పలమనేరు రంగంలోకి ఊహించని అభ్యర్ధులు….

5633

పలమనేరు…. తమిళ-కన్నడ రాష్ట్రాల సరిహద్దులను తాకుతూ చిత్తూరు జిల్లాలో దక్షిణాన విస్తరించి ఉన్న ఈ శాసనసభా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. ఇది తొలుత ఎస్‌.సి రిజర్వుడు నియోజకవర్గంగా ఉండేది. తాజా పునర్విభజన తరువాత 2009 సంవత్సరం నుంచి జనరల్‌ నియోజకవర్గంగా మారింది. జనరల్‌ అయిన తరువాత ఈ సీటు నుంచి ఒకసారి తెలుగుదేశం, మరో సారి వైఎస్సార్ కాంగ్రెస్‌ నెగ్గింది. వేర్వేరు పార్టీల నుంచి అయినా ఈ రెండు సార్లూ ఇక్కడి నుంచి గెలుపొందింది ఇప్పటి మంత్రి ఎన్‌. అమరనాథ్‌ రెడ్డి కావడం విశేషం. 2009లో ఆయన దేశం ఎమ్మెల్యే…. 2014 ఎన్నికల నాటికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరిపోయిన అమరనాథ్‌ 2,300 ఓట్ల స్వల్ప మెజారిటీతో దేశంపై నెగ్గారు.

చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని నిలువరించడానికి వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరనాథ్‌ రెడ్డి ని తిరిగి దేశంలోకి చేర్చుకున్నారు. ఇందులో చంద్రబాబు కన్నా ఆయన తనయుడు లోకేష్‌ పాత్రే ఎక్కువ ఉందని సమాచారం. వాస్తవానికి అమరనాథ్‌ రెడ్డి కుటుంబం ఎదిగింది తెలుగుదేశం పార్టీలోనే. ఆయన తండ్రి ఎన్‌. రామకృష్ణా రెడ్డి మూడు సార్లు చిత్తూరు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. ఆయన వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన అమరనాథ్‌ రెడ్డి ఆ తరువాత అదే పార్టీ నుంచి పుంగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. పునర్విభజన అనంతరం అమరనాథ్‌ రెడ్డి సొంత మండలం అయిన పెద పంజాణి పలమనేరులోకి రావడంతో అక్కడి నుంచి 2009, 2014లో పోటీ చేసి ఎన్నికయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చారని విమర్శలు చేసి అమరనాథ్‌ రెడ్డి దేశం ఎమ్మెల్యేగా ఉంటూ ఆ పార్టీని వీడి (2014కు ముందు) బయటకు వచ్చారు. వైఎస్సార్‌సీపీ తరపున ఎన్నికయ్యాక రెండేళ్లకు ఆయన మళ్లీ సొంతగూటికి వెళ్లి కీలకమైన పరిశ్రమల శాఖా మంత్రిగా ప్రమణస్వీకారం చేశారు. టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీకి, మళ్లీ అటు నుంచి సొంత గూటికి ఫిరాయించి మంత్రి అయిన అమరనాథ్‌ రెడ్డిని నియోజకవర్గ ఓటర్లు ఏ మేరకు అంగీకరిస్తారు? అనేది 2019 ఎన్నికల్లో తేలాల్సి ఉంది. అమరనాథ్‌ రెడ్డి రాజకీయ అవకాశ వాదంతో అటూ ఇటూ గెంతులు వేయడం నియోజకవర్గంలో ఎక్కువ మంది ప్రజలు జీర్ణించుకోలేకుండా ఉన్నారనే అభిప్రాయం ఉంది. తాము వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన్ను ఎన్నుకుంటే మంత్రి పదవి కోసం టీడీపీలోకి దూరిపోయారనే విమర్శలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో మంత్రి ఈ విషయంలో వ్యతిరేకత మూటగట్టుకున్నప్పటికీ దానిని సొమ్ము చేసుకుని ఆయనపై గెలుపొందే అభ్యర్థి వైఎస్సార్‌సీపీ నుంచి ఎవరున్నారనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది.

తెలుగు, తమిళ, కన్నడ భాషలు మూడూ చెలామణి అయ్యే ఈ నియోజకవర్గంలో అన్ని సంస్కృతులు కలగలిపి ఉంటాయి. వైవిధ్య భరితమైన ఈ నియోజకవర్గంలో ఓటర్ల నాడి పట్టుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజక వర్గం పలమనేరుకు పొరుగునే ఉండటం వల్ల ఆయన ప్రభావం దీనిపై చాలానే ఉంటుంది. అమరనాథ్‌ రెడ్డిని దేశంలోకి తీసుకున్నది, మంత్రి పదవిని ఇచ్చి బలోపేతం చేసిందీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ని నిలువరించడానికే కనుక ఈ దఫా ఆయనను పుంగనూరు నుంచే పోటీ చేయించే అవకాశం ఉందని తెలుగుదేశంలో ఆంతరంగికంగా జరుగుతున్న చర్చలను బట్టి తెలుస్తోంది.

ఇందుకు ప్రధాన కారణం రాజకీయాల్లో అమరనాథ్‌ రెడ్డి చాలా తెలివైన వాడని చంద్రబాబు అంచనా అట. తండ్రి దివగంత రామకృష్ణా రెడ్డి, చంద్రబాబుకు చాలా సన్నిహితుడు. అయినా ఆ అపేక్ష తనపై చంద్రబాబు ఎప్పుడూ ప్రదర్శించలేదని అమరనాథ్‌ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోయే వారట. మారిన రాజకీయ పరిస్థితుల్లో చిత్తూరులో బొజ్జల గోపాల కృష్ణారెడ్డి (మాజీ మంత్రి) సరిగ్గా విధులను నిర్వహించలేకుండా ఉన్నారని భావించి ఆయన స్థానంలో అమరనాథ్‌ రెడ్డిని అనివార్యంగా చంద్రబాబు దేశంలోకి తీసుకుని మంత్రి పదవిని ఇవ్వాల్సి వచ్చిందట. అయితే 2019లో మాత్రం తిరిగి అమరనాథ్‌ రెడ్డికే పలమనేరు నుంచి టికెట్‌ ఇస్తారన్న హామీ అయితే ఏదీ లేదంటున్నారు.

2014 ఎన్నికల్లో అమరనాథ్‌ రెడ్డిపై వైశ్య కులానికి చెందిన సుభాష్ చంద్రబోస్‌ దేశం అభ్యర్థిగా రంగంలోకి దిగి బాగా గట్టి పోటీని ఇచ్చారు. 2,300 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడారు కనుక ఈ దఫా తనకే టికెట్ వస్తుందని ఆశిస్తూ ఉండిన తరుణంలో అమరనాథ్‌ రెడ్డి సొంతగూటికి రావడంతో ఆయన అసంతృఫ్తికి లోనయ్యారు. తన ప్రత్యర్థి ఇటొస్తే (టీడీపీలోకి) తాను అటు (వైఎస్సార్‌సీపీలోకి)వెళదామని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు పసిగట్టి ఆయన్ను తన వద్దకు పిలిపించుకుని కౌన్సెలింగ్‌ చేశారు. అమరనాథ్‌ రెడ్డి పార్టీలోకి వచ్చినా పలమనేరు టికెట్‌ మాత్రం ఆయనకు ఇచ్చేది లేదని, దేశం అభ్యర్థిగా మళ్లీ మీకే (బోస్‌కే) టికెట్‌ ఇస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.

అందుకు అనుగుణంగానే బోస్‌కు రాష్ట్ర టీడీపీ కోశాధికారి పదవిని ఇచ్చి బుజ్జగించారు. పైగా బోస్‌ ఇప్పటి నుంచే నియోజకవర్గంలో పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థినవుతానని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. మరి అయితే అమరనాథ్‌ రెడ్డి పరిస్థితి ఏమిటి? అనేది కూడా చర్చగా ఉంది. పొరుగునే ఉన్న పుంగనూరులో పెద్దిరెడ్డిపై, అమరనాథ్‌ రెడ్డిని చంద్రబాబు టీడీపీ తరపున పోటీకి సిద్ధం చేస్తున్నారని లోపాయికారీ సమాచారం. అయితే ఇదింకా ధృవపడలేదు. ఆ ప్రాంతంలో ఎదురు లేని నాయకుడుగా ఉంటున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ని ఎదుర్కోవడానికి అమరనాథ్‌ రెడ్డిని తురుపుముక్కగా వాడుకోవాలని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ ఇద్దరూ భావిస్తున్నట్లు తెలిసింది.

అమరనాథ్‌ను కనుక పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పై పోటీ చేయిస్తే… తాము ఎలాగూ ఇష్టపడని మంత్రిని వదిలించుకున్నట్లు అవుతుందని, ఒక వేళ గెలిచి వస్తే తిరుగులేని పెద్దిరెడ్డిని ఓడించామనే ప్రతిష్ట మిగులుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారని దేశం వర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. చివరి నిమిషంలో చంద్రబాబు తన రాజకీయ చతురతతో ఏ వ్యూహాన్ని ఈ నియోజకవర్గంలో ప్రదర్శిస్తారో తెలియదు గానీ అమరనాథ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ ఇరువురిలో ఎవరు అభ్యర్థి అవుతారనేది ఇపుడు నియోజకవర్గంలో సర్వత్రా చర్చగా ఉంది. అయితే తానే మళ్లీ పలమనేరు నుంచి పోటీ చేస్తానని మాత్రం అమరనాథ్‌ ఎక్కడా చెబుతూ ఉండకపోవడం కూడా అందరినీ ఆలోచింప జేస్తోంది. మంత్రిగా ఉండి నియోజకవర్గం మారతారా? బలమైన పెద్దిరెడ్డిని నిజంగా ఆయన ఢీ కొనడానికి సిద్ధపడతారా? ఢీకోని విఫలమైతే అప్పటి పరిస్థితి ఏమిటి? వారసత్వంగా తమకు వచ్చిన రాజకీయ వారసత్వాన్ని పణంగా పెట్టేందుకు మంత్రి సిద్ధపడతారా? వంటి ప్రశ్నలకు వచ్చే ఎన్నికల్లోనే సమాధానం లభిస్తుంది.

ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నియోజకవర్గం సమన్వయకర్తలుగా ముగ్గురిని నియమించారు. వారిలో బిలారికుప్పం రాకేష్‌ రెడ్డి, సి.వి.కుమార్, మొగసాల రెడ్డెమ్మ ఉన్నారు. రాకేష్‌ రెడ్డి ఆర్థికంగా మంచి స్థితిపరుడు, వ్యాపారవేత్త కనుక ఆయనను తొలి సమన్వయకర్తగా జగన్‌ నియమించారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తన పలుకుబడితో మిగతా ఇద్దరినీ నియమింప జేశారు. ఒకే సమన్వయకర్త కనుక ఉండి ఉంటే వారే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఉంటారని భావించవచ్చు. ముగ్గురున్నారు కనుక వీరిలో ఎవరికి టికెట్‌ లభిస్తుందో తెలియక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణులు గందరగోళంలో ఉన్నాయి.

రాకేష్‌ రెడ్డి, మంత్రి అమరనాథ్‌ రెడ్డికి దూరపు బంధువు. ఒక వేళ మంత్రి పుంగనూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి వస్తే ఆయన వర్గం పలమనేరులో టీడీపీకి మద్దతు నిస్తుందని భావించలేం. అలాంటి పరిస్థితుల్లో లోపాయికారీగా అమరనాథ్‌ రెడ్డి వర్గీయులు రాకేష్‌కు సహకరించవచ్చు. అర్ధబలాన్ని అంచనా వేసినా మిగతా ఇద్దరు సమన్వయకర్తల కన్నా రాకేష్‌కు వనరులు బాగున్నాయి. ప్రస్తుతం రాకేష్‌ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ సినిమాకు నిర్మాతగా కూడా ఉన్నారు. ఈ చిత్రం విడుదలైతే అది తప్పకుండా రాజకీయంగా వివాదాస్పదం అవుతుందని చెప్పొచ్చు. మిగతా ఇద్దరి కన్నా వయసులో రాకేష్‌ చిన్నవాడే కాక, టీడీపీ నుంచి ఎదురయ్యే సవాలును నిలువరించే సత్తా గల నేత అనే అభిప్రాయం పార్టీలో ఉంది.

ఇక జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ మొగసాల రెడ్డెమ్మకు సొంత బలం అంటూ ఏమీ లేదు. ఆమె పెద్దిరెడ్డి చేతికింద మనిషి. ఆమె రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకున్నదంటే అది పెద్దిరెడ్డి చలువ వల్లనే అని అందరికీ తెలుసు. రెడ్డెమ్మకు ఒక వేళ టికెట్‌ ఇచ్చినా ఆమెకు అర్ధ, అంగబలాలను పెద్దిరెడ్డే సమకూర్చాలనేది జిల్లాలో అందరికీ తెలుసు. ఇక సి.వి.కుమార్‌ ఆర్థికంగా అంత బలవంతుడేమీ కాదు. మంచి మాటకారి, తన ఉపన్యాసాలతో అందరినీ ఆకట్టుకునే తత్వం ఆయన సొంతం. నేటి రాజకీయాల్లో మాటకారి తనం ఎంత వరకు పనికి వస్తుందనేది అనుమానమే అయినా ఎమ్మెల్యే టికెట్‌పై తానూ ఆశలు పెట్టుకున్నారు. ఈయన నియామకం కూడా పెద్దిరెడ్డి సూచనల మేరకే జరిగిందట. ఈ ముగ్గురు సమన్వయకర్తల్లో ఎవరికి టిక్కెట్‌ ఇవ్వాలనేది ఎన్నికల నాటికి జగన్‌ అన్ని పరిస్థితులనూ అంచనా వేసి పెద్దిరెడ్డితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఈ ముగ్గురితో పాటు ఎవరూ ఊహించని మరో ముగ్గురు అభ్యర్ధులు కూడా ఈ నియోజక వర్గం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. వారిలో ఒకరు మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి (ఈమె ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు). మరొకరు సినీనటుడు మోహన్‌ బాబు. ఇటీవలే టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్న బలిజ కులానికి చెందిన ఆకుల గజేంద్ర ప్రసాద్‌ కూడా ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేయడానికి ఉబలాట పడుతున్నట్లు సమాచారంగా ఉంది. చంద్రబాబు సొంత నియోజకవర్గానికి చెందిన గల్లా అరుణకుమారి అక్కడి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికైనా 2014 ఎన్నికల్లో జగన్‌ సన్నిహిత అనుచరుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి చేతిలో నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. స్వభావ రీత్యా ఆమెకు చంద్రబాబు పొడ అసలే గిట్టదు. తొలి నుంచీ ఆమె చంద్రబాబును శత్రువుగానే చూసేవారు.

దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పని చేసిన అరుణ కాంగ్రెస్‌లో ఉంటూ చంద్రబాబుపై నిరంతర పోరాటం చేసి ఆమె రాజకీయ మనుగడ కోసం, కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా అడుగంటి పోయిన నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో అరుణ టీడీపీలో చేరి 2014లో పోటీ చేశారు. తన కుమారుడు గల్లా జయదేవ్‌ నాయుడు గుంటూరు టీడీపీ ఎంపీగా ఉన్నప్పటికీ ఆమె మాత్రం వైఎస్సార్‌సీపీలోకి రావాలని భావిస్తున్నారట. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన ప్రాబల్యాన్ని బాగా పెంచుకుని ఉండటంతో మళ్ళీ అక్కడి నుంచి దేశం అభ్యర్థిగా పోటీ చేయడానికి అంత సుముఖంగా ఆమె లేరని అంటున్నారు.

జగన్‌ కనుక సమ్మతిస్తే ఆమె పలమనేరు నుంచి వైఎస్సార్‌సీపీ టికెట్‌పై పోటీ చేయడానికి సిద్ధమేనని సంకేతాలు పంపారని తెలుస్తోంది. ఒక విడత (ఆరేళ్లు) రాజ్యసభ సభ్యుడిగా ఉండిన మోహన్‌బాబు పేరు కూడా వైసీపీ నుంచి పోటీ చేస్తారనే మాట కూడా వినిపిస్తోంది. మోహన్‌బాబు జగన్‌కు బంధువు కూడా అయినందున ఆ అంశం కలిసి వస్తుందని కూడా అంటున్నారు. ఇక మిగతా పార్టీల ఊసే ఈ నియోజకవర్గంలో కనుపించే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌లో మిగిలి పోయిన ఛోటా మోటా నేతలంతా ఇటు వైఎస్సార్‌సీపీలోకో, అటు తెలుగుదేశంలోకో వెళ్లి పోయారు. అక్కడ కాంగ్రెస్‌ అవశేషాలు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు. రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ-వైఎస్సార్‌సీపీలలో అభ్యర్థుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు కనుక ఎన్నికల నాటి వరకూ వేచి చూడాల్సిందేనని చెప్పక తప్పదు.

NEWS UPDATES

CINEMA UPDATES