భారత క్రీడారంగంలో పల్లె పరిమళాలు

1154
  • పేదరికాన్ని జయించిన స్వప్న, హిమ, సరిత, ద్యుతీ
  • బ్రహ్మపుత్ర లోయ నుంచి హిమదాస్
  • సిలిగురి టీ తోటల నుంచి స్వప్న బర్మన్
  • గుజరాత్ గిరిజన జిల్లా నుంచి సరిత

మట్టికి…. మనిషికీ విడదీయరాని అనుబంధమే ఉంది. కేవలం మనిషికి మాత్రమే కాదు… సమస్త జీవరాశులకు అవసరమైన జవజీవాలను అందించేది…. ప్రకృతికి ప్రతిరూపమైన భూమి మాత్రమే. అపురూపమైన…. అత్యంత విలువైన మాణిక్యాలు సైతం మట్టి నుంచి రావాల్సిందే. జకార్తాలో ఇటీవలే ముగిసిన ఆసియాక్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత మహిళా అథ్లెట్లు సైతం భారత గ్రామీణ ప్రాంతాల మట్టి లో దొరికిన మాణిక్యాలే.

పల్లెపడుచుల పతకాభిషేకం….

జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్ లో… క్రీడారంగం అనగానే… సకల సౌకర్యాలు కలిగిన పట్టణ, నగరవాసులకు మాత్రమే అనుకొనే రోజులకు కాలం చెల్లింది. పీవీ సింధు, దీపిక పల్లికల్, మోనికా బాత్రా లాంటి క్రీడాకారులు న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి అంతర్జాతీయ క్రీడారంగంలోకి దూసుకొస్తే…. కష్టాలను అధిగమించి…

జకార్తా ఆసియాక్రీడల్లో భారత్ కు పతకాల పంట పండించిన స్వప్న బర్మన్, హిమ దాస్, సరిత గయక్వాడ్, ద్యుతీ చంద్, వినేశ్ పోగట్, కవిత ఠాకూర్ లాంటి అథ్లెట్లు… అరకొర సదుపాయాలు కలిగిన పల్లె ప్రాంతాల నుంచి అంతర్జాతీయస్థాయికి ఎదిగి… బంగారు కొండలుగా నిలిచారు.                      

పేదరికం, అత్యాధునిక సదుపాయాల లేమి లాంటి సమస్యలను అధిగమించి… ఆసియాక్రీడల విజేతలుగా దేశానికే గర్వకారణంగా నిలవటమే కాదు…నవతరంలో స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని నింపారు.

వారేవ్వా!… స్వప్న బర్మన్

బెంగాల్ లోని జల్పాయిగురిలోని… ఓ మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన 20 ఏళ్ల స్వప్న బర్మన్ తండ్రి రిక్షా కార్మికుడు కాగా…తల్లి ఓ టీ ఎస్టేట్ లో తేయాకులను తుంచే కార్మికురాలు.

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబానికి చెందిన స్వప్న… ఏడు అంశాల సమాహారం హెప్టాథ్లాన్ లో ఆసియాస్థాయిలో గుర్తింపు సంపాదించుకొంది.

అయితే… ఆసియాస్థాయి అథ్లెట్ గా ఎదగటానికి స్వప్న, ఆమె కుటుంబసభ్యులు ఎదుర్కొన్న సమస్యలు అన్నీఇన్నీ కావు.

పుట్టుకతోనే ఆరువేళ్ల పాదాలు కలిగిన స్వప్న… సాధారణ అథ్లెట్లు ఉపయోగించే బూట్లు ధరించి పాల్గొనడం ద్వారా…. భరించలేని నొప్పితో సావాసం చేస్తూ వచ్చింది. జాతీయ, ఆసియాస్థాయి పోటీలలో సైతం… బాధను భరిస్తూ పతకాల వేట కొనసాగించింది.

చివరకు…జకార్తా వేదికగా ముగిసిన 2018 ఆసియాక్రీడల హెప్టాథ్లాన్ లో స్వప్న బంగారు పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసియాక్రీడల చరిత్రలోనే హెప్టాథ్లాన్ లో భారత్ కు బంగారు పతకం అందించిన తొలి అథ్లెట్ గా రికార్డుల్లో చేరింది.

సిలిగురిలో… చాలీచాలని ఏ రేకుల షెడ్డులో నివాసం ఉండే స్వప్న..ఆసియాక్రీడల స్వర్ణం సాధించడం ద్వారా 30 లక్షల రూపాయల కేంద్రప్రభుత్వ నజరానా అందుకొంది. అంతేకాదు…బెంగాల్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతితో పాటు… ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం ప్రకటించింది.

ఒక్క స్వర్ణ పతకం…. స్వప్న జీవితాన్నే మార్చివేయడమే కాదు…. ఆమె స్వరాష్ట్రం బెంగాల్, నివాసం ఉండే సిలిగురికి సైతం ఎనలేని గుర్తింపు తెచ్చి పట్టింది.

బ్రహ్మపుత్రిక…. హిమ దాస్….

ఇక…. మహిళల 400 మీటర్ల పరుగులో అసోం ఎక్స్ ప్రెస్ హిమా దాస్ ఘనత గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది. అసోంలోని ఓ నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన హిమా…. ఫుట్ బాల్ ఆడుతూ…. ట్రాక్ అండ్ ఫీల్డ్ లోకి దూసుకు వచ్చింది. శిక్షకుడి ప్రోత్సాహంతో…. 400 మీటర్ల పరుగులో దృష్టి పెట్టింది.

ఫిన్లాండ్ వేదికగా ముగిసిన 2018 ప్రపంచ జూనియర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ 400 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డుతో బంగారు పతకం అందుకొంది. ఈఘనత సాధించిన భారత తొలిమహిళగా గుర్తింపు తెచ్చుకొంది.

అంతేకాదు….జకార్తా ఆసియాక్రీడల మహిళల 400 మీటర్ల పరుగులో రజత, మహిళల 400 మీటర్ల రిలే పరుగులో స్వర్ణ, మిక్సిడ్ రిలేలో రజత పతకాలు సాధించి… వారేవ్వా అనిపించుకొంది.

మూడు పతకాల విజేత హిమ దాస్ కు కేంద్ర ప్రభుత్వం 70 లక్షల రూపాయలు నజరానాగా ఇస్తే…అసోం ప్రభుత్వం ఏకంగా కోటీ 50 లక్షల రూపాయలు ప్రోత్సాహక బహుమతిగా ప్రకటించింది. అంతేకాదు…. అసోం రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ హోదాను సైతం సంపాదించింది.

గుజరాత్ ఊటీ నుంచి….

మహిళల 400 మీటర్ల రిలే పరుగులో బంగారు పతకం సాధించిన బృందంలో కీలక సభ్యురాలు సరిత గయక్వాడ్ పోరాటం చూస్తే…మరింత స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది.

గుజరాత్ లోని గిరిజన జిల్లా డంగ్ లోని కరాడీ అంబా గ్రామానికి చెందిన సరిత…. తన కుటుంబానికి అండగా నిలవటానికి, సంపాదన కోసం పరుగునే జీవనోపాధిగా ఎంచుకొంది.

విద్యుత్, తాగునీటి సదుపాయం లేని గ్రామానికి చెందిన సరిత…. ఖేల్ మహాకుంభ్ పేరుతో ఏటా నిర్వహించే జిల్లాస్థాయి క్రీడల్లో పాల్గొంటూ…. పరుగు అంశాలలో విజేతకు ఇచ్చే ఐదువేల రూపాయల నగదు బహుమతి కోసం పోటీ పడి… విజేతగా నిలుస్తూ వచ్చింది.

ఆ తర్వాత…రాష్ట్రస్థాయిలో, తర్వాత జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించడం ద్వారా…. జాతీయ రిలే జట్టులో చోటు సంపాదించింది. హిమ దాస్, పూవమ్మ, విస్మయలతో కూడిన జట్టులో సభ్యురాలిగా…. సరిత తనవంతు పాత్ర నిర్వర్తించింది.

ఆసియాక్రీడల రిలే పరుగు బంగారు పతకంతో… దేశానికి, గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే కాదు…మారుమూల గిరిజనులకే గుర్తింపు తీసుకు వచ్చింది.

హర్యానా మల్లయోధురాలు….

2018 ఆసియాక్రీడల్లో భారత్ కు తొలి బంగారు పతకం అందించిన వినేశ్ పోగట్…. హర్యానాలోని ఓ మల్లయోధుల కుటుంబం నుంచి ప్రపంచ స్థాయి మల్లయోధురాలిగా ఎదిగింది.

గాయాలతో రియో ఒలింపిక్స్ లో విఫలమైనా… ఆ తర్వాత పుంజుకొని… జకార్తా గేమ్స్ స్వర్ణంతో సత్తా చాటుకొంది.

ప్రపంచ స్థాయిలో దేశానికి స్వర్ణాలు సాధించడంలో పురుషులకు… మహిళలు ఏమాత్రం తీసిపోరని చాటి చెప్పింది.

ఒడిషా వండర్…..

ఒరిస్సాలోని…ఓ నిరుపేద చేేనేత కుటుంబం నుంచి భారత క్రీడారంగంలోకి వచ్చిన ద్యుతి చంద్..పలురకాల సమస్యలు, ప్రతిబంధకాలను అధిగమించి….జకార్తా ఆసియాక్రీడల 100, 200 మీటర్ల పరుగులో రజత పతకాలు సాధించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచింది.

ద్యుతీ చంద్ కు కేంద్రప్రభుత్వ నజరానా 40 లక్షల రూపాయలతో పాటు…ఒడిషా ప్రభుత్వం సైతం 3 కోట్ల రూపాయలు నగదు బహుమతిని అందించి ప్రోత్సహించింది.

పాచిపనులు చేసి పతక విజేతగా….

ఇక…ఆసియాక్రీడల కబడ్డీలో రజత పతకం సాధించిన భారతజట్టులో సభ్యురాలిగా ఉన్న కవిత ఠాకూర్ సైతం…హిమాచల్ ప్రదేశ్ లోని ఓ నిరుపేద కుటుంబం నుంచే ఆసియాక్రీడల స్థాయికి ఎదిగింది.

అమ్మానాన్నలకు చేదోడువాదోడుగా ఉండటం కోసం…. మండీ లోయలోని ఓ దాబాలో పాచిపనులు చేస్తూ వచ్చింది. చివరకు కబడ్డీలో నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా జాతీయజట్టులో చోటు సంపాదించి…. ఆసియాక్రీడల పతకాలతో తానేమిటో నిరూపించుకొంది.

ఇటీవలి ఆసియాక్రీడల్లో…. పతకాలు సాధించిన ఈ మహిళా అథ్లెట్లు అందరూ దేశంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాత్రమే కాదు…. మాణిక్యాలు మట్టినుంచి మాత్రమే వస్తాయని…. తమ అపూర్వ విజయాలతో చాటి చెప్పారు.

మరో రెండేళ్లలో టోక్యో వేదికగా జరిగే 2020 ఒలింపిక్స్ లో సైతం పతకాల మోత మోగించాలని కోరుకొందాం.     

NEWS UPDATES

CINEMA UPDATES