ఇరాన్ యువతుల మహా సాహసం

5579
  • గడ్డాలు, మీసాలు ధరించి సాకర్ స్టేడియంలో ప్రవేశించిన ఇరానీ మహిళలు
  • మారువేషాలలో పురుషుల ఫుట్ బాల్ మ్యాచ్ కు హాజరైన యువతులు
  • పురుషుల మ్యాచ్ లకు మహిళలు హాజరుకావడం ఇరాన్ లో నిషేధం

ఇరాన్… ఇస్లామిక్ సిద్ధాంతాలు, నియమనిబంధనల ప్రకారం పరిపాలనసాగే దేశం. ఇక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం… స్టేడియాలలో పురుషులు ఆడే ఫుట్ బాల్ మ్యాచ్ లకు మహిళలు హాజరుకావడం పూర్తిగా నిషేధం.

ఇరాన్ గడ్డపైనే జరిగే ఫుట్ బాల్ మ్యాచ్ లకు కేవలం పురుషులు మాత్రమే హాజరుకావడం సాధారణ విషయం. అయితే… పురుషుల పోటీలకు మహిళలు హాజరుకావడం నేరం. కఠినమైన శిక్షలు సైతం ఉంటాయి.

పురుషుల సాకర్ మ్యాచ్ లకు తాము హాజరుకావడం పై నిషేధం ఉందని తెలిసీ… కొందరు ఇరానీ యువతులు మారువేషాలలో… మీసాలు, గడ్డాలు ధరించి మరీ…ఫుట్ బాల్ మ్యాచ్ లకు హాజరై సంచలనం సృష్టించారు.

ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో అజాదీ స్టేడియంలో జరిగిన జాతీయ సాకర్ లీగ్ మ్యాచ్ లో తమ అభిమానజట్టు పెర్సిపోలిస్ ను ఉత్సాహపరచడానికి కొందరు మహిళలు గొప్పసాహసమే చేశారు.

మారువేషాలతో స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూసిన చిత్రాలు… ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి… అమెరికాలో ప్రవాసం ఉంటున్న ఇరాన్ మహిళాహక్కుల పోరాటసమితి అధ్యక్షురాలు మెలోడీ సఫావీ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ సాహసం అభినందనీయమంటూ యువతులపై పొగడ్తల వర్షం కురిపించారు.  ఇరాన్ ఫుట్ బాల్ చరిత్రలో ఇదో సరికొత్త అధ్యాయమంటూ ఆకాశానికి ఎత్తేశారు.

 ఇరానీ మహిళలు… ఏ క్రీడలలో పాల్గొన్నా శరీరభాగాలు కనపడకుండా తల నుంచి కాళ్ల వరకూ పూర్తిస్థాయిలో దుస్తులు ధరించేలా నిబంధనలు ఉన్నాయి. అంతేకాదు… మహిళల మ్యాచ్ లకు మహిళలు మాత్రమే హాజరుకావాలన్న నిబంధన సైతం ఉంది.

NEWS UPDATES

CINEMA UPDATES