అభ‌య‌మా – క‌మ‌ల‌మా!

683

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. జాతీయ స్థాయిలో ప్ర‌ధాన పార్టీలైన‌ ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలే అక్క‌డ కూడా ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు. హిమాచ‌ల్ లోక్‌హిత్ పార్టీ గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఒక సీటు గెలుచుకుంది. త‌ర్వాత అదికూడా ఆప్‌లో విలీన‌మైంది. ఆప్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో పెద్ద‌గా ఉనికిలో లేదు. దాంతో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఐఎన్‌సి , బిజెపిలే ప్ర‌త్య‌ర్థులు. దాంతో ఇత‌ర ఏ పార్టీల‌తో పొత్తులు, స‌మీక‌ర‌ణ‌లు లేవు. పోరు ముఖాముఖి, హోరాహోరీగా కూడా జ‌రిగే అవ‌కాశం ఉంది.

హెచ్ పి (హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌)లో రెండు పార్టీల‌కు స్థానికంగా నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఇద్ద‌రు ప్ర‌ధాన‌మైన వ్య‌క్తులూ హేమాహేమీలు, క‌ర‌డు గ‌ట్టిన సీనియ‌ర్లు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఒక‌రు డైబ్బై దాటితే, మ‌రొక‌రు ఎన‌భై దాటారు. కాంగ్రెస్ ఓల్డ్ ఏజ్ హోమ్ రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు కావ‌డంతో త‌న సిఎం అభ్య‌ర్థిగా వీర‌భ‌ద్ర సింగ్‌ను వ‌య‌సు కార‌ణంగా ప‌క్క‌న పెట్ట‌లేక పోయింది. ఇక బిజెపికి మాత్రం మోదీ త‌మ‌కంటూ రాసుకున్న వాన‌ప్ర‌స్థ సిద్ధాంతం రాజ్య‌మేలుతోంది కాబ‌ట్టి డెబ్బై దాటిన ప్ర‌తిప‌క్ష నేత‌ను సిఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించే ఆలోచ‌న‌లో లేన‌ట్లే ఉంది.

వీరే ఆ ఇద్ద‌రు!

రాజా వీర‌భ‌ద్ర‌సింగ్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి. ఇంత‌కు ముందు నాలుగు ద‌ఫాలు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. మొద‌టి ద‌ఫా 1983 నుంచి 1985 వ‌ర‌కు, రెండ‌వ ద‌ఫా 1985- 1990, మూడ‌వ ద‌ఫా 1993 నుంచి 1998 వ‌ర‌కు, నాలుగ‌వ ద‌ఫా 2003 నుంచి 2007 వ‌ర‌కు, ఆ త‌ర్వాత 2012 నుంచి… ఈ టెన్యూర్ పూర్త‌వ‌బోతోంది. న‌వంబ‌ర్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో వీర‌భ‌ద్ర‌సింగ్‌ను రాజా అని పిలుస్తారు.

తొలుత లోక్‌స‌భ‌కు!

సిమ్లాలో 1934లో పుట్టిన‌ వీర‌భ‌ద్ర సింగ్ రాజ‌కీయ జీవితం లోక్‌స‌భ‌తో మొద‌లైంది. 1962లో తొలిసారి పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. ఆ ప‌రంప‌ర‌లో 1967, 1972, 1980 ఎన్నిక‌ల వ‌ర‌కు కంటిన్యూ అయింది. తిరిగి 2009ల‌లో మ‌రోసారి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

1983లో రాష్ట్రంలో ఏర్ప‌డిన రాజ‌కీయ అనిశ్చితిలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి బాధ్యత‌లు చేప‌ట్టారు. అంత‌కంటే ముందు ఆయ‌న కేంద్రంలో ఉక్కు, ప‌రిశ్ర‌మ‌లు, టూరిజం, సివిల్ ఏవియేష‌న్ శాఖ‌ల స‌హాయ మంత్రిగా విధులు నిర్వ‌ర్తించారు.

ప్రేమ్ కుమార్ దుమాల్ రెండు ద‌ఫాలు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా చేశారు. 1944లో పుట్టిన‌ ప్ర‌స్తుతం ఆ రాష్ట్రానికి ప్ర‌తిప‌క్ష నేత‌. మొద‌టి ద‌ఫా 1998 నుంచి 2003 వ‌ర‌కు, రెండ‌వ ద‌ఫా 2008 నుంచి 2012 డిసెంబర్ వ‌ర‌కు.

కాంగ్రెస్ క‌ష్టాలివి!

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల బ‌రిలో పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప‌రిస్థితులు పెద్ద‌గా అనుకూలంగా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే వీర‌భ‌ద్ర సింగ్ ప‌ట్ల యాంటి ఇంకంబెన్సీ ప‌తాక స్థాయికి చేరింది. ప్ర‌భుత్వ పాల‌న నాసిర‌కంగా ఉంద‌ని నిపుణుల అభిప్రాయం. రాజ‌కీయంగా ప‌ట్టున్న‌ప్ప‌టికీ పాల‌న ప‌ట్ల దృష్టి పెట్ట‌డం లేద‌నేది ఆరోప‌ణ‌. దానికి తోడు అవినీతి ఆరోప‌ణ‌లు. వీర‌భ‌ద్ర‌సింగ్‌ను మార్చి పార్టీలో మ‌రొక‌రిని ప్ర‌క‌టించాల‌ని పిసిసి నాయ‌కులు, మ‌రికొంద‌రు పార్టీ పెద్ద‌లు రాహుల్ దృష్టికి తెచ్చారు కూడా. రాహుల్ గాంధీ కూడా వీర‌భ‌ద్ర‌సింగ్ ను సిఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డానికి వెనుక‌ముందు ఆలోచించారు. కానీ వీర‌భ‌ద్ర సింగ్‌కు బ‌దులుగా ఎన్నిక‌ల‌ను ఎదుర్కోగ‌లిగిన రాష్ట్ర స్థాయి ప‌ర్స‌నాలిటీ ఎవ‌రనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన పేర్ల‌న్నీ బిజెపిని నిలువ‌రించ‌గ‌లిగిన స్థాయిలో లేక‌పోవ‌డం కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద అవ‌రోధ‌మైంది.

సింగ్‌ లో పాల‌న లోపాలు, అవినీతి ఆరోప‌ణ‌లు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ సింగ్ కు అంత‌కు మించిన చ‌రిష్మా ఉంద‌ని సీనియ‌ర్లు గుర్తు చేయ‌డంతో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో వీర‌భ‌ద్ర సింగ్ పేరునే ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. వీర‌భ‌ద్ర సింగ్ పేరు మార్పు గ‌డ‌చిన ఎన్నిక‌ల‌లో కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. కానీ తాను సిఎం అభ్య‌ర్థి కాక‌పోతే ఊరుకునేది లేద‌నే స్థాయిలో సింగ్ అల్టిమేటం ఇచ్చారు. దాంతో పార్టీ నాయ‌కురాలు సోనియా రంగంలోకి దిగి సింగ్‌ను స‌మాధాన ప‌రిచారు.

కాంగ్రెస్ అస్త్రాలివి!

పార్టీలో సిఎం అభ్య‌ర్థి ప‌ట్ల భిన్నాభిప్రాయాల‌తో అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాల కోసం త‌డుము కోవాల్సిన ప‌ని లేకుండా మోదీ స్వ‌యంగా రెండు అస్త్రాల‌ను స‌మ‌కూర్చారు. అవి ఒక‌టి డీ మానిటైజేష‌న్‌, రెండ‌వ‌ది జీఎస్‌టి. కాంగ్రెస్ ఈ రెండింటినే ప్ర‌చారాస్త్రాలుగా చేసుకుంటోంది.

బిజెపి బ‌ల‌మేంటో!

బిజెపి పూర్తిగా వీర‌భ‌ద్ర‌సింగ్ పాల‌న మీద‌నే గురి పెడుతోంది. ఎన్నిక‌ల ముఖాలు మోదీ, అమిత్ షాల ద్వ‌య‌మే ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది. ప్ర‌తిప‌క్ష నేత‌కు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్రాధాన్యం క‌నిపిస్తోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ధుమాల్‌కు సంబంధాలున్నాయి. కానీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం అనేది అక్క‌డ‌ ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపించ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే త‌న పేరు ప్ర‌క‌టించ‌క‌పోతే ఒప్పుకునేది లేద‌నే స్థాయిలో మోదీని బెదిరించే ప‌రిస్థితి ఇప్పుడు బిజెపీలో లేదు. యుపి సిఎం ఆదిత్య‌నాథ్ కూడా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. బిజెపి అధికారంలోకి వ‌స్తే ఆ పార్టీ రాజ్య‌స‌భ‌ మెంబ‌ర్ , కేంద్ర‌మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా పేరు కూడా వినిపిస్తో్ంది.

ప్ర‌చారంలో…

పోటీ హారోహోరీగా సాగే సూచ‌న‌లే క‌నిపిస్తున్నాయి. అయితే ప్ర‌చారంలో బిజెపీ దూకుడుగా ఉంది. త‌మ బ‌ల‌హీన‌త ఎక్క‌డో క‌నిపెట్టి ద‌ళితుల ఓట్ల పైనే ప్ర‌ధానంగా దృష్టి పెట్టి పావులు క‌దుపుతోంది. ఆ పార్టీ నాయ‌కుల‌లో ధీమా క‌నిపిస్తోంది కూడా. 68 స్థానాలున్న హెచ్‌పి శాస‌న‌స‌భ‌లో గ‌త ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్‌కు 36, బిజెపికి 26 వ‌చ్చాయి. హెచ్ పి ఎల్‌పి, ఇండిపెండెంట్లు ఐదు స్థానాల‌ను గెలుచుకున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య‌ను తారుమారు చేయ‌డం సాధ్య‌మేనంటున్నారు. అందుకు వారు చూపిస్తున్న కేస్ స్ట‌డీ లోక్ స‌భ ఎన్నిక‌లే. 2012 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ది సీట్లు మైన‌స్‌లో ఉన్న బిజెపీ 2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల నాటికి అన్ని స్థానాల‌ను (నాలుగు స్థానాలు) గెలుచుకుని పూర్తి ఆధిక్యం సాధించింద‌ని గుర్తు చేస్తోంది ఆ పార్టీ రాష్ట్ర కేడ‌ర్‌. ఈ ద‌ఫా సిమ్లాలోని రిడ్జ్ మైదాన్‌లో ప్ర‌మాణ స్వీకారం ఎవ‌రు చేస్తారో? చూడాలి.

NEWS UPDATES

CINEMA UPDATES