మీరు గోబెల్స్‌కే గురువులండి….

845

ప్ర‌చారంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గోబెల్స్‌ను మించిపోయింద‌న్న విమ‌ర్శ‌ చాలా కాలంగా ఉంది. అయితే అది ఇప్పుడు ప‌రాకాష్ట‌కు చేరిందా అనిపిస్తోంది. కృష్ణాన‌ది బోటు ప్ర‌మాదంపై ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేందుకు ప్ర‌భుత్వం, దాని అనుకూల మీడియా చేసిన ఎత్తులు చూసి జ‌నం న‌వ్వుకున్నారు. మ‌రీ ఇంత‌గా జ‌నాన్ని పిచ్చివాళ్ల‌ను చేస్తారా అని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. న‌దిలో ప్రైవేట్ వ్య‌క్తులు య‌ధేచ్చ‌గా బోట్లు తిప్పుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో… ప్ర‌భుత్వం ఒక వీడియో లీక్ చేసింది.

ఫెర్రి ఘాట్ నుంచి ప‌విత్ర సంగ‌మం వ‌ర‌కు సాగిన ప్ర‌మాద‌క‌ర ప్ర‌యాణాన్ని అడ్డుకునేందుకు అధికారులు ప్ర‌య‌త్నించార‌ని చాట‌డ‌డం ఆ వీడియో ఉద్దేశం. తొలుత ఈ వీడియో చూసిన వారు నిజ‌మే క‌దా అధికారులు బోట్ల‌ను అడ్డుకున్నారు అని భావించారు. కానీ అస‌లు విష‌యం ఏమీటంటే… ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి, బోటుకి… స‌ద‌రు వీడియోకు ఎలాంటి సంబంధంలేదు. అది ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతంలోనిది కాదు. అస‌లు ప్ర‌మాద‌ స‌మ‌యంలోని వీడియో అంత‌కంటే కాదు. అందులో ఏ రోజో ఉద‌యం జ‌నాలు న‌దిలో స్నానాలు చేస్తున్న‌ట్టుగా కూడా ఉంది. అవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా మీడియా మాత్రం అనుమతుల్లేని బోట్లను అధికారులు కూడా నిలువరిస్తున్నా కొందరు ప్రయాణీకులే అలాంటి బోట్లలో ప్రయాణాలకు సిద్ధపడి పెద్ద తప్పిదం చేశారన్నట్టుగా చిత్రీకరించడానికి తహతహలాడుతోంది.

ఈ వీడియో అంశాన్ని మంత్రి అఖిల‌ప్రియ కూడా ప్ర‌స్తావించారు. త‌మ అధికారులు బోట్ల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించార‌ని చెప్పుకొచ్చారు. అయితే అధికారులు అడ్డుకుని ఉంటే అంత ప‌బ్లిక్‌గా బోట్లు ఎలా తిరుగుతున్నాయ‌న్న దానికి మాత్రం స‌మాధానం ఒక‌టే…. విచార‌ణ‌లో అన్నీ తేలుతాయి. మొత్తం మీద ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను మీడియా సాయంతో మ‌భ్య‌పెట్టేందుకు, పిచ్చివాళ్ల‌ను చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు తారాస్థాయికి చేరిన‌ట్టుగానే ఉంది. ఈ స్థాయిలో త‌ప్పుడు ప్రచారానికి దిగ‌డం, అందుకు టీడీపీ అనుకూల మీడియా తాలం వేయ‌డం చూసి నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. గోబెల్స్‌కే గురువులుగా త‌యార‌య్యార‌ని మండిప‌డుతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES