మనీకా బాత్రా…. పతకాల జాతర

4969

భారత మహిళా టేబుల్ టెన్నిస్ లో సరికొత్త చరిత్రకు తెరలేచింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన 2018 కామన్వెల్త్ గేమ్స్ లో భారత టీటీ జట్టు అంచనాలను మించి రాణించి ఎకంగా 8 పతకాలతో తిరిగి వచ్చింది.

ఈ ఎనిమిది పతకాలలో….22 ఏళ్ల మనీకా బత్రా సాధించినవే నాలుగు ఉండటం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.

భారత టీటీకి కొత్తఊపిరి

పింగ్ పాంగ్ గేమ్ టేబుల్ టెన్నిస్ అనగానే…..చైనా, జపాన్, స్వీడన్, కొరియా, నైజీరియా లాంటి దేశాల ఆధిపత్యమే మనకు కనిపిస్తుంది. మనదేశంలో విస్త్రృతంగా ఆడే ఈ క్రీడలో ప్రపంచ స్థాయి క్రీడాకారులు మనకు అతికొద్దిమంది మాత్రమే కనిపిస్తారు.

జగన్నాథ్, కమలేశ్ మెహ్తా, చంద్రశేఖర్, ఇందూ పూరి, మోనాలిసా బారువా, ఆచంట శరత్ కమల్ లాంటి మేటి క్రీడాకారులు మాత్రమే గుర్తుకు వస్తారు.

అయితే….షూటింగ్, కుస్తీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడలతో పోల్చిచూస్తే…. టేబుల్ టెన్నిస్ లో మన క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో సాధించిన పతకాలు అంతంత మాత్రమే.

గోల్డ్ కోస్ట్ లో భారత మెరుపులు…..

భారత టేబుల్ టెన్నిస్ ఉనికికోసం నానాపాట్లు పడుతున్న తరుణంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫలితాలు కొత్తఊపిరి పోశాయి. సింగపూర్, నైజీరియా దేశాల సంపూర్ణ ఆధిపత్యంలో ఉండే కామన్వెల్త్ గేమ్స్.. టీటీ పురుషుల, మహిళల విభాగాలలో భారత్…12 ఏళ్ల విరామం తర్వాత బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. శరత్ కమల్ నాయకత్వంలోని పురుషుల జట్టు, మనీకా బాత్రా కెప్టెన్సీలోని మహిళాజట్టు టీమ్ స్వర్ణాలతో మెరిసిపోయాయి.

పురుషుల, మహిళల టీమ్, వ్యక్తిగత విభాగాలలో భారత టీటీ క్రీడాకారులు ఏకంగా ఎనిమిది పతకాలు సాధించారు. ఇందులో భారత మహిళా టీటీ సంచలనం మనీకా బాత్రా సాధించినవే నాలుగు పతకాలు ఉన్నాయి.

బంగారు కొండ మనీకా….

నాలుగేళ్ల చిరుప్రాయంలోనే టీటీ బ్యాటు చేతపట్టిన మనీకా….ఆట కోసం చదువునే విడిచిపెట్టింది. ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కళాశాలలో చదువుతూ అర్థంతరంగా చదువుకు దూరమయ్యింది. పూర్తిస్థాయిలో టేబుల్ టెన్నిస్ పైనే దృష్టి కేంద్రీకరించింది.

ఒడ్డుపొడుగుకు తగ్గ అందం ఉండడంతో మనీకాకు మోడలింగ్ లోనూ తగిన అవకాశాలు వచ్చినా… తిరిస్కరించింది. సోదరుడు సాహిల్, అక్క ఆంచల్ ఇద్దరూ టీటీ ప్లేయర్లే కావడంతో…..అదే క్రీడలో తాను దేశానికి అంతర్జాతీయంగా ఖ్యాతి తీసుకురావాలని నిర్ణయించుకుంది.

శిక్షకుడు సందీప్ గుప్తా నేతృత్వంలో కఠోర సాధన చేసి… ముందుగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకొంది.

ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ టీటీలో పోటీకి దిగిన మనీకా చిలీ ఓపెన్ అండర్ -21 విభాగంలో కాంస్య పతకం సంపాదించింది. 12వ దక్షిణాసియా క్రీడల టీటీలో సైతం మూడు బంగారు పతకాలు, ఓ రజతం సాధించింది.

కామన్వెల్త్ గేమ్స్ లో…..

2014లో గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ దూసుకెళ్లిన మనీక పోటీకి అక్కడే తెరపడింది. ఆ తర్వాత ఏడాది జరిగిన కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో…. మహిళల టీమ్, మహిళల డబుల్స్ విభాగాలలో రజత, మహిళల సింగిల్స్ లో కాంస్య పతకాలు సాధించడం ద్వారా తన ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుకోగలిగింది.

దక్షిణాసియా జోన్ అర్హత పోటీలలో విజేతగా నిలవడం ద్వారా…2016 రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించినా…తొలిరౌండ్లోనే మనీకాకు పరాజయం తప్పలేదు. పోలెండ్ ప్లేయర్ కాట్రాజినా చేతిలో పరాజయం పొందిన మనీకా మరింత పట్టుదలతో సాధన చేసి…లోపాలను సవరించుకొని…ప్రపంచ స్థాయిలో 58వ ర్యాంక్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకొంది. 

కంగారూల్యాండ్ లో విశ్వరూపం….

గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో….ఎలాంటి అచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత్….టీమ్ విభాగాలలో నైజీరియా, సింగపూర్ జట్లకు బంగారు పతకాలతో గండి కొట్టాయి. ఇక మహిళల టీమ్ వ్యక్తిగత విభాగాలలో 22 ఏళ్ల మనీకా విశ్వరూపమే ప్రదర్శించింది. సింగపూర్ కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంక్ ప్లేయర్ ఫెంగ్ తియాన్ వీపై ఒకసారి కాదు…రెండుసార్లు సంచలన విజయాలు సాధించి…డబుల్ గోల్డ్ సొంతం చేసుకొంది.

మహిళల టీమ్, వ్యక్తిగతంగా మహిళల సింగిల్స్ లో సైతం మనీక బంగారు కొండగా నిలిచింది.

డబుల్స్ లోనూ గోల్డెన్ షో…

మహిళల డబుల్స్ లో మౌమా దాస్ తో జంటగా బంగారు పతకం మ్యాచ్ కు అర్హత సాధించినా…చివరకు రజత పతకంతో సరిపెట్టుకొంది. మిక్సిడ్ డబుల్స్ లో సైతం కాంస్య పతకం గెలుచుకొంది.

కామన్వెల్త్ గేమ్స్ లో మొత్తం 221మంది సభ్యుల అథ్లెట్ల బృందం పతకాలవేటకు దిగితే…మనీకా బాత్రా ఒక్కడే నాలుగు పతకాలు సాధించి తనకు తానే సాటిగా నిలిచింది. భారత అత్యుత్తమ అథ్లెట్ గౌరవం దక్కించుకొంది.

ఇప్పటికే ప్రపంచ 4వ ర్యాంక్ ప్లేయర్ ను ఓడించిన 58వ ర్యాంకర్ మనీక….రానున్న కాలంలో  ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్ గా గుర్తింపు సంపాదించాలన్న పట్టుదలతో ఉంది. అంతేకాదు… భారత బ్యాడ్మింటన్ కు సైనా, టెన్నిస్ కు సానియా తెచ్చిన గుర్తింపునే…తాను టేబుల్ టెన్నిస్ క్రీడకు తీసుకురాగలిగితే….తన త్యాగం, కృషి , అంకితభావం ఫలించినట్లేనని మనీకా గట్టిగానమ్ముతోంది.

గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో కనబరచిన జోరునే త్వరలో జరిగే ఆసియా క్రీడలు, ఆ తర్వాత జరిగే ఒలింపిక్స్ లోనూ మనీకా కొనసాగించగలిగితే..భారత టేబుల్ టెన్నిస్ దశదిశ మారిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

NEWS UPDATES

CINEMA UPDATES