కోదండరాం పార్టీ…. నిజమేనా…. కేసీఆర్‌ ను గెలిపించడానికేనా?

331

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ జరుగుతోంది. ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాక.. పొలిటికల్ జేఏసీ తరఫున బిజీ అయిన కోదండరాం.. ఈ మధ్య కేసీఆర్ వ్యతిరేక కామెంట్లు చేయడంలో ముందుంటున్నారు. జేఏసీ కార్యకర్తల కోరిక మేరకు.. ఆయన రాజకీయ పార్టీ పెట్టేందుకూ సిద్ధమయ్యారు.

ముందుగా జేఏసీ కమిటీల నియామకం పూర్తయితే.. పార్టీ పెట్టేందుకు తాను సిద్ధమే అని ఓపెన్ గా కోదండరాం చెప్పేయడం.. ఇప్పుడు టీ పాలిటిక్స్ ను ఇంటర్నల్ గా షేక్ చేస్తోంది. కోదండరాం పార్టీ పెడతాడా? పెడితే ఎవరికి మద్దుతగా? ఎవరికి వ్యతిరేకంగా నడుచుకుంటాడు? ఇప్పుడున్నట్టుగానే కేసీఆర్ కు వ్యతిరేకంగా మరింత బలంగా కోదండరాం వాయిస్ వినిపించగలడా? కాంగ్రెస్ నేతలు కోదండరాంకు సహకారం ఇస్తారా? ఇవ్వరా?

ఇలా.. ఈ ప్రతిపాదనపై ముచ్చట్లు రకరకాలుగా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టడం అంటే.. కచ్చితంగా ఖర్చుతో కూడుకున్న పనే. మరి.. జనాలే తన కేరాఫ్ అని చెప్పుకొని తిరుగుతున్న కోదండరాంకు.. ఎవరు సపోర్ట్ చేస్తారు? ఒకవేళ చేసినా.. ఎన్నికల వరకూ ఎవరు కలిసి నడుస్తారు? అన్నదే.. ఇప్పుడు జవాబు దొరకని ప్రశ్న అవుతోంది.

మరోవైపు.. కోదండరాం పార్టీ పెడితే.. టీఆర్ఎస్ కే మేలు అని ఆ పార్టీ నేతలంటున్నారు. కోదండరాం ఎలాగూ కాంగ్రెస్ తో కలవరని.. అలా చేస్తే ప్రజలు ఆయన్ను నమ్మరని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కన.. కాంగ్రెస్, బీజేపీలే కాక.. మధ్యలో కోదండరాం పార్టీ కూడా వస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం ఖాయమని.. తమకు ఉండే బలంతో సహజంగానే గెలుపు సులువు అవుతుందని.. గులాబీ లీడర్లు లెక్కలేస్తున్నారు.

లాజిక్ బానే ఉంది కానీ.. ఎన్నికల సమయం నాటికి.. ఏ లెక్కలు ఎటు మారతాయో చూడాల్సిందే.

NEWS UPDATES

CINEMA UPDATES