✓ పవన్‌ కల్యాణ్‌, బీజేపీపై జగన్ ఇచ్చిన క్లారిటీ….

1717

ఒక ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జగన్… పలు రాజకీయ అంశాలపైనా స్పష్టత ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌పై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా… పవన్ కల్యాణ్‌తో తనకు నేరుగా పరిచయం లేదని జగన్‌ చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ ముందు చంద్రబాబు బంధీఖాన నుంచి బయటకు రావాలని జగన్ పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు బయటకు వచ్చినా చంద్రబాబుకు మంచి చేసేందుకే వస్తారన్న అభిప్రాయం ఉందన్నారు.

చంద్రబాబుకు ఇబ్బంది కలిగినప్పుడే పవన్‌ కల్యాణ్ బయటకు రావడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను, అన్యాయాలను ప్రశ్నించాలని… అప్పుడు వేరేలా ఆలోచించేందుకు అవకాశం ఉంటుందన్నారు. చంద్రబాబు ఎవరితో కలిసి వచ్చినా తనకేమీ ఇబ్బంది లేదన్నారు. తనపని తాను చేసుకుపోతానని.. ప్రజల మనసు గెలిచేందుకు పనిచేస్తూ వెళ్తానన్నారు జగన్. ప్రజల ఆశీర్వాదం లేనప్పుడు ఎవరు ఎవరితో కలిసినా ఉపయోగం ఉండదన్నారు జగన్.

ఇక వైసీపీ బీజేపీతో కలుస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపైనా జగన్‌ స్పందించారు. నంద్యాల ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు… అదే సమయంలో జగన్ బీజేపీతో కలుస్తారంటూ ముస్లిం ఓట్ల కోసం ప్రచారం చేశారని గుర్తుచేశారు. చంద్రబాబుకు అసలు విలువలన్నవే లేవని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. బీజేపీని వదిలి బయటకు వచ్చే ధైర్యం చంద్రబాబు చేసే అవకాశమే లేదన్నారు. అలా చేస్తే ఏమవుతోందో చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. తాము మాత్రం రాజకీయాల కోసం పొత్తులు పెట్టుకోబోమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే పార్టీకి తాము మద్దతు పలుకుతామన్నారు. గతంలో మోడీని కలిసినప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇస్తేనే ఎవరితోనైనా కలుస్తామని స్పష్టంగా చెప్పానని జగన్ వివరించారు. అందుకు మోడీ నవ్వి ఊరుకున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీతో కలిసే ప్రసక్తే లేదన్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES