బాబు చిచ్చు… పవన్‌ శ్రీకాకుళం పర్యటన రద్దు

1810

పవన్‌ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దయింది. పర్యటన రద్దు చేసుకున్నట్టుగా జనసేన ప్రకటించింది. పర్యటన రద్దుపై కత్తి మహేష్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ అవగాహనా రాహిత్యానికి ఈయన పర్యటన రద్దే నిదర్శనమని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అన్ని కులాలకు ఇచ్చినట్టుగానే మత్స్యకారులకు వారిని ఎస్టీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ గిరిజనులకు, మత్స్యకారులకు మధ్య చిచ్చుపెట్టింది.

మత్స్యకారులను ఎస్టీల్లోకి చేరిస్తే గిరిజనులకు, ఆదివాసులకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ వారు ఆందోళనలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రప్రాంతంలో ఈ అంశంపై గిరిజనులకు, మత్స్యకారులకు మధ్య పలుమార్లు ఘర్షణ కూడా జరిగింది. ఇది చాలదన్నట్టు ఇటీవల మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలని పవన్‌ కల్యాణ్ కూడా డిమాండ్ చేశారు. వారి డిమాండ్‌కు మద్దతుగా ఉంటానని చెప్పారు. మత్స్యకారులకు మద్దతుగా శ్రీకాకుళం వస్తానని చెప్పారు.

దీంతో పవన్‌ కల్యాణ్‌పై గిరిజనులు భగ్గుమన్నారు. పవన్‌ కల్యాణ్ ఉత్తరాంధ్రకు వస్తే అడ్డుకుంటామని ప్రకటించారు. ఉత్తరాంధ్రలో గిరిజన జనాభా అధికం కావడం, పవన్‌ వస్తే అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో తన పర్యటననే పవన్‌ కల్యాణ్ వాయిదా వేసుకున్నారు. గిరిజనులకు, మత్స్యకారులకు మధ్య చంద్రబాబు రగిల్చిన చిచ్చును అర్థం చేసుకోలేకపోయిన పవన్‌ కల్యాణ్.. గుడ్డిగా ఒకరి పక్షం నిలిచారు. అవతలి పక్షం వార్నింగ్ ఇవ్వడంతో నాలుక కరుచుకున్నారు.

మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలన్నది తన డిమాండ్ కాదని.. చంద్రబాబు ఎన్నికల హామీలో చెప్పిందే తాను గుర్తు చేశానంటూ కవర్‌ చేసుకునేందుకు పవన్ ప్రయత్నించారు. ఈ విషయం మీద అవగాహన రాహిత్యంతోనే పవన్‌ కల్యాణ్ తన పర్యటన రద్దు చేసుకున్నారని కత్తి మహేష్ ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు.

NEWS UPDATES

CINEMA UPDATES