పవన్‌ను చూసి ముంత ఒలకపోసుకుంటున్నారా?

1337

మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకోవడం అనేది సామెత. ఈ సామెత ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ నేతలకు అన్వయించదగినది ఉంది. ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో తెలియని పవన్ కల్యాణ్ ను నమ్ముకుని ఇప్పటికే ఎర్రన్నలు చాలా ముందుకు వెళ్లిపోయారు. ఎంత వరకూ అంటే.. చివరకు వేరే ఎవరితోనూ దోస్తీ వద్దు అనేంత వరకూ.

సాధారణంగా కమ్యూనిస్టులు ఒక్కోసారి ఒక్కొక్కరితో జత కడుతూ వస్తుంటారు. ఒకసారి కాంగ్రెస్ తో అయితే మరోసారి తెలుగుదేశంతో ఇదీ వాళ్ల దశాబ్దాల చరిత్ర. అయితే వీరు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూడటం లేదు. కనీసం తెలంగాణలో కూడా వీళ్లు కాంగ్రెస్ ను పట్టించుకోవడం లేదు. ఇక్కడ కూడా పవన్ కల్యాణ్ అనే అంటున్నారు.

పవన్ కల్యాణ్ కు సినీ అభిమానగణం ఉందని, దాంతో లాభపడిపోతామనేది వీరి ఆశ.

సొంతంగా దేన్నీ సాధించలేని ఎర్రన్నలు సిద్ధాంతాలతో జనాన్ని ఆకర్షించలేమని అర్థం చేసుకున్నారో ఏమో…. ఇలా సినీ గ్లామర్ మీద ఆధారపడిపోయారు. అయితే పవన్ కల్యాణ్ తీరు మాత్రం యథాతథంగా మారుతూ పోతోంది. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ పోతున్నాడు. ఆఖరికి తెలంగాణలో పొత్తు విషయంలో కూడా ఏమీ తేల్చడం లేదు.

మరోవైపు ఏపీలో కూడా పవన్ కల్యాణ్ తో పొత్తు అని కమ్యూనిస్టు పార్టీ జాతీయ నేతలు కూడా ప్రకటించారు. వీళ్ల దివాళాకోరుతనం ఇలా ఉంది. రేపోమాపో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే తెలంగాణ విషయంలోనే పవన్ ఏమీ తేల్చడం లేదు. మళ్లీ ఇప్పుడు ఏపీలో పొత్తు అంటూ వీళ్లు తమ దిగజారుడు తీరును స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES