చిక్కుల్లో ప‌డ్డ న‌వ‌జోత్ సింగ్ సిద్ధు

923

మాజీ క్రికెట‌ర్, పంజాబ్ మంత్రి అయిన న‌వ‌జోత్ సింగ్ సిద్ధు చిక్కుల్లో ప‌డ్డారు. పాకిస్థాన్ వెళ్లి వ‌చ్చిన నాటి నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న సిద్ధుకు తాజాగా మ‌రో షాక్ త‌గిలింది. 1988 నాటి కేసును మళ్లీ విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీక‌రించింది. బాధితుడు గుర్నామ్ సింగ్ కుటుంబీకులు వేసిన పిటిష‌న్‌ తో ఖ‌న్ విల్క‌ర్, సంజ‌య్ కిష‌న్ కౌల్ ధ‌ర్మాసనం సిద్ధుకి నోటీసులు జారీ చేసింది.

1988లో గుర్మామ్ సింగ్…. సిద్ధు చేతిలో తీవ్రంగా దెబ్బ‌లు తిని చ‌నిపోయాడ‌నేది ఆయనపై వచ్చిన ఆరోప‌ణ‌. కొన్ని సంవ‌త్స‌రాల పాటు విచార‌ణ జ‌రిగిన అనంత‌రం ఈ కేసును ఈ ఏడాది మే 15న కోర్టు కొట్టివేసింది. వెయ్యి రూపాయ‌ల జ‌రిమానా విధించింది. ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన బాధితుడి కుటుంబీకులు తిరిగి ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు.

1988 డిసెంబ‌ర్ 27న ఏం జ‌రిగిందంటే….

సిద్ధుతో పాటు అత‌ని స్నేహితుడు రూపీంద‌ర్ సింగ్ ….పాటియాలాకు చెందిన గుర్నామ్ సింగ్‌తో గొడ‌వ ప‌డ్డారు. కారు పార్కింగ్ స్పేస్ గురించి వీరి మ‌ధ్య గొడ‌వ ప్రారంభ‌మ‌యింది. కారులో ఉన్న గుర్నామ్ సింగ్‌ను బ‌య‌ట‌కు లాగి చిత‌క్కొట్టారు. తీవ్ర గాయాల‌పాలైన గుర్నామ్ ఆసుప‌త్రికి చేరుకోక‌ముందే చ‌నిపోయాడు. సిద్ధుపైనా, అత‌డి స్నేహితుడిపైనా కేసు న‌మోద‌యింది.

ఈ కేసులో ఎన్నో మ‌లుపులు

ఏళ్ల త‌ర‌బ‌డి న‌డుస్తున్న ఈ కేసులో ఎన్నో మ‌లుపులు ఉన్నాయి. 1999లో పాటియాలా సెష‌న్స్ కోర్టు త‌గిన ఆధారాలు లేవ‌నే కార‌ణంతో సిద్ధును, అత‌డి స్నేహితుడిని నిర్ధోషులుగా ప్ర‌క‌టించింది. 2002లో ఈ తీర్పును స‌వాలు చేస్తూ పంజాబ్ ప్ర‌భుత్వం హైకోర్టును ఆశ్ర‌యించింది. హ‌ర్యానా పంజాబ్ కోర్టు ఈ కేసును ప‌రిశీలించిన త‌ర్వాత వీరిద్ద‌రికీ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అప్ప‌టికి బిజెపి ఎంపీగా ఉన్న సిద్ధు…. రాజీనామా చేశాడు. 2007 జ‌న‌వ‌రి 11న సిద్ధు కోర్టు ముందు లొంగిపోయాడు.

సుప్రీంకోర్టులో సిద్ధు త‌ర‌పున అరుణ్ జైట్లీ లాయ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించడంతో సిద్ధుకు బెయిల్ ల‌భించింది. అమృత్ స‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో సిద్ధు విజ‌యం సాధించాడు. రెండోసారి బిజెపి ఎంపీగా బాధ్య‌త‌లు స్వీక‌రించాడు. 2017లో సిద్ధు బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరాడు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున గెలిచి అమ‌రీంద‌ర్ సింగ్ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు.

NEWS UPDATES

CINEMA UPDATES