అక్ష‌రాలు దిద్దించే ప్రేర‌ణ‌

5558

ఇఫ్ దేర్ ఈజ్ విల్… దేర్ ఈజ్ ఆల్సో ఎ వే… ఈ వాక్యంలో ఉన్నంత అర్థం ప‌ర‌మార్థం మ‌రే సేయింగ్‌లోనూ ఉండ‌దేమో. జీవితంలో దీనిని ఉప‌యోగించినంత ఎక్కువ‌గా మ‌రే నానుడినీ వాడ‌మేమో! అక్ష‌రాస్య‌త మీద‌ కేర‌ళ కు ఉన్న చిత్త‌శుద్ధిని గ‌మ‌నిస్తే ఈ మాట అన‌కుండా ఉండ‌లేం.

కేర‌ళ‌లో అక్ష‌రాస్య‌త శాతం 93.91. నూటికి నూరుశాతం చ‌దువుకున్న వాళ్లే అనిపిస్తుంటుంది ఆ రాష్ట్రంలో. గ్రామాల్లో కూడా చ‌దువురాని వాళ్లు క‌నిపించ‌రు. అయినా ఈ ఆరుశాతం గ్యాప్ ఎక్క‌డ వ‌చ్చిందీ అని ఆరా తీస్తే… అది గిరిజ‌న ప్ర‌దేశాల‌లో అని తేలింది. వాళ్ల చేత అక్ష‌రాలు దిద్దించడానికి రంగం సిద్ధ‌మైందిప్పుడు.

రేపే ప్రారంభం!

కేర‌ళ రాష్ట్రం ప‌శ్చిమ క‌నుమ‌ల‌లో విస్త‌రించి ఉంటుంది. ప‌చ్చ‌టి కొండ‌లు, గిరిజ‌న సంస్క్రృతి, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ గురించి చెప్పించుకోకుండా పాటించే మ‌నుషులు మ‌న‌కు క‌నిపిస్తుంటారు. ప‌ర్వ‌త ప్రాంతాల్లో నివ‌సించే గిరిజ‌నుల్లో ఎవ‌రి క‌ల్చ‌ర్ వారిదే అన్న‌ట్లు, బ‌య‌టి ప్ర‌పంచంతో సంబంధం లేన‌ట్లు ఉంటారు. ట్రైబ‌ల్ వెల్‌ఫేర్ కోసం ప్ర‌భుత్వం ఎన్ని స్కీమ్‌లు పెట్టినా వారిని చేర‌డం లేదు. చ‌దువులేక‌పోవ‌డ‌మే అందుకు కార‌ణం.

ప్ర‌భుత్వం అనేది ఒక‌టి ఉంటుంద‌ని, అది ప‌రిపాల‌న చేస్తుంద‌నే క‌నీస‌ ప‌రిజ్ఞానం లేకుండా జీవించేస్తున్న గిరిజ‌నాన్ని ప్ర‌ధాన స్ర‌వంతిలోకి తేవాల‌న్న‌దే ఇప్పుడు చేస్తున్న ప్ర‌య‌త్నం.”కేర‌ళ స్టేట్ లిట‌ర‌సీ మిష‌న్ అథారిటీ” గిరిజ‌నుల అక్ష‌రాస్య‌త కోసం ప్రేర‌క్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. దీనిని రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ రాజ‌ధాని తినువ‌నంత‌పురంలో ప్రారంభిస్తారు.

సంధాన‌క‌ర్త‌గా ప్రేర‌క్‌!

కేర‌ళ‌లో 17 జిల్లాల్లో గిరిజ‌నుల నివాస‌ ప్రాంతాలున్నాయి. వారి జీవ‌న‌శైలి, భాష కూడా ప్ర‌ధాన కేర‌ళ‌వాసుల జీవ‌న‌శైలికి భిన్నంగా ఉంటుంది. వాళ్ల‌కు చ‌దువు చెప్పాలంటే ముందు టీచ‌ర్ల‌కు వాళ్ల భాష‌ తెలిసి ఉండాలి. అందుకోసం ఆయా ట్రైబ‌ల్ హామ్‌లెట్‌ల నుంచి క‌నీస‌ చ‌దువు ఉన్న వాళ్ల‌ను ఎంపిక చేస్తారు. వారిని ప్రేర‌క్ అంటారు.

ఈ ప్రేర‌క్‌లు గిరిజ‌నుల‌ను స్కూలుకి వ‌చ్చేట‌ట్లు ప్రోత్స‌హించ‌డం, అక్ష‌రాలు, అంకెల వంటి క‌నీసంగా నేర్చుకోవాల్సిన సిల‌బ‌స్ పూర్తి చేస్తారు. ఆ త‌ర్వాత వాళ్లు మెయిన్ స్ట్రీమ్ స్కూల్ లో చ‌ద‌వ‌గ‌లుగుతారు. ఇది పిల్ల‌ల‌కుమాత్ర‌మే కాదు. ఐదేళ్ల నుంచి యాభై, అర‌వైల‌లో ఉన్న వాళ్లకు కూడా.

మ‌న ద‌గ్గ‌ర వ‌యోజ‌న విద్య కార్య‌క్ర‌మంలాగా పెద్ద‌వాళ్ల‌నూ అక్ష‌రాస్యుల‌ను చేసే ప్ర‌య‌త్నం ఇది. బ‌స్ మీద పేర్లు చ‌ద‌వ‌డం, దుకాణాల్లో కొన్న వ‌స్తువుల‌ను స‌రి చూసుకోవ‌డం, ఉత్త‌రం రాయ‌డం వంటి ప్రాథ‌మిక అవ‌స‌రాల‌న్నీ తీరేట‌ట్లు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది.

భ‌యం పోతే చాలు!

గిరిజ‌నుల పిల్ల‌లు ప్ర‌ధాన స్ర‌వంతిలో క‌ల‌వ‌డానికి ఎదుర‌య్యే అడ్డంకి భ‌యమే. క‌నీస అక్ష‌రాస్య‌త ఉంటే ఆ భ‌యం పోతుంది. అప్పుడు ప్ర‌ధాన గ్రామంలో ఉండే స్కూలుకు వెళ్ల‌డానికి ఆందోళ‌న చెంద‌రు. ఐదేళ్ల పిల్ల‌ల‌ను నేరుగా ప్ర‌ధాన గ్రామంలోని స్కూల్లో చేర్పించినా, వాళ్ల ద‌గ్గ‌రే స్కూల్ పెట్టి వాళ్ల‌ క‌ల్చ‌ర్‌కి సంబంధం లేని క్వాలిఫైడ్ టీచ‌ర్ ని నియ‌మించినా ఫ‌లితం ఆశించినంత‌గా ఉండ‌దు.

ఆ పిల్ల‌లు త‌మ భాష‌కాని ఆధునిక టీచ‌ర్‌తో మెల‌గ‌లేక దూరం అయిపోతారు. ఫ‌లితంగా అక్ష‌రాల‌కూ దూర‌మ‌వుతారు. అందుకే త‌మ‌లోని వ్య‌క్తితోనే తొలి అక్ష‌రాలు నేర్పిస్తే ఆ భ‌యం పోతుంద‌నేది ఇందులో ఉద్దేశం. మ‌న ద‌గ్గ‌ర చుక్కా రామ‌య్య చెప్పిందీ ఇదే. పిల్ల‌వాడు త‌న‌ది కాని క‌ల్చ‌ర్‌లో, త‌న‌ది కాని భాష‌లో చ‌దువుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఆ క‌ల్చ‌ర‌ల్ గ్యాప్ పిల్ల‌వాడిని చ‌దువుకి దూరం చేస్తుంది అన్నాడాయ‌న‌.

మ‌న‌వాళ్ల‌కు చేర‌లేదు కానీ ఈ ఫార్ములాని కేర‌ళ అక్కున చేర్చుకుంది. దేనికైనా మ‌న‌సు ఉంటే మార్గం ఉంటుంది. రాష్ట్రాన్ని నూటికి నూరుశాతం అక్ష‌రాస్య‌త రాష్ట్రంగా మార్చాల‌నే కోరిక ఈ ప‌ని చేయిస్తోంది.

అంత‌కంటే గొప్ప విష‌యం ఏమిటంటే… చ‌దువు చెప్తాం రండి అంటే మ‌న ద‌గ్గ‌ర ఎవ‌రూ ఇల్లు దాటి అడుగు బ‌య‌ట పెట్ట‌డానికే క‌ష్ట‌ప‌డ‌తారు. అక్క‌డ వెన్ను వంగిపోతున్న వాళ్లు కూడా ప‌ల‌క బ‌ల‌పం ప‌ట్టుకుని అక్ష‌రాలు దిద్దుతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES