2018 లోనే లోక్‌స‌భ ఎన్నిక‌లు ?

919

లోక్‌స‌భ ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాదిలోనే జ‌రిగేట‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌యంపై చాలా మంది మాట్లాడారు. తాజాగా ఆ జాబితాలో ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ చేరారు. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే సిద్ధంగా ఉండాల‌ని ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌మై బిజెపిని ఓడించ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తాయ‌ని లాలూ అన్నారు.

గ‌తంలో పులి పేరు చెప్ప‌గానే అంద‌రూ భ‌య‌పడేవార‌ని….ప్ర‌స్తుతం ఆవు పేరు చెప్ప‌గానే భ‌య‌ప‌డుతున్నార‌ని లాలూ అన్నారు. ఆసియాలోనే ఎంతో పేరుగాంచిన సోనేపూర్ ప‌శువుల సంత ఈ ఏడాది క‌ళా విహీనంగా క‌నిపించింద‌ని లాలూ తెలిపారు. ఇదంతా మోడీ వ‌ల్లే జ‌రిగింద‌ని లాలూ అన్నారు.

2014 లో ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా మోడీ ఇచ్చిన హామీలు ఒక్క‌టి కూడా అమలు చేయ‌క‌పోవ‌డంపై ప్ర‌జ‌లు చాలా కోపంగా ఉన్నార‌ని లాలూ తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడున్న‌రేళ్ల‌లో బిజెపి పూర్తిగా వైఫ‌ల్యం చెందింద‌ని లాలూ అన్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ అమ‌లు తీరు వంటివి ప్ర‌జ‌ల‌ను మోడీకి దూరం చేశాయ‌ని లాలూ అన్నారు.

త‌న చిన్న కుమారుడు తేజ‌స్వీ యాద‌వ్ ప‌టేల్ ఉద్య‌మ నాయకుడు హార్ధిక్ ప‌టేల్‌తో ట‌చ్‌లో ఉన్నాడ‌ని…అటువంటి యువ‌నేత‌లే దేశంలో ఉన్న మ‌త‌త‌త్వ పార్టీల‌ను వెళ్ల‌గొట్ట‌గ‌ల‌ర‌ని లాలూ ప్ర‌సాద్ అన్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేసే బ‌దులు మోడీని, కేంద్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేయాల‌ని ఆయ‌న మీడియాకు సూచించారు.

అమెరికా వంటి దేశాల్లో అత్యంత శ‌క్తివంత‌మైన ప్ర‌భుత్వాల‌ను కూడా మీడియా విమర్శించ‌డానికి వెడ‌కాడ‌ద‌ని లాలూ గుర్తుచేశారు. ఇండియాలో మాత్రం మీడియా ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేస్తోంద‌ని…ఆ విష‌యంలో మీడియా వైఖ‌రిలో మార్పు రావాల‌ని లాలూ ఆకాంక్షించారు.

NEWS UPDATES

CINEMA UPDATES