సోషల్‌ మీడియాలో చంద్రబాబు పై కొత్తపల్లి గీత సెటైర్లు

3316

వైసీపీ తరపున గెలిచి చంద్రబాబు అభివృద్ధి నచ్చి టీడీపీలో చేరిన అరకు ఎంపీ కొత్త పల్లి గీత పరిస్థితి ఇప్పుడేమంత బాగోలేదు. ఆమెను పట్టించుకునే వారే కరువయ్యారు. ఉన్న పార్టీని వదిలేసి…. కొత్త పార్టీ ఆదరించక ఆమె లోలోన రగిలిపోతున్నారు. ఏ పార్టీలో ఉన్నారు అని అడిగితే కూడా చెప్పుకునే పరిస్థితి ఆమెకు లేకుండాపోయింది. తాజాగా అరకు ఏజెన్సీ ప్రమోషన్‌ కోసం బెలూన్ ఫెస్టివల్‌ నిర్వహించింది ప్రభుత్వం.

మంత్రులు అఖిలప్రియ, గంటా, ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తారని ప్రచారం జరిగింది. మూడు రోజుల పాటు ఈవెంట్ నిర్వహిస్తామని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ ఈవెంట్ ప్రారంభించారు. అయితే తొలి రోజు గంట పాటు బెలూన్లు ఎగురవేయగానే వర్షం వచ్చేసింది. మూడు రోజుల పాటు గాలులు, వర్షం కారణంగా ఈవెంట్‌ జరగకుండానే ముగిసింది. ఇందుకోసం ఖర్చు చేసిన ఐదు కోట్లు గాల్లో కలిసిపోయాయి. ఇంత ఖర్చు చేసి ఈవెంట్‌ జరిపేందుకు ప్రభుత్వం సిద్దమైనా.. చివరకు స్థానిక ఎంపీ కొత్తపల్లి గీతకు మాత్రం ఆహ్వానం అందలేదు. దీంతో ఆమె సోషల్ మీడియాలో తన అసహనం వ్యక్తం చేశారు.

తమ ప్రాంతంలో జరుగుతున్న బెలూన్ ఫెస్టివల్‌కు స్థానికులమైన తమకు కూడా ఆహ్వానం లేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. థ్యాంక్స్ టూ ఏపీ గవర్నమెంట్ అంటూ సోషల్ మీడియాలో ఆమె వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. అయితే కొత్తపల్లి గీతను చంద్రబాబు పక్కన పెట్టి చాలా రోజులైందంటున్నారు. ఇటీవల నియమించిన గిరిజన సలహా మండలిలోనూ గీతకు బాబు హ్యాండిచ్చారు. ఆ సమయంలో గిరిజనులకు చంద్రబాబు ప్రభుత్వం ద్రోహం చేస్తోందని కొత్తపల్లి గీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఆమెను టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పుడామె ఏపార్టీకి కానివారైపోయారు.

NEWS UPDATES

CINEMA UPDATES