బజారున పడ్డ భారత గ్రామీణ క్రీడ కబడ్డీ ….

781
  • కబడ్డీ సంఘాల కుమ్ములాటతో నవ్వులపాలు
  • ఫార్సుగా ముగిసిన భారత కబడ్డీ జట్ల ఎంపిక
  • రాజధాని ఢిల్లీలో కబడ్డీ సంఘాల సిగపట్లు

భారత గ్రామీణ క్రీడ కబడ్డీ… రాజధాని ఢిల్లీ నగరం సాక్షిగా నవ్వులపాలయ్యింది. జకార్తా వేదికగా ముగిసిన ఆసియాక్రీడలకు భారతజట్ల ఎంపికలో చోటు చేసుకొన్న వివాదం కాస్త చిలికిచిలికి గాలివానలా మారింది.

చివరకు… భారతజట్ల ఎంపిక విషయంలో ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీ హైకోర్టు నియమించిన పరిశీలకుడి నేతృత్వంలో జరగాల్సిన కబడ్డీ జట్ల సెలెక్షన్ ట్రయల్స్ కాస్త…. కబడ్డీ సంఘాల బల ప్రదర్శనగా మారిపోయాయి.

అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్  ఇండియా, నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వర్గాలు…పురుషుల, మహిళల విభాగాలలో తమతమ జట్లతో ఎంపికకు హాజరయ్యాయి. వీటిలో అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు మాత్రమే … స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. అయితే ఎంపిక నిర్వహించడానికి విధివిధానాలు స్పష్టంగా లేకపోడంతో… గందరగోళ పరిస్థితి నెలకొనడంతో… సెలెక్షన్ ట్రయల్స్ కాస్త అర్థంతరంగా ముగిసిపోయాయి.

మరోవైపు…ప్రశాంతంగా సాగే కబడ్డీ క్రీడను న్యాయస్థానాల వరకూ తీసుకురావడం పట్ల….2002, 2006 ఆసియా క్రీడల కబడ్డీ గోల్డ్ మెడలిస్ట్ దినేశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కబడ్డీ సమాఖ్యలోని రెండు సంఘాల ముఠా కుమ్ములాటలు తనను తీవ్రనిరాశకు గురి చేశాయని…ఈ పరిస్థితికి అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు.

జకార్తా ఏషియాడ్ కు బలమైన జట్లనే ఎంపిక చేశారని…అయితే…కీలక సమయాలలో వ్యూహాత్మక తప్పిదాలతో స్వర్ణాలు గెలుచుకోలేక పోయామని దినేశ్ చెప్పాడు.

ఆసియా క్రీడల మహిళల కబడ్డీ ఫైనల్లో ఇరాన్ చేతిలో ఓటమితో భారత్ రజతంతో సరిపెట్టుకోగా…పురుషుల క్వార్టర్ ఫైనల్లో కొరియా, సెమీఫైనల్లో ఇరాన్ జట్ల చేతిలో పరాజయాలు పొందడం ద్వారా…. భారత్ చివరకు కాంస్యంతో సరిపెట్టుకొన్న సంగతి తెలిసిందే.

NEWS UPDATES

CINEMA UPDATES