ములాయం ఇక తెరమరుగేనా!

338

గత ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు జరిగిన సమయంలో అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేశ్ యాదవ్ అధికారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించవలసి రావడంతో పాటు కుటుంబ కలహాలలో కూరుకు పోయారు. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ కుటుంబ కలహాలు రేకెత్తించారు. ములాయం తన సోదరుడు శివపాల్ యాదవ్ తో కలిసి అఖిలేశ్ కు ఊపిరాడకుండా చేశారు. ఎన్నికలలో పరాజయం నుంచి అఖిలేశ్ తప్పించుకోలేక పోయారు కాని పార్టీ మీద తిరుగులేని ఆధిపత్యం సంపాదించడంలో సఫలమయ్యారు.

శాసనసభ ఎన్నికలలో ఓటమి కారణంగా ములాయం సింగ్, శివపాల్ యాదవ్ అఖిలేశ్ మీద దాడి మరింత పెంచుతారని భావించారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ములాయం, శివ పాల్ యాదవ్ ను అఖిలేశ్ పూర్తిగా పక్కన పెట్టేశారు. కుటుంబ కలహాలు చెలరేగిన సమయంలో సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడైన ములాయం ను అఖిలేశ్ పదవీచ్యుతుణ్ని చేశారు. తన బాబాయి శివ పాల్ యాదవ్ ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించారు. అఖిలేశ్ తానే సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడై పోయారు. ఈ నియామకం చెల్లదని ములాయం యాగీ చేయడమే కాక ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ దాకా తీసుకెళ్లారు. అయితే ఎన్నికల కమిషన్ అఖిలేశ్ చర్యను సమర్థించింది. ములాయం ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. శివ పాల్ యాదవ్ మాత్రం అధికార పార్టీ అభ్యర్థులను ఓడించడానికి చేయగలిగిందల్లా చేశారు.

ఎన్నికలలో ఓటమి పాలైనందువల్ల అఖిలేశ్ మీద కత్తులు నూరే వారు ఎక్కువయ్యారు. ఆయనను పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తొలగిస్తారని కూడా అనుకున్నారు. తాము కొత్త పార్టీ పెడుతున్నట్టు ములాయం యాదవ్, శివ పాల్ యాదవ్ పదే పదే ప్రకటించే వారు. ఎన్నికలలో అపజయం వల్ల అఖిలేశ్ తన కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. అయినా నిలదొక్కుకున్నారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాం గోవింద్ చౌదరిని నియమించి అఖిలేశ్ పార్టీపై తనకు ఉన్న పట్టు ఏమిటో నిరూపించుకున్నారు. ఒకప్పుడు ములాయం కు తీవ్ర అభిమాని అయిన ఆజం ఖాన్, శివ పాల్ యాదవ్ ఆ పదవి కోసం పోటీపడ్డారు. కాని వారి ప్రయత్నాలు ఫలించలేదు.

ఆ తర్వాతి పరిణామాలన్నీ అఖిలేశ్ బలహీన పడడానికి బదులు పార్టీ పై తిరుగు లేని పట్టు సంపాదించడానికే దారి తీశాయి. ఈ నెలారంభంలో జరిగిన ఎన్నికలలో అఖిలేశ్  అయిదేళ్లపాటు పార్టీ అధ్యక్షుడిగా మరో సారి ఎన్నికయ్యారు. తండ్రి, బాబాయితో తనకు విభేదాలు ఏమీ లేవని చెప్పడానికి ప్రయత్నించారు. తనకు వారి ఆశీస్సులున్నాయని పార్టీ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన తర్వాత ప్రకటించారు. గత సోమవారం నాడు ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో ములాయం, శివ పాల్ యాదవ్ పేర్లే లేవు. అంటే అఖిలేశ్ లో విశ్వాసం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

తాను కొత్త పార్టీ పెట్టబోవడం లేదని గత నెల ములాయం ప్రకటించడంతో అఖిలేశ్ బలం మరింత పదిలమైంది. పైగా తాని “సామాజ్ వాదీ పార్టీతో, పార్టీలో ఉన్నాను” అని ములాయం ప్రకటించారు. అఖిలేశ్ తన కొడుకు కనక ఆయనకు తన ఆశీస్సులు ఉంటాయని కూడా ప్రకటించారు. అయితే అఖిలేశ్ తీసుకునే నిర్ణయాలతో తాను ఏకీభవించడం లేదని కూడా చెప్పారు. ఇటీవల లక్నోలో జరిగిన రాం మనోహర్ లోహియా సంస్మరణ సభలో తండ్రీ కొడుకులిద్దరూ ఒకే చోట కనిపించారు. గత సంవత్సర కాలంలో ఇలా జరగడం ఇదే మొదటి సారి. తన కుటుంబంలో కలహాలేమీ లేవని, తామంతా ఐక్యంగా ఉన్నామని ములాయం చెప్పారు.

పరిస్థితి విషమించినప్పుడల్ల ములాయం వెనక్కు తగ్గారు. సమాజ్ వాది పార్టీ భవిష్యత్తు అఖిలేశ్ చేతిలోనే ఉందని ములాయం సింగ్ కు తెలుసు. తన రాజకీయ వారసుడు అఖిలేశేనని కూడా తెలుసు. అఖిలేశ్ యాదవ్ కూడా తండ్రితో విభేదాలు వచ్చినప్పుడు పార్టీని వీడి పోవాలనుకోలేదు. పార్టీ మీద పట్టు సంపాదించాలనుకున్నారు. ఈ కుటుంబ కలహం మొత్తంలో నష్టపోయింది ఎవరైనా ఉంటే అది శివ పాల్ యాదవే. తన మీద ములాయం కు నమ్మకం ఉందని, రాజకీయంగా తనకు పునరావసం ఉంటుందని అనుకున్నారు. కాని ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. తన కొడుకుని రాజకీయాల్లో ప్రవేశపెట్టాలన్న శివ పాల్ ఆశలు నెరవేరేట్టు లేవు. ఆయన కోరలు పెరికేశారు. పార్టీలో ఆయనకు మద్దతు ఇస్తున్న వారు ఇప్పుడు తిరుగులేని నాయకుడైన అఖిలేశ్ మద్దతుదార్లుగా మారిపోవచ్చు.

 

 

 

 

NEWS UPDATES

CINEMA UPDATES