✓ గుండె దహించుకుపోతోంది…. ఏపీలో పాలనపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

7050

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒక కేసు విచారణ సమయంలో ప్రభుత్వ పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా అయితే రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని ఆవేదన చెందింది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన కంపెనీలకు భూబదలాయింపు చేయకుండా వేధించడం, తిరిగి భూమి స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం చెప్పడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

ఏపీలో పాలన మొత్తం గందరగోళంగా తయారైందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమ ముందుకు వస్తున్న కేసులను పరిశీలిస్తే అక్కడి పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతోందన్నారు. ఏపీలో పాలన చూస్తుంటే గుండె దహించుకుపోతోందని జస్టిస్ రామచంద్రరావు ఆవేదన చెందారు. ఏపీలో పాలన ఒక పద్దతి, పాడు లేకుండా తయారైందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ మలేసియా, సింగపూర్, కొరియా కంపెనీలను ఆహ్వానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడి కంపెనీలు, పరిశ్రమల గురించి పట్టదా? అని హైకోర్టు ప్రశ్నించింది.

నెల్లూరు జిల్లాలో ఎస్కో కంపెనీ స్పిన్నింగ్ మిల్ ఏర్పాటుకు ముందుకు రాగా 30 ఎకరాల భూమిని కేటాయించారు. కానీ ఆ విషయాన్ని రెవెన్యూ రికార్డుల్లో మాత్రం వెల్లడించలేదు. దీంతో కంపెనీకి లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. ఈ వ్యవహారం నడుస్తుండగానే ప్రభుత్వం భూములు వెనక్కు తీసుకుంటామని ప్రకటించింది. దీంతో ఎస్కో కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం భూమిని సరైన రీతిలో బదలాయించడం లేదని అందువల్లే ఇబ్బందులు వస్తున్నాయన్నారు.

ప్రభుత్వం తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వినిపించిన వాదనను హైకోర్టు తప్పుపట్టింది. ఏపీలో అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని… వేధింపులకు సైతం వెనుకాడడం లేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో పెట్టుబడుల కోసం తిరుగుతున్నారే తప్ప ఇక్కడి పరిశ్రమల సంగతి మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీలో ఇదే వాతావరణం కొనసాగితే ఒక్క పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించింది. కలెక్టర్ ఆదేశించినా తహసీల్దార్ మాట వినని పరిస్థితి ఉంటే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. దేవుడు వరమిచ్చినా పూజారి పట్టించుకోకపోవడం అంటే ఇదేనని విమర్శించింది. ఇలాగైతే రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరు వస్తారని ప్రశ్నించింది హైకోర్టు.

NEWS UPDATES

CINEMA UPDATES