అవకాశవాదుల అడ్డా…. ఆళ్లగడ్డ

10038

ఒకప్పుడు బాంబుల గడ్డగా పేరు మోసిన ఆళ్లగడ్డ నేడు అవకాశవాద రాజకీయాలకు అడ్డాగా మారింది. కక్షలూ… కార్పణ్యాలు… హత్యలతో దశాబ్దాలుగా కునారిల్లిన ఈ ప్రాంతంలో ఇప్పటికీ అవే ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని ఈ నియోజకవర్గం కడప జిల్లా సరిహద్దుల్లో దక్షిణాన ఉంది. ఇక్కడ రాజకీయ పార్టీలుండవు…. అంతా వర్గ రాజకీయాలే…. అది కూడా దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య చెలరేగుతున్న వైరమే ఇక్కడి రాజకీయాల చరిత్ర అని చెప్పవచ్చు. ప్రజలకు ప్రజాస్వామ్య బద్ధంగా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కు ఈ నియోజకవర్గంలో నిన్న మొన్నటి దాకా లేదనే చెప్పాలి. ఆ మాటకొస్తే నేటీకీ అంతగా స్వేచ్ఛ లేదనే చెప్పాలి. ఏ గ్రామంలో ఏ గ్రూపునకు ప్రాబల్యం ఉంటే వారే నిలబడి రిగ్గింగ్‌ చేసుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ.

ఎన్నికల విధానాల్లో మార్పులు వచ్చినా రిగ్గింగ్‌కు అవకాశం లేకపోయినా ప్రలోభాలు పెట్టడం, బెదిరించి ఓట్లేయించుకోవడం అనేది నేటికీ కొనసాగుతోంది. అయినా ప్రజాస్వామ్య ప్రియులైన ఓటర్లు అవకాశం దొరికినపుడు తమకు గిట్టని నేతలకు సరైన రీతిలో బుద్ధి చెబుతూ ఉంటారు. ఇక్కడ దశాబ్దాలుగా జరుగుతున్న రాజకీయ పోరాటం ప్రధానంగా గంగుల, భూమా కుటుంబాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అది కాంగ్రెస్‌ అయినా…. టీడీపీ అయినా…. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అయినా లేదా మరో పార్టీ అయినా… గంగుల, భూమా కుటుంబాల మధ్యనే పోరు జరుగుతూ ఉంటుంది. అర్థ, అంగ బలాల్లోనూ…. ఫ్యాక్షన్‌ రాజకీయాల్లోనూ ఈ రెండు కుటుంబాలు సమ ఉజ్జీలే కనుక మూడో కుటుంబం గాని, శక్తి గానీ ఇక్కడి రాజకీయాల్లో ఇంత వరకూ జొరబడి నిలదొక్కుకోలేదు.

తాజా రాజకీయ పరిణామాల్లో కూడా భూమా, గంగుల కుటుంబీకుల వారసులే రాజకీయాధిపత్యం కోసం మళ్లీ పోటీ పడుతున్నారు. ఈ రెండు కుటుంబాల వారసులే 2019 సాధారణ ఎన్నికల్లో ‘సై…. అంటే… సై’ అనే రీతిలో తలపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. ఈ రెండు కుటుంబాల పోరాట క్రమంలో వారి అవకాశవాద రాజకీయాలు కూడా హద్దులు మీరిందనేది కళ్లకు కనిపిస్తున్న సత్యం. ఒకప్పుడు గంగుల తిమ్మారెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థులు. రాజకీయాల్లో బాగా ఆరితేరిన ఎస్వీ సుబ్బారెడ్డిది ఆళ్లగడ్డే. అయినప్పటికీ తన రాజకీయాన్ని ఆయన కర్నూలుకు, ప్రత్తికొండకు కూడా విస్తరించారు. ఆళ్లగడ్డలో తిమ్మారెడ్డిని ఎదుర్కోవడానికి 1970వ దశకంలోనే అదే నియోజకవర్గంలోని కొత్తపల్లి భూమా బాలిరెడ్డిని ఎస్వీ సుబ్బారెడ్డి తెచ్చుకున్నారు. బాలిరెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి ఇద్దరూ స్వయానా బావా, బావమరుదులు. ఫ్యాక్షన్‌ రాజకీయాల్లో ప్రత్యర్థుల చేతిలో భూమా బాలిరెడ్డి హత్యకు గురయ్యే నాటికి ఆయన సంతానం అంతా పిన్న వయస్కులు. పెద్ద దిక్కుగా ఎస్వీ సుబ్బా రెడ్డే రాజకీయం చేస్తూ వచ్చారు.

1978 కాంగ్రెస్‌(ఐ) ప్రభంజనంలో ఆ పార్టీ టికెట్‌ పొందిన గంగుల తిమ్మారెడ్డి గెలుపొందారు. ఎన్నికైన రెండేళ్ళకే ఆయన సహజమరణం పొందడంతో వారసుడిగా గంగుల ప్రతాప్‌ రెడ్డి తెరమీదకు వచ్చి తన తండ్రి మృతితో ఖాళీ అయిన ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు. 1982లో టీడీపీ ఆవిర్భవించాక రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయి. రాయలసీమలో ఫ్యాక్షన్‌ రాజకీయాల్లో ఆరి తేరిన వారంతా కూడా ఒకరు కాంగ్రెస్‌లో ఉంటే మరొకరు టీడీపీని ఆశ్రయించారు. అదే క్రమంలో భూమా (ఎస్వీ) కుటుంబం టీడీపీలోకి వెళ్లింది. ఇక అక్కడి నుంచీ గంగుల, భూమా రెండో తరం వారసులే విడతల వారీగా ఆళ్లగడ్డ రాజకీయాలు శాసిస్తూ వచ్చారు. ఒకసారి గంగుల గెలిస్తే మరోసారి భూమా గెలవడం ఆనవాయితీగా మారింది. అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా సరే…. అభ్యర్థిత్వాల కోసం ఈ రెండు కుటుంబాల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కుటుంబాలు రెండింటికీ దాదాపుగా అన్ని గ్రామాల్లో గ్రూపులున్నాయి. కొన్ని చోట్ల ఒక కుటుంబానికి గ్రూపు లేక పోయినా గట్టిగా సమర్థించే నేతలున్నారు. అన్ని గ్రామాల్లోనూ తగాదాలున్నాయి. కనుక ఒక వర్గం ఓ వైపునకు వెళ్లితే అని వార్యంగా మరో వర్గం ఇంకొక వైపునకు వెళుతూ ఉంటుంది. ఈ పరిణామాల వల్ల ఎవరు ఏ పార్టీలో ఉంటారో అంచనా వేయడం అంత సులువైన పని మాత్రం కాదు.

మూడో తరం రాజకీయం

గంగుల, భూమా కుటుంబాల రాజకీయం ఇప్పటికి రెండు తరాలు దాటి మూడో తరంలోకి ప్రవేశించింది. ఆ కుటుంబాలకు చెందిన మూడోతరం ప్రతినిధులే అక్కడ రేపటి ఎన్నికల్లో తలపడబోతున్నారు. మొన్నటి (2014) ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కీలక నేతలుగా ఉంటూ మొత్తం కర్నూలు రాజకీయాన్ని తమ కనుసన్నల్లో నడిపించుకున్న భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతులిద్దరూ తాము గెలిచారు కానీ వారున్న పార్టీ మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. వైఎస్సార్‌సీపీలో చురుగ్గా, క్రియాశీలంగా రాజకీయాలు నెరుపుతూ… టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై పదునైన పదజాలంతో విరుచుకు పడుతూ ఉండిన నాగిరెడ్డి సతీమణి శోభ ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబానికి ఆశనిపాతంలాగా తగిలింది. ఎన్నికల తరువాత మరణించిన అభ్యర్థిగా రంగంలో ఉండి గెలిచి శోభ జాతీయ స్థాయి ఎన్నికల చరిత్రల్లోనే ఒక రికార్డును నెలకొల్పారు. ఆమె భర్త నాగిరెడ్డి కూడా నంద్యాల నుంచి స్వల్ప ఆధిక్యత (4000 లోపు ఓట్లతో) విజయం సాధించారు.

సతీమణి దుర్మరణం పాలు కావడం, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాకపోవడం నాగిరెడ్డిని బాగా కుంగదీసింది. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఆయనను నంద్యాల లోక్‌సభా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి కోరారట. అయితే తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని నంద్యాలను నాగిరెడ్డి కోరుకున్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు కనుక తాను ఎమ్మెల్యే అయి మంత్రి వర్గంలో చేరాలనేది ఆయన ఆశ అని మృతి చెందిన ఆయన సతీమణి శోభ సన్నిహితుల వద్ద చెప్పేదట. వైఎస్సార్‌సీపీలో భూమా నాగిరెడ్డి ఉన్నారు కనుక అనివార్యంగా అప్పటి వరకూ కాంగ్రెస్‌లో ఉండిన గంగుల ప్రతాప్‌ రెడ్డి సోదరుడు గంగుల ప్రభాకర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఆళ్లగడ్డలో పోటీ చేయాల్సి వచ్చింది. శోభ మరణం తరువాత సాంకేతికంగా ఆమె పేరును బ్యాలెట్‌ పత్రం నుంచి తొలగించడం సాధ్యం కాదు కనుక, ఎన్నికల కమిషన్‌ అలాగే కొసాగించి ఎన్నికలు నిర్వహించింది. (మరణించిన శోభ పేరును, గుర్తును తొలగించి ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ అప్పట్లో డిమాండ్‌ చేసింది. కానీ కమిషన్‌ నిబంధనల ప్రకారం అది సాధ్యం కాలేదు).

శోభ మృతి వల్ల సానుభూతి వెల్లువెత్తుతుందని భావించిన పరిశీలకులకు అది నిజం కాదని ఫలితాల వెల్లడి అనంతరం అర్థం అయింది. అప్పట్లో ఆమెకు వచ్చిన 17 వేల మెజారిటీ అతి భారీగా మాత్రం ఏమీ లేదు. అయితే ఆమె మృతి వల్ల ఆ సానుభూతి నంద్యాలలో కొంత మేరకు పని చేసి తన భర్త నాగిరెడ్డిని స్వల్పంగా గెలిపించడానికి కారణమైందని అప్పట్లో అందరూ బాహాటంగా వ్యాఖ్యానాలు చేశారు. భార్య మరణించి, భర్తను గట్టెక్కించారనే మాట వినిపించింది. శోభ మెజారిటీ చూస్తే భూమాకు వ్యతిరేకంగా గంగుల కుటుంబం ఎంత గట్టి పోటీ నిచ్చిందో ఇట్టే అర్థం అవుతుంది. వాస్తవానికి భూమా కుటుంబీకులు టీడీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో ఉంటూ దానితో పాటు వీరూ ఎదిగారు. ఆ పార్టీ తరపున నాగిరెడ్డి మూడుసార్లు లోక్‌సభకు నంద్యాల నుంచి ఎన్నికయ్యారు. ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఆయన లోక్‌సభకు పోటీచేసిన తరుణంలో భార్య శోభ ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, మంచి దక్షత గల రాజకీయవేత్తగా రాణించారు. ఆమె టీడీపీ హయాంలో ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థకు చైర్మన్‌గా పనిచేసి, ఒక మహిళ అంత పెద్ద కార్పొరేషన్‌కు నేతృత్వం వహించారనే ఘనతను సాధించారు.

కర్నూలు రాజకీయాల్లో చంద్రబాబు తమ కుటుంబాన్ని ఎంతగా వాడుకున్నా మంత్రి పదవి ఇచ్చే విషయంలో మాత్రం తమ పట్ల వివక్షను చూపిస్తున్నారనే అసంతృప్తి భార్యాభర్తలిద్దరికీ ఉండేదని వారి సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఒక దశలో గట్టిగా ఒత్తిడి పెరిగి భూమా శోభకు మంత్రి పదవి ఇవ్వక తప్పదనుకుంటున్న తరుణంలో వారి యాజమాన్యంలో నడిచే థియేటర్‌పైనా వారి ఆస్తులపైనా విద్యుత్‌ శాఖ దాడులు నిర్వహించి విద్యుత్‌ చౌర్యం కేసులను నమోదు చేసింది. విద్యుత్‌ చౌర్యం పేరుతో దాడులు చేయించడం, ఆ వార్తను క్షణాల మీద మీడియాకు ఉప్పందించడం జరిగిపోవడం వెనుక చంద్రబాబు ప్రచ్ఛన్న హస్తం ఉందని, మంత్రి పదవి ఎగ్గొట్టడానికి ఈ పని చంద్రబాబే చేయించాడని భార్యాభర్తలు ఇద్దరూ విశ్వసించడమే ఆ తరువాత క్రమంలో వారు ఆ పార్టీని వీడటానికి కారణమైందని నియోజకవర్గం ప్రజల్లో ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. దీనిని సాకుగా చేసుకుని చంద్రబాబు 2004కు ముందు శోభకు మంత్రి పదవి విషయంలో మొండి చేయి చూపారు. వాస్తవానికి అంతకు ముందే ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండిన శోభ తండ్రి, నాగిరెడ్డికి స్వయానా మేనమామ ఎస్వీ సుబ్బారెడ్డికి కొంత కాలం పాటు చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఆ తరువాత మార్పుల్లో తొలగించారు. ఈ అసంతృప్తి కూడా వారిలో ఉంది.

2004 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైనపుడు భార్యా భర్తలిద్దరూ ఒకరు (నాగిరెడ్డి) నంద్యాల లోక్‌సభా నియోజకవర్గం, మరొకరు (శోభ) ఆళ్లగడ్డ శాసనసభా నియోజకవర్గం నుంచి అదే పార్టీ అభ్యర్థులుగా పరాజయం పాలయ్యారు. 2004-2009 మధ్య కాలంలో సినీనటుడు చిరంజీవి నేతృత్వంలో పార్టీ స్థాపించిన తరువాత వీరిద్దరూ టీడీపీకి గుడ్‌బై చెప్పి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయి అక్కడ కూడా కీలక స్థానాలను చేపట్టారు. 2004 ఎన్నికల్లో శోభ కాంగ్రెస్‌ అభ్యర్థి గంగుల ప్రతాప్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2009లో మళ్ళీ వీరిద్దరే తలపడ్డారు. గంగుల కాంగ్రెస్‌ అభ్యర్థిగానూ, శోభ ప్రజారాజ్యం నుంచీ పోటీ చేశారు. శోభ మూడువేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ దంపతులిద్దరూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో సాన్నిహిత్యం కోసం పావులు కదుపుతూ వచ్చారు. అందుకు ఆయన కూడా సానుకూల సంకేతాలు ఇచ్చారు. ఈ లోపుగా ఆయన మరణం వారికి ప్రతికూలంగా పరిణమించింది. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసినపుడు తాను అటు వెళ్లకుండా శోభ జగన్‌ను బలపర్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి మళ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి 18 వేల ఆధిక్యతతో గంగుల ప్రతాపరెడ్డి సోదరుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి గంగుల ప్రభాకర్‌రెడ్డి పై గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో గంగుల కుటుంబీకుల (సోదరులు) మధ్య జరిగిన ఒక అవగాహనతో ప్రతాపరెడ్డి తప్పుకుని తన సోదరునికి అవకాశం ఇచ్చారు. అప్పట్లో టీడీపీకి అభ్యర్థి లభించక పోవడంతో మరో నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డికి చంద్రబాబు టికెట్‌ ఇచ్చారు. ఆయన కూడా ఈ ఎన్నికల్లో 20 వేలకు పైబడిన ఓట్లను సాధించుకుని ఓటమి పాలైనా తన ఉనికిని చాటుకున్నారు.

2014 వచ్చేటప్పటికి శోభ మరణించినా కూడా గంగుల ప్రభాకర్‌ రెడ్డిపై విజయం సాధించారు. గెలిచిన అభ్యర్థి ఇది వరకే మరణించి ఉన్నారు కనుక ఆ స్థానాన్ని ఎన్నికల కమిషన్‌ ఖాళీ అయినట్లు ప్రకటించి తిరిగి వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అన్ని పార్టీల సహకారంతో శోభ తనయ భూమా అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎమ్మెల్యే అయి మూడో తరం వారసత్వాన్ని చేపట్టారు. ఎన్నికైన రెండేళ్ల పాటు ఆమె వైఎస్సార్‌సీపీలోనే చిత్తశుద్ధితో కొనసాగారు. తన తండ్రి భూమా నాగిరెడ్డిపై చిన్నపాటి ఘర్షణకే ఎస్సీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టి వేధించినపుడామె గట్టిగానే చంద్రబాబు ప్రభుత్వంపై గళం విప్పారు. తన తండ్రికి ఏం జరిగినా చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరికలు చేశారు. అలా కొంత కాలం పాటు తన తండ్రిపై వేధింపుల పర్వాన్ని సాగించిన టీడీపీ ప్రభుత్వం ఆ తరువాత మెల్లగా దువ్వడం ప్రారంభించింది.

అధికారపక్షం తాకిడికి బాగా గురై ఉన్న భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వెళితే తనకు మంత్రి పదవి లభిస్తుందనే ఆశతో పార్టీని ఫిరాయించారు. అదే బాటలో అఖిలప్రియ కూడా టీడీపీలోకి వెళ్లి పోయారు. తాను నాగిరెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చినా పార్టీని వీడి పోవడం జగన్‌కు బాధ కలిగించిందనే వార్తలు వచ్చాయి. భూమా కుటుంబం ఎమ్మెల్యేలు ఇద్దరూ పార్టీ వీడటం వెనుక జగన్‌దేమీ తప్పు లేదు గానీ అవతలి వైపు నుంచి వచ్చిన ఒత్తిడులు అలాంటివనేది రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ అయింది. బహుశా ఇది దృష్టిలో ఉంచుకునే కావచ్చు జగన్‌ ఆ తరువాత నాగిరెడ్డి మృతికి సంతాపతీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టినపుడు హాజరు కాలేదు. అంత్యక్రియలకు కూడా దూరంగానే ఉన్నారు. దీనిపై విమర్శలొచ్చినా తానెందుకు రాలేదో జగన్‌ చెప్పాల్సింది చెప్పి మిన్నకుండి పోయారు. అసలు సంతాపతీర్మానంలో నాగిరెడ్డి ఏ పార్టీ వారనే విషయం కూడా ప్రస్తావించలేదని ఆరోజు జగన్‌ ఎత్తి చూపారు. ఇస్తానన్న మంత్రి పదవి ఏడాది దాటుతున్నా ఇవ్వలేదనే మనస్తాపంతోనే నాగిరెడ్డి మరణించారనే వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో ఇక లాభం లేదనుకుని చంద్రబాబు ఆ తరువాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో అఖిలప్రియకు స్థానం కల్పించారు.

నాగిరెడ్డి జీవించి ఉండగా తాను మంత్రిని కావాలని ఎంతగానో అభిలషించినా దక్కలేదు కానీ తన కుమార్తెకు ఆయన మరణానంతరం మంత్రి పదవి లభించింది. మంత్రి పదవి లభించాక అఖిలప్రియ శైలిలో వేగం పెరిగిందనేది నియోజకవర్గంలో అందరూ చెప్పుకుంటున్న మాట. తల్లి దండ్రులిద్దరినీ కోల్పోయింది కనుక ఆ సానుభూతి కొంతమేరకు ప్రజల్లో ఆమెపై ఉన్నా ప్రస్తుతం ఆమె తీరును చూస్తున్న వారు మాత్రం మంత్రి క్రమంగా ప్రజల్లో తనపై విముఖతను పెంపొందించుకుంటోందనే విమర్శలున్నాయి. అందరితోనూ కలుపుగోలుగా ఉండే నేతగా శోభకు పేరుండేది. ప్రస్తుతం అఖిలప్రియ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారట. నంద్యాల ఉప ఎన్నికల్లో తన సోదరుడు బ్రహ్మానందరెడ్డిని గెలుపించుకున్న విజయగర్వం ఛాయలు ఆమెను వీడలేదంటున్నారు. నియోజకవర్గంలో తన పక్షం కాని వారిపై ఓ కన్ను వేసి అచ్చంగా ముఠా రాజకీయాల తరహాలో వారి పనులు కాకుండా అడ్డుకుంటున్నారంటున్నారు. సంపాదన విషయంలో ఆమెపై ఎన్నో ఆరోపణలున్నా టీడీపీ ప్రభుత్వంలో అవేవీ అసహజం కాదు.

వచ్చే ఎన్నికల్లో మెండుగా ఖర్చు చేయాలంటే అది తప్పదనే సమర్థింపు కూడా టీడీపీ వర్గీయుల్లో ఉంది. భూమా వర్గం టీడీపీలో చేరిన ఫలితంగా వైఎస్సార్‌సీపీలో చేరిన గంగుల ప్రభాకర్‌ రెడ్డికి జగన్‌ ఆదిలోనే అనూహ్యమైన రీతిలో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. ఎంతో మంది పార్టీ సీనియర్లను కాదని జగన్‌, ప్రభాకర్‌రెడ్డికి ఈ పదవిని ఇవ్వడంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. భూమాను ఢీకొనేది గంగుల కుటుంబమేనన్న భావనలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు సమర్థించుకున్నారు. నిన్నటి నంద్యాల ఉప ఎన్నికల్లో గంగుల సోదరుడు ప్రతాప్‌ రెడ్డి టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ టికెట్‌ ఆళ్లగడ్డ నుంచి ప్రభాకర్‌ రెడ్డి కుమారుడైన గంగుల బ్రిజేంద్రా రెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన చురుగ్గా ప్రజల్లో తిరుగుతున్నారు. బ్రిజేంద్రా రెడ్డి (నాని) దూకుడుగా తిరుగుతూ ఉండటంతో ప్రతాప్‌ రెడ్డి కుటుంబీకులు (కుమారులు) కొంత అసూయకు లోనవుతున్నారని నియోజకవర్గం ప్రజల్లో బాగా ఉంది. ఆ కారణంగానే ప్రతాప్‌ రెడ్డి టీడీపీలో చేరారని అంటున్నారు. ఈ పరిణామం భూమా అఖిలప్రియకు గిట్టక పోయినా చంద్రబాబు తప్పదని ప్రతాపరెడ్డిని చేర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియ (ఆళ్లగడ్డ), బ్రహ్మానంద రెడ్డికి (నంద్యాల) అసెంబ్లీ టికెట్లు ఇస్తూ…. ప్రతాపరెడ్డిని నంద్యాల లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రతాప రెడ్డి, చంద్రబాబునాయుడు ఇద్దరూ ఒకే సమయంలో (1980-1982 వరకూ) అసెంబ్లీలో కాంగ్రెస్‌ తరపున ప్రాతినిధ్యం వహించినందున వారిద్దరి మధ్య పాత అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే ప్రతాప్‌కు లోక్‌సభ టికెట్‌ లభిస్తుందని అంటున్నారు. ఈ పరిణామం భూమా కుటుంబీకులకు ఎంత వరకు మింగుడు పడుతుందో ఇపుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. అదే జరిగితే ఆళ్లగడ్డలో గంగుల సోదరుని కుమారుడు బ్రిజేంద్రా రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అయితే మనస్పూర్తిగా ప్రతాప్‌ రెడ్డి సహకరిస్తారా అనేది కూడా చర్చగా ఉంది. అంతే కాదు, టీడీపీలో మరో వైపు ఏవీ సుబ్బారెడ్డి అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. భూమా నాగిరెడ్డికి అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉంటూ చివరి వరకూ ఆయనతో ఉండిన ఏవీ సుబ్బారెడ్డి తాను కూడా ఆళ్లగడ్డ లేదా నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నారు. ఈ రెండూ కానిపక్షంలో నంద్యాల లోక్‌సభ టికెట్‌ కావాలని అభిలషిస్తున్నారు. ప్రస్తుతం ఈయనకూ అఖిలప్రియకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే విధంగా ఉంది. నంద్యాల ఉప ఎన్నికలో వీరిద్దరూ ఎక్కడా కలిసి ప్రచారం చేయలేదు. ఎవరి కుంపటి వారిదేనన్నట్లుగా వ్యవహరించారు.

చంద్రబాబు స్థాయిలో జరిగిన అవగాహనతో ఏవీ టీడీపీ అభ్యర్థికి మద్దతు పలికారు. నాగిరెడ్డికి సన్నిహితుడు కనుక అప్పట్లో ఆయన ఏవీ పేరు మీద చాలా ఆస్తులు ఉంచారట. అంటే ఏవీ చాలా కాలంగా భూమా నాగిరెడ్డికి బినామీగా ఉంటూ వస్తున్నారట. తన తండ్రి ఏవీ పేరిట పెట్టిన ఆస్తులన్నీ తమకు ఇచ్చేయాలని ఏవీపై ఒత్తిడి తెస్తున్నారని నియోజకవర్గంలో విస్తృతంగా చెప్పుకుంటున్నారు. ఆ కారణం వల్లనే వీరిద్దరి మధ్య అంత సఖ్యత లేదు. ఈ వివాదం ఇలాగే కొనసాగినా, ఏవీకి టీడీపీ నుంచి పదవి లభించక పోయినా పరిస్థితులు అంచనా వేయడం కష్టమని, టీడీపీ విజయావకాశాలపై ఆ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే గంగుల నానికి తన పెద్దనాన్న, ఆయన కుమారుల నుంచి సహకారం లభించకపోయినా పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవని అంటున్నారు. అయితే ఇప్పటికే నాని నియోజకవర్గంలో చొరవగల నాయకుడుగా పేరు సంపాదించుకున్నారు. గంగుల కుటుంబీకులు ప్రజలకు అందుబాటులో ఉండరనే గత కాలపు అభిప్రాయాన్ని తుడిచి పెట్టే విధంగా పని చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికే భూమా కుటుంబం పూర్తిగానూ…. గంగుల కుటుంబం సగం వరకూ చంద్రబాబు చేతిలోనే ఉంది కనుక ఆ కోణంలో చూస్తే టీడీపీకి అనుకూలత ఉండొచ్చు…. కానీ ముఖ్యమంత్రి భావించినట్లుగానే ప్రజలు కూడా ఉంటారా? లేక స్వతంత్రంగా ఆలోచించి వర్గాల వారీగా కాకుండా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆయన (చంద్రబాబు) ఊహలు తారుమారు అవుతాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.

NEWS UPDATES

CINEMA UPDATES