స్థీషియా ఇచ్చి స‌ర్జ‌రీ చేస్తారు. ఇక స‌ర్జ‌రీ స‌మ‌యం ఒక్కొక్క‌రికి ఒక్కో విధంగా ఉంటుంది. కొద్దిపాటి ట్రాన్స్‌ప్లాంటేష‌న్ అయితే నాలుగు గంట‌లు స‌రిపోతుంది. ఎక్కువ మేర చేయాల్సిన‌ప్పుడు ఎనిమిది గంట‌ల స‌మ‌యం కూడా ప‌ట్ట‌వ‌చ్చు. అంత‌కంటే ఎక్కువ స‌మ‌యం ప‌ట్టే కండిష‌న్ ఉన్న‌ప్పుడు ఒక సిట్టింగ్‌లో పూర్తి చేయ‌రు. రెండు లేదా మూడు సిట్టింగ్స్ లో చేస్తారు. బ‌ట్ట‌త‌ల విస్తారాన్ని బ‌ట్టి, పైగా ఎంత మేర ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోవాల‌నుకుంటున్నార‌నే దానిని బ‌ట్టి కూడా టైమ్‌, సిట్టింగ్స్ ఆధార‌ప‌డి ఉంటాయి. గ‌తంలో కంటే ఇప్పుడు అడ్వాన్స్‌డ్ సిస్ట‌మ్‌లో ఒకే సిటింగ్‌లో 1500 ఫాలిక‌ల్స్ నాటుతున్నారు. కాబ‌ట్టి సిట్టింగ్స్ సంఖ్య బాగా త‌గ్గింది.

మిడిల్ ఏజ్ వాళ్లు మ‌రీ నుదుటి నుంచి కాకుండా కొద్దిగా లోప‌లి నుంచి చేయించుకుంటారు. ఆ ఏజ్‌కి స‌హ‌జంగా వ‌చ్చిన ఒకింత మార్పు అనిపించేట‌ట్లు చేయించుకుంటారు. గ్లామ‌ర్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్లు పూర్తిగా చేయించుకుంటారు

మ‌రి… స‌క్సెస్‌ రేట్‌.!

ఇది కూడా వ‌రినాట్ల‌లాగానే ఉంటుంది. 90 – 95 ఫాలిక‌ల్ యూనిట్‌లు నిలుస్తాయి. ఐదు నుంచి ప‌ది శాతం రిస్కు ఉండ‌నే ఉంటుంది. వెంట్రుక కుదురుతోపాటు నిలిచిన త‌ర్వాత ఆరు నెల‌ల‌కు పెరుగుతాయి. చ‌క్క‌టి క్రాఫింగ్ అప్ప‌టి నుంచి చేయించుకోవ‌చ్చు. ట్రాన్స్ ప్లాంటేష‌న్ త‌ర్వాత త‌ల‌కు మామూలుగానే నూనె రాయ‌వ‌చ్చు, దువ్వ‌వ‌చ్చు, త‌ల‌స్నానం చేయ‌వ‌చ్చు. డై వేయ‌వ‌చ్చు. ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లేవీ అక్క‌ర‌లేదు. అయితే చిక్కుబ‌డిన‌ప్పుడు దువ్వెన‌తో జుట్టు కుదురు ఊడివ‌చ్చేటంత గ‌ట్టిగా దువ్వ‌కూడ‌దు. దువ్వెన మాత్రం శుభ్రంగా, గుండ్ర‌ని నునుపైన ప‌ళ్లున్న‌దే వాడాలి. ఎందుకంటే గ‌రుకు ప‌ళ్లున్న దువ్వెన‌లు మామూలు వాళ్ల‌కూ మంచిది కాదు. ఇక‌ క‌ష్ట‌ప‌డి తెచ్చుకున్న కిరీటాన్ని ప‌దిలంగా ప‌ది కాలాలు కాపాడుకోవాలి క‌దా! మంచి దువ్వెన మాత్రం త‌ప్ప‌నిస‌రి.

పి.ఎస్‌:
బ‌ట్ట‌త‌ల ఆడ‌వాళ్ల‌కూ వ‌స్తుంది! దానిని ఫిమేల్ పాట‌ర్న్ బాల్డ్‌నెస్ అంటారు. దీనికి ట్రాన్స్‌ప్లాంటేష‌న్ వంటి ట్రీట్‌మెంట్ అవ‌స‌రం ఉండ‌దు. ఎందుకంటే… మ‌గ‌వాళ్ల‌కు పోయిన‌ట్లు ఒక చోట నుంచి తుడిచి పెట్టుకుపోదు, త‌లంతా యూనిఫామ్‌గా ప‌ల‌చ‌బ‌డుతుంది. దాంతో ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన అవ‌స‌రం పెద్ద‌గా ఉండ‌దు.

NEWS UPDATES

CINEMA UPDATES