కుల‌దీప్ శ‌ర్మ‌…గుజ‌రాత్ ప్ర‌శాంత్ కిషోర్‌!

851

రాహుల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రి మోదీకి రోజుకో ప్ర‌శ్న సంధిస్తున్నాడు. ప్ర‌చారంలో ముందున్న‌ట్లే క‌నిపిస్తున్నాడు. గుజ‌రాత్ గ్రామీణ ప్రాంతాల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తున్నాడు. దీనికంత‌టికీ వెనుక ఒక టీమ్ ఉంది. ఆ టీమ్‌ని న్యూ ప్ర‌శాంత్‌ కిషోర్ టీమ్ అని పిలుస్తున్నారు. ఈ టీమ్ మాజీ పోలీస్ అధికారి కుల‌దీప్ శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో ప‌ని చేస్తోంది. వీళ్ల ఆఫీస్ అహ్మ‌దాబాద్ న‌గ‌రంలోని పాల్దీ రోడ్‌లో ఉన్న రాజీవ్ గాంధీ భ‌వ‌న్‌ మూడవ అంత‌స్తులో ఉంది. ఈ ఏడాది మే నెల నుంచి ఈ బృందం ఈ గ్రౌండ్ వ‌ర్క్ చేస్తోంది. రాహుల్ గాంధీ ప్ర‌సంగాల్లో వాడి, ఆయ‌న‌ సంధిస్తున్న బాణాలు, స‌మ‌స్య‌ల మీద గ‌ళం విప్ప‌డం అన్నీఆ టీమ్‌ ఫ‌లిత‌మే. గుజ‌రాత్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాట‌జిక్ అన‌లిస్ట్ కంపెనీ ఇది.

బూత్ స్థాయి నుంచి స‌మాచారం!

రాష్ట్రంలో బూత్ స్థాయి క‌మిటీలు, వాటిలో ప‌ని చేస్తున్న కార్య‌క‌ర్త‌ల వివ‌రాలు, వారి ద్వారా స్థానిక స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డం వంటి కీల‌క‌మైన ప‌ని కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ట్లు కుల‌దీప్ శ‌ర్మ చెబుతున్నారు. రాష్ట్రంలో మూడు ల‌క్ష‌ల మంది అంకిత భావంతో ప‌ని చేసే బూత్ లెవెల్ కార్య‌క‌ర్త‌లున్న‌ట్లు చెప్పారు. 2014లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క లోక్‌స‌భ సీటు కూడా రాలేదు. గ్రాస్‌రూట్ స్థాయిలో ఎక్క‌డ పొర‌పాటు జ‌రిగిందనే విష‌యం మీద స్ప‌ష్ట‌మైన కార‌ణాల‌ను సేక‌రించిన‌ట్లు శ‌ర్మ చెప్పారు. ఈ టీమ్‌లో స‌భ్యులు ఒక్కొక్క‌రు దాదాపుగా 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించిన త‌ర్వాత ప‌రిస్థితిని అంచ‌నా వేసి వ్యూహాన్ని ర‌చించారు.

ఇంత ప‌ని ఎప్పుడూ చేయ‌లేదు!

గుజ‌రాత్‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం కోసం ఇంత‌గా శ్ర‌మించింది ఎప్పుడూ లేద‌ని కాంగ్రెస్ శ్రేణులే ఒప్పుకుంటున్నాయి. ప్ర‌ధాన‌మైన స‌వాల్ ఓట‌ర్ల‌ను చైత‌న్య‌వంతం చేయ‌డ‌మే. ఆ ప‌ని ఇప్పుడు స‌మ‌ర్థ‌వంతంగా జ‌రుగుతోంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కుల‌దీప్ శ‌ర్మ చేస్తున్న ప్రాజెక్ట్‌ని గుజ‌రాత్‌లో ఎల‌క్ష‌న్ స్ట్రాట‌జిస్ట్‌ ప్ర‌శాంత్ కిషోర్ తో పోలుస్తున్నారు.

రెండేళ్ల కింద‌ట రిటైర్ అయిన కుల‌దీప్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్ప‌టి నుంచి ప్ర‌ధాని మీద విమ‌ర్శ‌లు సంధించ‌డానికి కావ‌ల‌సిన స‌మాచారం అందించ‌డంలో కీల‌కంగా ప‌ని చేస్తున్నారు. ఇంత‌కు ముందు త‌మిళ‌నాడు ఎన్నిక‌ల కోసం ప‌ని చేసిన సామ్ అన‌లిటిక్స్ నుంచి కూడా స‌మాచారాన్ని తీసుకుంటున్నారు. ఆ కంపెనీ బీహార్ కాంగ్రెస్‌తోపాటు గ‌డ‌చిన ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బిజెపితో క‌లిసి ప‌ని చేసింది. ఇక‌పై రాజ‌కీయాల్లో ఇలాంటి స్ట్రాట‌జిస్ట్‌ల ప్రాధాన్యం పెర‌గ‌వ‌చ్చు. మొత్తానికి ఈ ర‌క‌మైన క‌స‌ర‌త్తుకి ప్ర‌శాంత్ కిషోర్ ఒక బ్రాండ్‌గా మారాడ‌న్న‌మాట‌.

NEWS UPDATES

CINEMA UPDATES