రెచ్చిపోయిన జేసీ వర్గీయులు…. ఆశ్రమం వద్ద రణరంగం

1393

తాడిపత్రి నియోజకవర్గంలో మరోసారి శాంతిభద్రతల సమస్య తలెత్తింది. తాడిపత్రి సమీపంలోని ప్రబోధానందస్వామి ఆశ్రమం వద్ద జేసీ వర్గీయులు రణరంగం సృష్టించారు. కొద్దికాలంగా ఆశ్రమ నిర్వాహకులకు, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డికి పడడం లేదు.

ఈ నేపథ్యంలో చినపడమల, పెదపడమల గ్రామస్తులు ఆశ్రమంపై దాడి చేశారు. రాళ్లు రువ్వారు. కర్రలతో దాడి చేశారు. ఈ దాడుల్లో 15 మంది గాయపడ్డారు. ఆశ్రమం వద్ద నాలుగు ట్రాక్టర్లకు నిప్పుపెట్టి కాల్చేశారు. మూడు ఆటోలు, రెండు బైకులను దగ్ధం చేశారు.

అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపైనా రాళ్లు రువ్వారు. గంట పాటు ఆశ్రమ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. తమ ఆశ్రమంపై జేసీ ప్రభాకర్‌ రెడ్డే దాడి చేయించారని ఆశ్రమ నిర్వాహకులు మహేష్‌, సూర్య ఆరోపించారు. జేసీ వర్గీయులకు సీఐ సురేంద్ర రెడ్డి సహకరించారని ఆరోపించారు.

ఆశ్రమంపై దాడి చేయించిన జేసీ ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అటు ఆశ్రమంపై దాడి నేపథ్యంలో ప్రబోధానందస్వామి ఆశ్రమ భక్తులు తాడిపత్రిలో ఆందోళనకు దిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.

NEWS UPDATES

CINEMA UPDATES