ట్రైలర్ ప్రదర్శించినందుకు ఆ సినిమా హాల్‌ ధ్వంసం

376

ప‌ద్మావ‌తి చిత్రంపై నెల‌కొన్న వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ప‌ద్మావతి చిత్ర ట్రైల‌ర్ ప్ర‌సారం చేసిన రాజస్థాన్‌లోని ఆకాశ్ సినిమా హాల్‌ను ధ్వంసం చేశారు.
క‌ర్నీసేన‌కు చెందిన దాదాపు 50 మంది హాలులోకి ప్ర‌వేశించి విధ్వంసం సృష్టించారు.

హాలులో ఫ‌ర్నీచ‌ర్‌ను, టెక్కెట్ కౌంట‌ర్ల‌ను, గ్లాస్ గేట్ల‌ను ధ్వంసం చేశారు. కొంద‌రు క‌ర్నీసేన కార్య‌కర్త‌లు సినిమా హాలులోనే ఉన్నారు. ట్రైల‌ర్ ప్ర‌సారం కాగానే ఒక్క‌సారిగా వారంద‌రూ బ‌య‌ట‌కు వచ్చి విధ్వంసానికి దిగారు.

సినిమా హాలు మేనేజ‌ర్‌కి మెమోరాండం స‌మ‌ర్పించారు. ట్రైల‌ర్‌ను ప్ర‌సారం చేయ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. దీంతో ఆ హాలులో ట్రైల‌ర్ ప్ర‌సారం చేయ‌డాన్ని నిలిపివేశారు.

క‌ర్నీసేన చేసిన విధ్వంసం అంశాన్ని హాలు మేనేజ‌ర్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. క‌ర్నీసేన‌పై ఫిర్యాదు చేశారు. దీంతో 30 మందిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసు విష‌యంలో ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు గుమ‌న్‌పురా పోలీస్ స్టేష‌న్ సీఐ ఆనంద్ యాద‌వ్ తెలిపారు.

మ‌రోవైపు ప‌ద్మావతి చిత్రాన్ని జిల్లాలో విడుద‌ల చేయ‌వ‌ద్ద‌ని స‌ర్వ హిందు స‌మాజ్ స‌భ్య‌లు ర్యాలీలు చేప‌ట్టారు. అలాగే రాజ్‌పూత్ క‌ర్నీసేన క‌లెక్ట‌రేట్ వ‌ర‌కు నిర‌స‌న ర్యాలీని నిర్వ‌హించింది.

ప‌ద్మావ‌తి చిత్రానికి వ్య‌తిరేకంగా బెంగ‌ళూర్‌లో భారీ ర్యాలీ

ప‌ద్మావతి చిత్రం విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆ చిత్రంపై నిర‌స‌న‌లు తీవ్ర‌త‌రం అవుతున్నాయి. ఇప్ప‌టికే గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌లో ఈ చిత్రంపై తీవ్ర‌స్థాయిలో ఆందోళ‌న‌లు చెల‌రేగ‌గా తాజాగా బెంగ‌ళూర్‌లో కూడా ఆందోళ‌న‌లు ఊపందుకున్నాయి.

రాష్ట్రీయ రాజ్‌పుత్ క‌ర్నీసేన స్వాభిమాన్ పాద‌యాత్ర పేరిట భారీ ర్యాలీ నిర్వ‌హించింది. ఈ రోజు ఉద‌యం టౌన్ హాల్ వ‌ద్ద ప్రారంభం అయిన ఈ ర్యాలీ ఫ్రీడ‌మ్ పార్క్ వ‌ర‌కు సాగింది.

హిందువుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌రిచే విధంగా ఉన్న ప‌ద్మావ‌తి చిత్రానికి సెన్సార్ బోర్డ్ స‌ర్టిఫికేట్‌ను నిరాక‌రించాల‌ని బెంగ‌ళూర్ క‌ర్నీసేన స‌భ్యులు కోరారు. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తూ తీసిన సినిమాను విడుద‌ల చేయ‌కుండా చూడాల‌ని వారు కోరారు.

కేవ‌లం డ‌బ్బులు సంపాదించాల‌నే ఉద్దేశ్యంతో సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఈ సినిమాను రూపొందించాడ‌ని క‌ర్నీసేన స‌భ్యులు ఆరోపిస్తున్నారు. దేశంలో అన్ని ప్రాంతాల్లోను ఈ చిత్రానికి వ్య‌తిరేకంగా ఆందోళన‌లు చేప‌డ‌తామ‌ని వారు తెలిపారు.

చిత్రం విడుద‌ల‌కు ముందు త‌మ‌లోని కొంద‌రు నాయ‌కుల‌కు ప‌ద్మావ‌తి చిత్రాన్ని చూపించాల‌ని…వారి నుంచి అభ్యంత‌రాలు లేక‌పోతేనే సినిమాను విడుద‌ల చేయాల‌ని భ‌న్సాలీ కి వారు సూచించారు.

NEWS UPDATES

CINEMA UPDATES