✓ ఎన్నికల విశ్లేషణలన్నీ…. బీజేపీని భయపెడుతున్నాయి

1177

గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో పోటీ ప‌డుతున్న రెండు ప్ర‌ధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ లు కుల స‌మీక‌ర‌ణాల‌కే ప్రాధాన్య‌త నిచ్చాయి. ప్ర‌ధాన కులాల‌ను సంతృప్తి ప‌రిచే విధంగానే సీట్ల పంప‌కం జ‌రిగింది. బిజెపి 58 మంది ఓబీసీల‌కు టిక్కెట్లు కేటాయించ‌గా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ 62 మంది ఓబీసీ అభ్య‌ర్ధుల‌ను రంగంలోకి దించింది. అదే విధంగా ద‌ళితుల విష‌యాన్ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటే కాంగ్రెస్ 14 మందికి అవ‌కాశం క‌ల్పిస్తే అధికార పక్ష‌మైన బిజెపి 13 మందికే అవ‌కాశం క‌ల్పించింది.

ఈ ఎన్నిక‌ల్లో సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచిన ప‌టేల్ వ‌ర్గీయుల విష‌యంలోను రెండు పార్టీలు ప్రాధాన్య‌త క‌న‌బ‌రిచాయి . బిజెపి 50 మందికి టిక్కెట్లు ఇస్తే….కాంగ్రెస్ మాత్రం 41 మందికే ఛాన్స్‌ క‌ల్పించింది.

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు కేవ‌లం 5 శాతం ఓట్ల తేడాపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. హార్ధిక్‌, అల్పేష్‌, జిగ్నేష్‌లు కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఆ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేదా అనే విష‌యం ఖ‌చ్చితంగా చెప్ప‌లేమ‌ని అచ్యుత్ యాజ్నిక్ అనే రాజ‌కీయ విశ్లేష‌కుడు తెలిపారు. ఆయ‌న అంచ‌నా ప్ర‌కారం కాంగ్రెస్ పార్టీ గ‌తంలో జ‌రిగిన మూడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లోను 40 శాతం ఓట్ల‌ను ద‌క్కించుకుంది. బిజెపి 49 శాతం ఓట్ల‌ను ద‌క్కించుకుంది. ఈ సారి ఈక్వేష‌న్లు ఖ‌చ్చితంగా మారుతాయ‌ని అచ్యుత్ యాజ్నిక్ అంటున్నారు. 5 శాతం ఓట్ల తేడా కాంగ్రెస్‌కు ఎంతో లాభించ‌నుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

గుజ‌రాత్‌లో ఉన్న 6 కోట్ల జ‌నాభాలో ప‌టీదార్ల జనాభా 12 శాతం ఉంది. వారు ఈసారి ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తార‌న‌డంలో సందేహం లేద‌ని అచ్యుత్ తెలిపారు. చాలా ఏళ్ల నుంచి బిజెపి కి మ‌ద్ద‌తు తెలుపుతున్న ప‌టీదార్ వ‌ర్గీయులు హార్దిక్ ప‌టేల్ చేసిన ఉద్య‌మంతో ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ప‌టీదార్ వ‌ర్గీయుల ఓట్లు ఈ సారి కాంగ్రెస్‌కు అధికంగా ప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రో పొలిటిక‌ల్ ఎన‌లిస్ట్ ఘ‌న‌శ్యామ్ షా మాత్రం కాంగ్రెస్‌కు ప్ర‌జ‌ల‌లో ఆద‌ర‌ణ పెరిగింద‌ని అంటున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ అప్ప‌ర్ హ్యాండ్ సాధించింద‌ని ఆయ‌న తెలిపారు. 2012 లోని ప‌రిస్థితి కంటే కాంగ్రెస్ ఎంతో మెరుగైన స్థానంలో ఉంద‌ని ఆయ‌న వివ‌రించారు. ద‌ళితుల‌కు సంబంధించి ఆయ‌న ఒక ఆస‌క్తిక‌ర విష‌యం తెలిపారు. గుజ‌రాత్ రాష్ట్రంలో ద‌ళితులు కేవ‌లం 7 శాతం మాత్ర‌మే ఉన్నార‌ని….వారికి కేటాయించిన సీట్ల‌లో కూడా జ‌నాభా 11 శాతానికి మించి లేర‌ని తెలిపారు.

మ‌రో రాజ‌కీయ విశ్లేష‌కుడు హ‌రి దేశాయ్ …. బిజెపికి ప‌టీదార్ల ఓట్ల‌ను నిలుపుకోవ‌డం క‌ష్టంగా మారింద‌ని తెలిపారు. అయితే చాలా కాలంగా బిజెపి లో ఉన్న‌వారు మాత్రం బిజెపికి అనుకూలంగానే ఉన్నార‌ని విశ్లేషించారు. హార్ధిక్ ప‌టేల్ చేప‌ట్టిన‌ ఉద్య‌మం.. అటువంటి వారిపై ప్ర‌భావం చూప‌లేద‌ని వివ‌రించారు. గ‌త ఎన్నిక‌లలో ల‌భించిన ఓట్లను ప‌రిశీలిస్తే బిజెపికి 47.85, కాంగ్రెస్‌కు 38.93 శాతం ఓట్లు వ‌చ్చాయని హ‌రి దేశాయ్ గుర్తుచేశారు.

బిజెపి …..త‌మ ఓట్ల శాతంలో ఎటువంటి మార్పు ఉండ‌ద‌ని భావిస్తుంటే,….కుల‌స‌మీక‌ర‌ణాలు త‌మ‌కు క‌లిసివ‌స్తుంద‌ని కాంగ్రెస్ భావిస్తోంది. త‌మ ఓట్ల శాతం పెరుగుతుంద‌నే న‌మ్మ‌కంతో కాంగ్రెస్‌ ఉంద‌ని దేశాయ్‌ తెలిపారు. షెడ్యూల్ కులాల ప్ర‌జ‌లు, షెడ్యూల్ తెగ‌ల ప్ర‌జ‌లు ఈ సారి కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నార‌ని….కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తేనే త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే బిజెపి అధికార ప్ర‌తినిధి భ‌ర‌త్ పాండ్యా మాత్రం కుల స‌మీక‌ర‌ణాల‌పై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. ఒక సామాజిక ఉద్య‌మం రాజ‌కీయ రూపం దాల్చితే దానికి ప్రాధాన్య‌త తగ్గిపోతుంద‌ని అన్నారు. హార్ధిక్ ప‌టేల్‌, అల్పేష్, జిగ్నేష్ మేవానీ విష‌యంలో అదే జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.

ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా విశ్లేష‌ణ‌లు చేసినా… గుజ‌రాత్ ప్ర‌జ‌లు ఎటువైపు ఉన్నార‌నే విష‌యం డిసెంబ‌ర్ 18 న తేల‌నుంది.

NEWS UPDATES

CINEMA UPDATES