కేసీఆర్‌కి ఓయు అర్ధం కావ‌డం లేదా?

391

ఉస్మానియా యూనివ‌ర్శిటీ తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోసింది. అయితే ప్ర‌స్తుతం ఈ యూనివ‌ర్శిటీ కేసీఆర్‌కి వ్య‌తిరేక అడ్డాగా మారింది. ఒక‌ప్పుడు కేసీఆర్‌కి నీరాజ‌నాలు ప‌లికిన ఉస్మానియా యూనివ‌ర్శిటీలో ఏం జ‌రుగుతోంది? విద్యార్థులు కేసీఆర్‌కి వ్య‌తిరేకంగా మారిపోవ‌డానికి కార‌ణాలు ఏంటి? అనే విష‌యాలు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ముర‌ళీ అనే విద్యార్థి సూసైడ్ మ‌ళ్లీ ఓయులో మంట రాజేసింది. ఈ సంద‌ర్భంగా ఓయులో ఆందోళ‌న‌లు, పోలీసుల లాఠీచార్జ్‌తో ఉద్రిక్త‌త త‌లెత్తింది. కేసీఆర్‌కి వ్య‌తిరేకంగా దిష్టిబొమ్మ‌ల ద‌హ‌నాలు జ‌రిగాయి. అయితే ఇక్క‌డ ఓయుపై అధికార‌ పార్టీ ప‌ట్టుకోల్పోయింద‌నే సంగ‌తిని బ‌య‌ట‌పెట్టింది.

గ‌తంలో శ‌తాబ్ధి ఉత్స‌వాల్లో కేసీఆర్ మాట్లాడితే విద్యార్థులు గొడ‌వ చేసే ప‌రిస్థితి ఉంద‌ని నిఘా వ‌ర్గాల స‌మాచారంతో ఆయ‌న ప్ర‌సంగించ‌లేదు. అక్క‌డి నుంచి ఓయులో కేసీఆర్‌కి వ్య‌తిరేక ప‌రిణామాలు జ‌రుగుతూనే ఉన్నాయి. కులాల వారీగా ఓటు బ్యాంకును త‌యారు చేసుకుంటున్న కేసీఆర్ మొద‌టి నుంచి ఓయుపై మాత్రం దృష్టిపెట్టడం లేదు. ఒక‌ప్పుడు ఇక్క‌డ విద్యార్థి నాయ‌కులుగా చ‌లామ‌ణీయైన నేత‌లు…ఇప్పుడు గులాబీ లీడ‌ర్లు అయ్యారు. వారు పైర‌వీకారులుగా మారిపోయి ఓయు వైపు మాత్రం చూడ‌లేదు. దీంతో ఓయులో టీఆర్ఎస్వీ విభాగం రోజురోజుకు డ‌ల్ అవుతోంది.

ఇటు ఉద్యోగాల ప్ర‌క‌ట‌న లేకపోవ‌డంతో విద్యార్థుల్లో అస‌హ‌నం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌క‌టించిన ఉద్యోగాలు బిటెక్ వాళ్ల‌కే ఎక్కువ వ‌చ్చాయి. దీంతో ఓయులో ఉండే ఆర్ట్స్ విద్యార్థులకు ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం పోటీ ప‌డే అవ‌కాశం రావ‌డం లేదు. దీంతో ప్ర‌భుత్వంపై పెట్టుకున్న ఆశ‌లు రోజురోజుకు విద్యార్థుల్లో స‌న్న‌గిల్లుతున్నాయి. ఇటు ఈ మూడేళ్ల‌లో టీఆర్ఎస్‌కు చెందిన మంత్రులు, నేత‌లు ఎవ‌రూ కూడా ఓయులో ప‌ర్య‌టించ‌లేదు. ఒకరిద్ద‌రు వ‌చ్చినా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. దీంతో ఓయు పేరు చెబితే ఇప్పుడు టీఆర్ఎస్ నేత‌లు వ‌ణికిపోయే రోజులు వ‌చ్చాయి.

NEWS UPDATES

CINEMA UPDATES