పోలీసుల కంటే హిజ్రాలు నయం – జేసీ….. పీఎస్‌ ముందు హిజ్రాల డ్యాన్సులు

1110

తాడిపత్రిలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. చిన్నపొలమడ, పెదపొలమడ గ్రామస్తులకు ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులకు మధ్య పదేపదే ఘర్షణలు జరుగుతున్నాయి. రెండు గ్రామాల వారు జేసీ అనుచరులు కావడంతో తొలుత వీరే గొడవ రాజేస్తున్నారని భావించారు. కానీ ధ్యానం చేసుకోవాల్సిన ఆశ్రమ నిర్వాహకుల వైపు నుంచి కూడా ఊహించని స్థాయిలో ప్రతిఘటన వస్తుండడం చూసి కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆశ్రమం నుంచి ఆందోళన చేస్తున్న గ్రామస్తుల పైకి రాళ్ల వర్షం కురుస్తుండడం, ఇప్పటికే రెండు గ్రామాలకు చెందిన వారి ట్రాక్టర్లను, ఆటోలను, బైకులను ఆశ్రమ నిర్వాహకులు తగలబెట్టడంతో ఆశ్రమంలో ఎవరున్నారన్న దానిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చినపొలమడ, పెదపొలమడ గ్రామస్తులకు మద్దతుగా జేసీ దివాకర్‌ రెడ్డే ఆశ్రమం వద్దకు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. ఆసమయంలో మరోసారి ఆశ్రమం లోపలి నుంచి రాళ్ల దాడి జరిగింది. దీంతో ఇటువైపు నుంచి రాళ్లు రువ్వారు.

జేసీ దివాకర్‌ రెడ్డికి కూడా రాయి తగిలినట్టు చెబుతున్నారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్‌ రెడ్డి వర్గీయులు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించిన జేసీ… పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. ఆశ్రమం లోపల నుంచి రాళ్ల దాడులు జరుగుతుంటే ఒక్క పోలీసు కూడా ముందుకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు.

ఎస్పీ నుంచి ఎస్‌ఐ వరకు అందరూ ముందే వెనక్కు పారిపోయారని చెప్పారు. తాడిపత్రిలో పోలీసుల తీరు కంటే హిజ్రాలు నయమని వ్యాఖ్యానించారు. ఆశ్రమంలో వాళ్లు దాడులు చేస్తుంటే అడ్డుకునేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మగాళ్లే లేరా అని ప్రశ్నించారు.

ఆశ్రమం లోపల ఎవరున్నారు.. అక్కడ ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి చూపించాలని జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద జేసీ వర్గీయులు హిజ్రాలను తీసుకొచ్చి డ్యాన్సులు వేయించారు.

NEWS UPDATES

CINEMA UPDATES