✓ ప్ర‌మాద‌పుటంచుల్లో…. భార‌త‌దేశం

738

ఒక్క సిరా చుక్క ల‌క్ష మెద‌ళ్లకు క‌ద‌లిక‌… నిజ‌మే! ఈ మాట‌లో సందేహ‌మే లేదు. అందుకే సిరా చుక్క‌తో జ‌నంలో శాస‌నాలు రాయ‌గ‌లిగిన వాళ్ల‌ను చూస్తే భ‌యం. ముఖ్యంగా అధికారం చేతిలో ఉన్న వాళ్ల‌కు ఇంకా భ‌యం. త‌మ అధికారం ఎక్క‌డ చేజారి పోతుందోన‌ని భ‌యం. ఆ భ‌యం క‌ర్క‌శత్వానికి ప‌రాకాష్ట‌గా మారితే … ఇప్పుడు మ‌నం చూస్తున్న భార‌త‌దేశంగా మారింది.

జ‌ర్న‌లిస్టులు, హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, సామాజిక ఉద్య‌మ‌కారులు ప్రాణాలు కోల్పోతున్నారు. బెంగ‌ళూరులో గౌరీ లంకేశ్‌, చ‌త్తీస్‌గ‌డ్‌లో ఆదివాసీ నాయ‌కుడు జైల్లార్ ర‌థియా, మ‌హారాష్ట్రలో చంద్ర‌కాంత్ గైక్వాడ్‌ల హ‌త్య‌లు ఈ కోవ‌కే చెందుతాయి. భార‌తదేశం అత్యంత ప్ర‌మాద క‌ర దేశ‌మ‌ని అమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న్ స‌ర్వే వెల్ల‌డించింది. అంత‌కంటే ముందు నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశంలో పెరిగిన హ‌త్య‌ల‌ విష‌యాన్ని వెల్ల‌డించింది.

మోదీ ఏం చెప్పాడు? ఏం జ‌రుగుతోంది!

న‌రేంద్ర‌మోదీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ”బిజెపి అధికారంలోకి వ‌స్తే దారుణ మార‌ణ‌కాండ‌ల‌నేవి ఉండ‌వు” అని నొక్కి వ‌క్కాణించారు. అందుకు పూర్తి భిన్న‌మైన వాతావ‌ర‌ణాన్ని చూస్తున్నాం. భ‌యాన‌క ప‌రిస్థితుల్లో జీవిస్తున్నాం. ఎవ‌రైనా ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను సూటిగా ప్ర‌శ్నిస్తే చాలు… వాళ్లు హిట్‌లిస్టులో చేరిపోయిన‌ట్లే. ముందుగా వారి మీద జాతి వ్య‌తిరేకులు అనే ముద్ర ప‌డుతుంది. ఆ త‌ర్వాత ఓ కేస్ న‌మోద‌వుతుంది. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు వ్య‌క్తులు చ‌ట్టం నుంచి ర‌క్ష‌ణ కోరినా ప‌ట్టించుకునే వాళ్లు ఉండ‌రు. వ్య‌వ‌స్థ ఉద్దేశ‌పూర్వ‌క మౌనాన్ని ఆశ్ర‌యిస్తుంది. అంతా స‌ద్దుమ‌ణిగిపోయింద‌నుకున్న స‌మ‌యంలో ప్రాణం పోతుంది. కాదుకాదు ప్రాణాల‌ను అత్యంత క్రూరంగా తీసేస్తారు.

ఇదే విష‌యం మీద అమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియా ప్రోగ్రామ్స్ డైరెక్ట‌ర్ అస్మితా బ‌సు మాట్లాడారు. మాన‌వ‌హ‌క్కుల కోసం పోరాడుతున్న వారికి బెదిరింపులు వ‌స్తున్న‌ప్పుడు ప్ర‌భుత్వాలు స్పందించి త‌గిన ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుని ఉంటే ఈ మ‌ర‌ణాలు సంభ‌వించేవి కావు. ప్ర‌శ్నిస్తున్న గొంతును నొక్కేయాల‌నే ఆట‌విక న్యాయం ప్ర‌జాస్వామ్యంలో న‌డుస్తోంది. ప్ర‌శ్న‌కు మ‌న ద‌గ్గ‌ర స‌మాధానం లేక‌పోతే ఆ గొంతును న‌యానో భ‌యానో నొక్కేయాలి, లేదా ఇక ఆ గొంతు ఎప్ప‌టికీ పెగ‌ల‌కుండా ప్రాణం తీసేయాలి… ఇదే మోదీ పాల‌న‌లో న‌డుస్తున్న ధ‌ర్మం. భార‌తీయ‌త‌కు హిందూత్వ కు మ‌ధ్య అంతులేని అగాధాన్ని సృష్టించ‌డంలో విజ‌యం సాధించారు న‌యా జాతీయ‌వాదులు.

అమ్నెస్టీ ఇంకా ఏం చెప్పిందంటే!

”ప్రాణాంత‌క‌మే కానీ నివారించ‌వ‌చ్చు” అనే అంశం మీద‌ నిర్వ‌హించిన అధ్య‌నంలో ఆస‌క్తిక‌ర‌మైన‌, భ‌యాన‌క‌మైన వివరాలు వెల్ల‌డ‌య్యాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మాన‌వ‌హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల మీద దాడులు, వేధింపులు, బెదిరింపులు, హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న దేశాల్లో ఒక‌టి. భార‌త్‌, అర్జెంటీనా, బ్రెజిల్‌, కాంబోడియా, డెమోక్ర‌టిక్ రిప‌బ్లిక్ ఆఫ్ కాంగో, హోండూర‌స్‌, ఇండోనేషియా, కెన్యా, మెక్సికో, ర‌ష్యా, ద‌క్షిణాఫ్రికా, ద‌క్షిణ సుడాన్‌, సిరియా వంటి దేశాల్లో మాన‌వ‌హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. క్రియాశీలంగా ఉన్న వారిని, చ‌నిపోయిన వారి బంధువుల‌ను సంప్ర‌దించిన‌ప్పుడు ప్ర‌భుత్వ అల‌స‌త్వం బ‌య‌ట‌ప‌డింది. త‌మ‌కు భ‌ద్ర‌త క‌రువైంద‌ని, ర‌క్ష‌ణ క‌ల్పించ‌మ‌ని ప్ర‌భుత్వాల‌కు మొర పెట్టుకున్నా కూడా అధికారులు నిర్ల‌క్ష్యం గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అమెరికా కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. గ‌ణాంకాల ప్ర‌కారం 2016లో ప్ర‌పంచంలో ఈ ర‌కంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 281. వారిలో జ‌ర్న‌లిస్టులు 48 మంది. భార‌త్‌లో ప్రాణాలు కోల్పోయిన వారిలో జ‌ర్న‌లిస్టులు, భూ హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, ద‌ళితులు, ఆదివాసీలు, మైనారిటీల హ‌క్కుల ఉద్య‌మ‌కారులు ఉంటున్నారు.

ఇదంతా ఇలా ఉంటే… బిజెపి పాలిత రాష్ట్రాల్లో లెక్క‌లు కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అధికారులే వాటిని నొక్కి పెడుతున్నార‌ని స‌మాచారం. అది నిజం కాక‌పోతే ఆ లెక్క‌లు బ‌య‌ట‌పెట్ట‌డానికి అధికారులు కూడా భ‌య‌ప‌డుతుండాలి. కార‌ణం ఏదైనా దేశంలో పౌరులు ధైర్యంగా జీవించే హ‌క్కును కోల్పోతున్నార‌నేది నిజం.

NEWS UPDATES

CINEMA UPDATES