అద్దంకి లో గొట్టిపాటి రవికి పోటీ ఎవరు?

11418

కమ్మ సామాజిక వర్గం పెత్తనం అధికంగా గల అద్దంకి శాసనసభా నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ (బుజ్జి) వైఎస్సార్‌ సీపీ తరపున 2014 ఎన్నికల్లో గెలుపొంది, ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రోద్బలంతో టీడీపీలోకి గెంతారు. ఆయన టీడీపీలోకి వచ్చిన కొత్తల్లో అక్కడ మరో టీడీపీ నేత కరణం బలరాం (బలరామ కృష్ణమూర్తి)తో విభేదాలు భగ్గుమన్నాయి. తీవ్ర స్థాయిలో జరిగిన ఘర్షణల్లో కరణం వర్గానికి చెందిన ఓ వ్యక్తి కూడా హత్యకు గురయ్యారు. ఆ తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీరిగ్గా రంగ ప్రవేశం చేసి సామరస్య చర్చల్లో భాగంగా బలరాంకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి సంతృప్తిని కలిగించే యత్నం చేశారు.

ఆ తరువాత కూడా కక్షలు చల్లారక పోయేటప్పటికి బలరాంకు, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌కు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ విడివిడిగా గట్టిగా వార్నింగ్‌లు ఇచ్చారట. గొట్టిపాటితో వైరం మానుకోవాలని సూచించారట. వాస్తవానికి గత (2014) ఎన్నికల్లో గొట్టిపాటికీ, కరణం తనయుడు కరణం వెంకటేష్‌కూ మధ్య జరిగిన హోరా హోరీ సమరంలో రవికుమార్‌ విజయం సాధించారు. ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతలు ఆ తరువాత కూడా కొనసాగాయి. హింసా రాజకీయాలతో దురుసుగా ప్రవర్తిస్తారని పేరున్న కరణం బలరాం తనయుడు ఇలాంటి విషయాల్లో తండ్రిని మించిన తనయుడుగా తయారయ్యాడనే పేరుంది. అందుకు కరంణంపై అనేక నేరపూరిత కేసులుండటమే కారణం. (ఆ తరువాత వివిధ స్థాయిల్లో కోర్టులు కొట్టి వేశాయనుకోండి….) తన ఓటమిని బొత్తిగా జీర్ణించుకోలేక పోయిన వెంకటేష్‌ అక్కసుతో ఎన్నికలు పూర్తయిన నాటి నుంచీ గొట్టిపాటి అనుచరులపై దాడులను ప్రోత్సహించడం, తానే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి దురుసుగా వ్యవహరించడం ప్రారంభం అయింది.

ఒక దశలో ప్రకాశం జిల్లా కలెక్టరు కార్యాలయంలో జరిగిన సాగునీటి పారుదల సలహా మండలి సమావేశానికి ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో హాజరైన గొట్టిపాటి రవికుమార్‌ పై దాడికి ప్రయత్నం జరిగింది. కరణం తండ్రీకొడుకుల ప్రోత్సాహంతో ఆయన వర్గీయులు నేరుగా సమావేశంలోకి చొచ్చుకుని వచ్చి గొట్టిపాటిపై దాడికి ప్రయత్నించగా ఆయన తప్పించుకున్నారు. చొక్కా మొత్తం చిరిగి పోయింది. అదే సమయంలో గొట్టిపాటి రవి కారు ధ్వంసం అయింది. డ్రైవర్‌, గన్‌మెన్‌లపై దాడి జరిగింది. ఇదంతా కూడా అధికారయంత్రాంగం సాక్షిగా జరగడం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

గొట్టిపాటి రవి పై దాడి యత్నం జరిగినపుడు ప్రతిపక్షం ఆ అంశాన్ని అంతగా పట్టించుకోలేదన్నది స్పష్టం. కేవలం డీజీపీకి ఓ వినతిపత్రం ఇచ్చి చేతులు దులుపుకుంది. తన పార్టీ ఎమ్మెల్యేపై దాడి జరిగితే ప్రతిపక్షం రాజకీయంగా దానిని ఎంత పెద్ద సమస్యగానైనా చేయవచ్చు. అధికారపక్షం ఆగడాలను ఎండగట్టి ఉండవచ్చు. అయితే ఎందుకనో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై అంతంత మాత్రంగానే స్పందించారు. వెంకటేష్‌ తన బలంతో గొట్టిపాటి అనుచరులను అద్దంకి లో నిలబడలేని స్థితికి తీసుకురావాలన్నట్లుగా తన చేష్టలతో భయపెట్టారు. ఇదే ఒక రకంగా గొట్టిపాటి రవిని టీడీపీ వైపునకు అడుగులు వేయించిందని చెప్పాలి. ప్రతిపక్షంలో ఉంటే తనకు రక్షణ లేదనుకున్నారో…. ఏమో…. గానీ అప్పటినుంచీ వైఎస్సార్‌సీపీతో ఎడంగానే ఉండేవారు.

ఇది గమనించిన టీడీపీ నేతలు ముఖ్యంగా లోకేష్‌, రవికి గాలం వేశారు. రవికి బల్లికురవ మండలంలో ఉన్న గ్రానైట్‌ తవ్వకాలను టీడీపీ ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి నిలిపివేయించింది. దాంతో ఆయనకు కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడటంతో ఆర్థికంగా ఓ కుదుపునకు లోనయ్యారు. ప్రతిపక్షంలో ఉంటే భారీగా నష్టపోవడమే కాక, భౌతికంగా తనకు ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న ఆందోళనతో ఆయన టీడీపీ పంచన చేరారు. రాజశేఖరరెడ్డి గారికి వీరాభిమాని అయిన ఆయన ఓ రోజు ప్రశాంతంగా జగన్‌ను కలిసి తాను పార్టీ వీడుతున్నాననీ, అలా వీడటానికి గల కారణాలను కూడా వివరించి పార్టీ నుంచి నిష్క్రమించారు. ఆ తరువాత కూడా వరుసగా జిల్లాస్థాయిలో జరిగిన రెండు టీడీపీ సమావేశాల్లో కరణం, గొట్టిపాటి వర్గీయులు బాహాబాహీకి దిగారు. పరుష పదజాలం ప్రయోగించుకున్నారు. కానీ చంద్రబాబు, లోకేష్‌ మాత్రం గొట్టిపాటి వైపే మొగ్గు చూపారు. తనకు తొలినాటి స్నేహితుడైన కరణంను చంద్రబాబు పక్కన బెట్టారు. ఆయన్ను పిలిచి గట్టిగా చెప్పారు. అద్దంకి పార్టీ వ్యవహారాల్లో ఆధిపత్యం కోసం పోటీ పడొద్దని మౌనంగా ఉంటే ఏదైనా చేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో కరణం పూర్తిగా అద్దంకిపై తనకు టీడీపీ పరంగా ఉన్న రాజకీయ హక్కులను వదులుకున్నారని విశ్వసనీయ సమాచారం.

అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవి చెప్పిన వారికే పనులు చేసి పెట్టాలని, అభివృద్ధి పనుల్లో కూడా ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం సూచించడంతో కరణం వాస్తవం గ్రహించి సర్దుకుంటున్నారని తెలిసింది. అంతే కాదు, తన వద్దకు వస్తున్న టీడీపీ కార్యకర్తలను (తన అనుచరులను) కూడా తన వద్దకు వస్తే పనులు చేయలేనని ‘దారి చూసుకోండి….’ అని సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మంత్రి లోకేష్‌బాబు ఇటీవల అద్దంకి లో పర్యటించినపుడు కూడా ఎక్కడా కరణం వర్గీయుల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. టీడీపీ ఎమ్మెల్సీ అయినప్పటికీ బలరాంను తన పర్యటనకు రావద్దని లోకేష్‌ స్వయంగా కబురు పెట్టడంతో ఆయన కూడా హాజరు కాలేదు. అక్కడ దృశ్యం అంతా గొట్టిపాటి రవిదే కనిపించింది. లోకేష్‌ పాల్గొన్నది ప్రభుత్వ కార్యక్రమమే అయినప్పటికీ ఎమ్మెల్యే రవి జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా నచ్చ జెప్పుకుని తానే మొత్తం నిర్వహిస్తానని అనుమతి తీసుకున్నారట. భారీగా ఖర్చుపెట్టి సుమారు 2000 వాహనాల్లో జనాన్ని తరలించి అడుగడుగునా లోకేష్‌కు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇక నియోజకవర్గ టీడీపీలో రవికే పూర్తి ఆధిపత్యం లభించినట్లు అయిందని ప్రజలు భావిస్తున్నారు. లోకేష్‌ కూడా ఈ ఏర్పాట్లకు ముగ్ధుడై రవిని ప్రశంసలతో ముంచెత్తడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో అద్దంకి లో కుప్పంకు మించిన మెజారిటీ రావాలని ఈ మెజారిటీతోనే బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలో ఎంపీ సీటు గెలవాలని ( బాపట్లలో అద్దంకి నియోజకవర్గం అంతర్భాగం) పిలుపు నిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో రవి టీడీపీ అభ్యర్థిగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక వైఎస్పార్‌ సీపీ విషయానికి వస్తే ఆ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన వై.వి.సుబ్బారెడ్డికి ఇది సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీని గెలిపించడం ఆయనకూ ప్రతిష్ఠే. గత ఎన్నికల్లో రవిని ఆయనే ఎంపిక చేశారు. వాస్తవానికి రవి 2004లో మార్టూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి టికెట్‌ ఇస్తే గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో మార్టూరు రద్దయ్యాక కొన్ని మండలాలు అద్దంకి లో కలిశాయి. 2009లో వై.వి మద్దతుతో రవి మళ్లీ అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరాం (అప్పట్లో సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే)పై పోటీ చేసి మంచి ఆధిక్యతతో గెలుపొందారు.

2014లో రవి, కరణం తనయుడు వెంకటేష్‌పై నెగ్గారు. ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యే అయిన రవి నాలుగోసారి రంగంలోకి దిగితే ఆయన్ను ఎదుర్కొనేందుకు స్థాయి ఉన్న నేత నియోజకవర్గంలో ఎవరున్నారనేది ఇపుడు అక్కడి ప్రజలను తొలుస్తున్న ప్రశ్నగా ఉంది. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాచిన చెంచుగరటయ్య పాతకాపు. ఆయన గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు ఏదో నడిపిస్తున్నారే తప్ప నియోజకవర్గంలో అంత క్రియాశీలంగా లేరనేది సర్వత్రా వినిపిస్తోంది. గరటయ్య ఆర్థికంగా కూడా రవిని ఢీకొనే స్థాయిలో ప్రస్తుతం లేరని అంటున్నారు. వై.వి, జగన్‌కు బాబాయ్‌ కనుక ఆయనే కనుక బాధ్యత తీసుకుంటే గరటయ్యకు అర్థబలం సమకూర్చాల్సి ఉంటుంది. సొంతంగా అర్థబలం ఉండటానికి, వేరొకరు సమకూర్చడానికి చాలా తేడా ఉంటుందంటున్నారు. గరటయ్యను మరో ఏడాది పాటు సమన్వయకర్తగా కొనసాగించి, చివరిలో ఆయనకు ఏదో ఒకరకంగా నచ్చ జెప్పి పార్టీ అధికారంలోకి వస్తే గౌరవప్రదమైన పదవి ఇస్తామని చెప్పి ఎవరైనా కొత్త నేతను రంగంలోకి దింపుదామా! అనే ఆలోచనలో కూడా ఆ పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అద్దంకి లో చాలామంది (వీరిలో టీడీపీ వారు కూడా ఉన్నారు) వై.వి గడప తొక్కి లెక్కలేనన్ని పనులు చేయించుకున్నారు. అప్పట్లో ఆయన ఇంటికి వెళితే కనిపించేదంతా అద్దంకి నుంచి పనుల కోసం వచ్చే వారే…. అందువల్ల ఎవరినో రంగంలోకి తెచ్చే బదులు ఆయనే పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా అక్కడక్కడా వినిపిస్తోంది. ఆయన సోదరుడు వై.వి.భద్రారెడ్డికి కూడా అద్దంకి ప్రజలతో విస్తృత సంబంధాలున్నాయి. ఆయనకు ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలనే ఉబలాటం ఉంది. అయితే జగన్‌ అనుమతిస్తాడా? లేదా? అనేది కూడా వేచి చూడాల్సి ఉంది.

ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లది పెద్ద వాటా. ఆ తరువాత రెడ్డి సామాజిక వర్గం వారున్నారు. కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం గల ఈ నియోజకవర్గంలో ఓ రెడ్డి వైసీపీ తరపున పోటీకి దిగితే గెలిపిస్తారా? అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. మిగతా, అంటే ఎస్సీ, బీసీ వర్గాలు గణనీయంగానే ఉన్నా వారి మొగ్గు ఎలా ఉంటుందోనన్న భీతి కూడా వైసీపీ వర్గాల్లో ఉంది. వీళ్లెవ్వరూ కాదనుకుంటే ఇప్పటికి రూపుదాల్చని ఆ అదృశ్య వ్యక్తి ఎవరు? భారీగా నిధులు ఎన్నికల్లో ఖర్చుచేయగల సామర్థ్యం, రవికి ధీటుగా, అధికారపక్షం అధికార దుర్వినియోగాన్ని నిలువరించే సత్తా గల నాయకుడెవరనేది అంతు చిక్కకుండానే ఉంది. రవి టీడీపీలోకి వెళ్లారు కనుక కరణం బలరాం ఆ పార్టీని వీడి వైసీపీలోకి వచ్చి అభ్యర్థి అవుతాడనే వాదన కూడా లేకపోలేదు. కానీ బలరాం ప్రవృత్తికీ, ఆయన ఆలోచనా సరళికీ వైసీపీకి గిట్టదు. అనివార్య కారణాల వల్ల బలరాం ప్రతిపక్షంలోకి చివరి క్షణంలో వచ్చినా ప్రజలు ఎంత వరకు ఆదరిస్తారనేది కూడా ఆలోచించాల్సి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అద్దంకిలో ఇతర పార్టీల ఉనికి చాలా నామమాత్రంగా ఉంది. వామపక్షాలు, బీజేపీ బలాలు గొర్రెతోకకు మించదు, అంతకు తగ్గదు అన్న చందంగా ఉంది. కనుక ఆ పార్టీల నుంచి అభ్యర్థులను ఆశించడం అత్యాశే అవుతుంది. ఇంకా కార్యరంగంలోకి దిగని జనసేన గురించి చర్చించడం కూడా ఇప్పుడు అనవసరమేమో…!

NEWS UPDATES

CINEMA UPDATES