బెంగ‌ళూర్‌లో ఇర్ఫాన్ ప‌ఠాన్ క్రికెట్ అకాడ‌మీ

586

టీమిండియాలో ఒక‌ప్పుడు కీల‌కంగా ఉన్న ప‌ఠాన్ బ్ర‌ద‌ర్స్ ప్ర‌స్తుతం యంగ్ క్రికెట‌ర్స్‌ను తీర్చిదిద్దే ప‌నిలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా ప‌లు చోట్ల క్రికెట్ అకాడ‌మీలు స్థాపిస్తున్నారు. ”క్రికెట్ అకాడ‌మీ ఆఫ్ ప‌ఠాన్స్” అనే పేరిట తాజాగా బెంగ‌ళూర్‌లో ఓ అకాడ‌మీని నెల‌కొల్పారు. ద‌క్షిణ భార‌త‌దేశంలో తొలి అకాడ‌మీని స్థాపించే క్ర‌మంలో బెంగ‌ళూర్‌ను ఎంపిక చేసుకున్నారు.

అత్యంత ఆధునిక స‌దుపాయాల‌తో కూడిన ఈ అకాడ‌మీలో కుర్రాళ్ల‌ను మెరిక‌ల్లా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భార‌త‌దేశంలో ప్ర‌తిభ‌కు కొద‌వ లేద‌ని…వారికి స‌రైన శిక్ష‌ణ అందిస్తే అద్భుతాలు చేస్తార‌ని ఇర్ఫాన్ ప‌ఠాన్ బెంగ‌ళూర్‌లోని హ‌ల‌లూర్ రోడ్డులో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ధీమా వ్య‌క్తం చేశాడు. అకాడ‌మీలో చేరిన వారిలో కొంద‌రిని ఎంపిక చేసి… వారికి ప్ర‌త్యేక ట్రైనింగ్ ఇవ్వ‌నున్న‌ట్లు ఇర్ఫాన్ ప‌ఠాన్ వివ‌రించాడు. కోచింగ్ లో చేరేందుకు వ‌చ్చిన పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌తో ఇర్ఫాన్ ప‌ఠాన్ చాలా విష‌యాలు మాట్లాడాడు.

ప‌ఠాన్ అకాడ‌మీలో 6 నుంచి 21 సంవ‌త్స‌రాల వ‌య‌సు వారికి కోచింగ్ ఇస్తారు. మొత్తం ట్రైనింగ్ 7 మాడ్యూల్స్ లో జ‌ర‌గ‌నుంది. ప్ర‌తి మాడ్యూల్ 4 నెల‌ల పాటు ఉంటుంది. క్రికెట్‌తో పాటు న్యూట్రిష‌న్‌, డ‌య‌ట్ ప్లాన్ త‌దిత‌ర అంశాల‌ను కూడా చిన్న‌నాటి నుంచే పిల్ల‌ల‌కు వివ‌రించ‌నున్నారు. అకాడ‌మీలో క్రికెట్ కోచ్‌ల‌తో పాటు సైకాల‌జిస్టులు, ఫిజియోథెర‌పిస్టులు కూడా క్రీడాకారుల‌కు అందుబాటులో ఉండ‌నున్నారు.

క్రికెట్ కోచింగ్ టెక్నాల‌జీలో ప్ర‌సిద్ధి చెందిన పిచ్ విజ‌న్ ప‌ఠాన్ అకాడ‌మీకి తోడ్పాటు నందిస్తోంది. వీడియోల రూపంలో కోచింగ్ మెటీరియ‌ల్ కూడా కోచింగ్ లో చేరిన వారికి అందించ‌నున్నారు. పిల్ల‌ల త‌ల్లిదండ్రులు ప‌ఠాన్ బ్ర‌ద‌ర్స్‌తోను, కోచింగ్ స్టాఫ్‌తోను త‌మ అభిప్రాయాలు పంచుకునేందుకు ఒక ప్ర‌త్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి ఉంచారు.

ప్ర‌స్తుతం ప‌ఠాన్ బ్ర‌ద‌ర్స్ ఇప్ప‌టి వ‌రకు దేశంలో ప‌ది క్రికెట్ అకాడ‌మీలు స్థాపించారు. వ‌చ్చే ఏడాది జూన్ నాటికి మ‌రో 20 క్రికెట్ అకాడ‌మీల‌ను మ‌రికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు స‌న్నాహాలు ప్రారంభించారు.

NEWS UPDATES

CINEMA UPDATES