ఇస్రో మాజీ సైంటిస్టుకు 50 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం

860

ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయ‌ణ్‌కు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. గూఢ‌చ‌ర్యం కేసు నుంచి విముక్తి ల‌భించింది. దానితో పాటు నంబి నారాయ‌ణ‌కు 50 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం కూడా కేటాయించింది. చీఫ్ జ‌స్టిన్ దీప‌క్ మిశ్రా, జ‌స్టిస్ ఎఎం క‌న్విల్క‌ర్, డివై చంద్ర‌చూద్‌ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది.

ముగ్గురు స‌భ్యుల క‌మిటీ….

నంబియార్‌ను గూఢ చ‌ర్యం కేసులో ఇరికించిన వారిని ప‌ట్టుకునేందుకు ముగ్గురు స‌భ్యులు గ‌ల ఒక క‌మిటీని కూడా సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్ర‌తిపాదిత క‌మిటీ రిటైర్డ్ జ‌డ్జి డికె జైన్‌ నేతృత్వంలో ఏర్పాటు కానుంది. ఈ క‌మిటీలో కేంద్రం నుంచి ఒక‌రు, కేర‌ళ రాష్ట్రం నుంచి ఒక‌రు ఉండ‌నున్నారు.

సుప్రీం త‌లుపుత‌ట్టిన నంబి నారాయ‌ణ్

కేర‌ళ పోలీసులు, ఇత‌ర ఏజెన్సీలు నంబి నారాయ‌ణ్‌పై కేసులు న‌మోదు చేసి ఇబ్బందుల‌కు గురిచేశారు. ఈ కేసులో డిజిపితో పాటు మాజీ సూప‌రింటెండెంట్‌లైన కెకె జోషువా, ఎస్ విజ‌య‌న్‌లు నంబియార్‌పై కేసు న‌మోదు చేయ‌డంలో అత్యుత్సాహం చూపించారు.

నంబియార్ విష‌యంలో వీరి ముగ్గురి వ్య‌వ‌హారాన్ని సిబిఐ త‌ప్పుగా తేల్చింది. నంబియార్‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డంలో వీరే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని తేల్చి చెప్పింది. అయిన‌ప్ప‌టికీ కేర‌ళ హైకోర్టు ఈ విష‌యాన్ని విస్మ‌రించింది. ఆ ముగ్గురు అధికారుల‌కు అండ‌గా నిలిచింది. వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు నిరాక‌రిస్తూ తీర్పు వెలువ‌రించింది. ఈ విష‌యాన్ని ఇక్క‌డి వ‌ద‌ల‌కూడ‌ద‌ని భావించిన నంబియార్ హైకోర్టు తీర్పును త‌ప్పుబ‌డుతూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అనుకున్న‌ది సాధించారు.

50 రోజుల పాటు జైలు జీవితం

1994 లో ఇస్రోలో క్ర‌యోజెనిక్స్ విభాగానికి అధిప‌తిగా ఉన్న నంబి నారాయ‌ణ్‌పై గూఢ‌చ‌ర్యం కేసు పెట్టి అరెస్ట్ చేశారు. 50 రోజుల పాటు జైలులో ఉంచారు. విచార‌ణ పేరిట న‌ర‌కం చూపించారు. విచార‌ణ పేరిట అధికారులు పాల్ప‌డిన హింస వ‌ల్ల నంబి నారాయ‌ణ్ ప‌లు మార్లు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. 1996లో సిబిఐ నంబి నారాయ‌ణ్‌పై కేసును కొట్టివేసింది. 1998లో సుప్రీంకోర్టు ల‌క్ష రూపాయ‌ల ప‌రిహారం ప్ర‌క‌టించింది.

10 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాల‌ని ఆదేశించిన మాన‌వ హ‌క్కుల సంఘం

1999లో నంబి నారాయ‌ణ్ జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘాన్ని ఆశ్ర‌యించారు. కేసు పూర్వాప‌రాలు పరిశీలించిన మాన‌వ హ‌క్కుల సంఘం నంబి నారాయ‌ణ్‌కు 10 ల‌క్ష‌ల నష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. నంబి నారాయ‌ణ్ కెరీర్ నాశ‌నం చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

అప్పటి కేర‌ళ ప్ర‌భుత్వం ప‌రిహారం ఇవ్వడానికి నిరాక‌రించింది. అదే విధంగా నంబి నారాయ‌ణ్‌ను కేసులో ఇరికించిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోడానికి కూడా సంశ‌యించింది. దీంతో ఆయ‌న 2015లో ఉన్న‌త న్యాయ‌స్థానం త‌లుపులు త‌ట్టారు. అలుపెరుగ‌ని పోరాటం చేశారు. విజయం సాధించారు.

NEWS UPDATES

CINEMA UPDATES