జమ్మలమడుగు ఫ్యాక్షన్‌ గడ్డపై బరిలో నిలిచేదెవరు?

12011

వేట కొడవళ్లూ…. నాటుబాంబుల స్వైర విహారం…. తలలు తెగి పడిపోయిన మొండేలు…. ఛిద్రమైన మానవ శరీరాలు…. ఇదీ జమ్మలమడుగు ఫ్యాక్షన్‌ ముఠాల రక్త చరిత్ర. కక్షలూ కార్పణ్యాలతో దశాబ్దాలుగా తల్లడిల్లిన ఇక్కడి ప్రజానీకం ఈ మధ్య కాలం నుంచే శాంతి పవనాలను పీల్చుకుంటోంది. స్వాంతంత్ర్యం సిద్ధించక ముందు నుంచే దాడులు, హత్యలకు పేరు మోసిన జమ్మలమడుగు పల్లెల్లో ఎక్కువగా నల్లరేగడి భూములే. ఈ నేల, ఈ నీరు ఫ్యాక్షనిజాన్ని పుణికి పుచ్చుకుందా…! అన్న తీరులో, హత్యలు జరుగని గ్రామం ఈ నియోజకవర్గంలో లేనే లేదంటే అతిశయోక్తి కాదేమో! స్వాతంత్ర్యం సిద్ధించక ముందు నుంచే ఈ ప్రాంతంలోని పెత్తందార్లు, రెండేసి, మూడేసి వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని అంతం చేసుకునే రోజులు నడిచాయి. బాంబుల శివారెడ్డిగా పేరుమోసిన ఒకప్పటి మాజీ మంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డి, కమ్యూనిస్టు నేతలుగా ఉంటూ ఆ తరువాత పెట్టుబడిదారీ పార్టీల రాజకీయాలను ఒంటికి పులుముకున్న దేవగుడి శంకర్‌ రెడ్డి దారుణ హత్యల తరువాత ఇక్కడ శాంతియుత వాతావరణం నెలకొనడం ప్రారంభం అయింది.

ఈ హేమాహేమీల హత్యలకు ముందు వెనుక వందలాది మంది అర్భకులు తమ ప్రత్యర్థుల చేతిలో హతమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని, విడిపోయిన రాష్ట్రంలో గాని ఫ్యాక్షనిజం పరాకాష్టకు చేరుకున్న నియోజకవర్గం ఇంతకంటే మరొకటి లేనే లేదని ఘంటా పథంగా చెప్పాలి. ఒకప్పుడు దారుణమైన హింసా రాజకీయాలకు ఆలవాలమైన ఈ ప్రాంతంలో ఇపుడు రాజకీయ అవకాశవాదం బాగా పెరిగిపోయింది.

ప్రస్తుత మంత్రి చదిపిరాళ్ల (దేవగుడి) ఆదినారాయణ రెడ్డి ఫిరాయింపే అందుకు నిదర్శనంగా పేర్కొనాలి. ఇప్పటికి ఈ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఆయన నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందనే వ్యాఖ్యలు ప్రస్తుతం నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. 2004లో తొలిసారి అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయ్యారు. 2009లో కూడా వైఎస్‌ ఆశీస్సులతోనే గెలుపొందారు. 2009-14 మధ్య కాలంలో కొంతకాలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఉండి ఆ తరువాత కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డికి మద్దతు పలికారు. చివరి వరకూ అక్కడే ఉండిన ఆదినారాయణ రెడ్డి సరిగ్గా 2014 ఎన్నికల సందర్భంగా జగన్‌ పార్టీలోకి వచ్చి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అయితే ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోవడం జగన్‌ను బాగా నిరాశ పరిచింది. జగన్‌ కన్నా ఎక్కువగా ఆ పార్టీలో నిరాశ చెందిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారూ… అంటే అది ఆది మాత్రమే. తొలి నుంచీ అధికారం చెలాయించడానికి రుచి మరిగిన ఆదికి ఇది మింగుడు పడని పరిణామం. పార్టీ ఓటమికి కారణం జగన్‌ అంటూ బాహాటంగా నిందిస్తూ ఆయన తెలుగుదేశం దరి చేరడానికి ఆ మరుక్షణం నుంచే పావులు కదపడం ప్రారంభించారు. గెలుపొందింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగానే అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు కరుణ కోసం తాపత్రయపడుతూ వచ్చారు. ఈ లోపుగా ఆయన వియ్యంకుడు, కేశవరెడ్డి (స్కూళ్ల వ్యవస్థాపకుడు) విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఎగ్గొట్టి, వివాదంలో ఇరుక్కున్నారు. కేశవరెడ్డి కుమారుడు స్వయానా ఆది కుమార్తె భర్త కనుక తన వియ్యంకుడిని బయట పడేయాలనుకుంటే టీడీపీలోకి ఎలాగైనా చేరాలని కృతనిశ్చయంతో ప్రయత్నించి సఫలం అయ్యారు. ఆ విధంగా ఆది వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన తొలి ఎమ్మెల్యేగా గణుతికెక్కారు. ఆ తరువాత కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ కుటుంబానికి చెందిన వైఎస్‌ వివేకానందరెడ్డిని ఓడించి తీరుతామని ప్రతిన బూనిన ఆది తన పంతాన్ని నెగ్గించుకున్నారు. దేశం సమకూర్చిన నిధులతో వైఎస్‌ సోదరుడిని ఓడించడంలో ఆది కీలక పాత్ర పోషించారు. ఆ దరిమిలా చంద్రబాబు కన్నా మంత్రి లోకేష్‌కు ఆదినారాయణ అత్యంత ప్రీతిపాత్రుడయ్యారు. ఆ గురితోనే ఆదికి దెబ్బకు మంత్రి పదవి వరించింది.

ఆదికి మంత్రి పదవి ఇవ్వడం వెనుక కడప జిల్లాలో వైఎస్‌ కుటుంబీకులను మట్టి కరిపించాలనే లోపాయికారీ వ్యూహం తెలుగుదేశంకు ఉందని చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీలో గెలిచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన ఆదికి మంత్రి పదవి రావడం ఓ రకంగా అనూహ్యమైన పరిణామమే. ఈ విషయంలో ఆయన ప్రత్యర్థి పి. రామసుబ్బారెడ్డి మోకాలడ్డినా ప్రయోజనం లేకుండా పోయింది. రామసుబ్బారెడ్డి రాజకీయ సామర్థ్యంపై అట్టే నమ్మకం లేని దేశం పెద్దలు ఆది పక్షమే వహించారు. మంత్రి అయిన తరువాత ఇక ఆదికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అనుకోకుండా వచ్చిన నంద్యాల ఎన్నికల్లో ఆయన పోషించిన పాత్ర కూడా దేశం అధిష్టాన వర్గానికి మరింత దగ్గర చేసింది. ఇపుడు కడప జిల్లాలో తెలుగుదేశంలోని ఇతర నాయకులకు గిట్టకపోయినా మంత్రి చెప్పిందే వేదంగా చెలామణి అవుతోంది.

జమ్మలమడుగు నియోజకవర్గంలో గుండ్లకుంట (పొన్నపురెడ్డి)శివారెడ్డి, దేవగుడి (చదిపిరాళ్ల) కుటుంబాల మధ్య మూడు దశాబ్దాలుగా ఫ్యాక్షన్‌ వైరం సాగుతోంది. వీరి మధ్య వైరంలో ఎందరో సామాన్యులు సమిధలు అయ్యారు. ఈ క్రమంలో ఈ ఉభయకుటుంబాల అగ్రనేతలు హతమైన తరువాత గానీ శాతి నెలకొనడం సాధ్యం కాలేదు. తొలుత గుండ్లకుంట శివారెడ్డి, దేవగుడి శంకర్‌రెడ్డికి మధ్య మిత్రత్వమే ఉండేది. రాజకీయాల్లో శివారెడ్డి (టీడీపీ) నాయకత్వాన్ని శంకర్‌రెడ్డి ఒక దశ వరకూ బలపర్చే వారు. కాల క్రమేణా వీరి మధ్య విభేదాలు పొడ చూపినప్పటికీ అవి రాజకీయాలకే పరిమితమవుతాయి తప్ప ఒకరినొకరు హతం చేసుకునేంతగా ఉండబోవని శంకర్‌రెడ్డి ఏమరుపాటుకు లోనయ్యారు. అయితే శత్రువు చిన్నవాడైనా సరే ఉండటానికి వీల్లేదనే కరుడుగట్టిన ఆలోచనలతో ఉండే శివారెడ్డి తనతో విభేదించి దూరంగా ఉంటూ వచ్చిన శంకర్‌ రెడ్డి, ఆయన స్నేహితుడు అప్పటి మైలవరం మండలాధ్యక్షుడు భీమగుండం గోపాలరెడ్డిని షాద్‌నగర్‌ బస్టాండ్‌లో వారిద్దరూ హైదరాబాద్‌ నుంచి బస్సులో తిరిగి వస్తూ ఉండగా శివారెడ్డి తన అనుచరుల చేత వేటకొడవళ్లతో నరికి చంపించారు. ఆ తరువాత వారి కుటుంబాల మధ్య పగలు పరాకాష్టకు చేరుకున్నాయి.

శంకర్‌రెడ్డి తమ్ముని కుమారుడైన ప్రస్తుత మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి అనివార్యంగా ఫ్యాక్షన్‌ రాజకీయాలను భుజాన వేసుకోవాల్సి వచ్చింది. తమ కుటుంబ పెద్దను హతం చేసిన శివారెడ్డిని హతం చేయాలని దేవగుడి కుటుంబీకులు కృత నిశ్చయానికి వచ్చారు. తనకు వీరితో ఎప్పటికైనా ప్రమాదమేనని గ్రహించిన శివారెడ్డి కూడా దేవగుడి సోదరులను కూడా హతం చేయాలని భావిస్తూ వచ్చారు. పరస్పరం లక్ష్యంగా దాడులు చేసుకున్నా ఎవరి లక్ష్యమూ నెరవేరలేదు. ఈ దాగుడు మూతల పర్వంలో సంచలనాత్మకమైన రీతిలో 1992లో హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో సత్యసాయి నిగమాగమంలో శివారెడ్డిపై నాటుబాంబులతో దాడి చేసి దేవగుడి వర్గీయులు అతి కిరాతకంగా అంతమొందించారు. ఆ తరువాత శివారెడ్డి పెద్ద కుమారుడు దేవగుడి సోదరులను అంతమొందించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించక పోగా అదే ప్రయత్నంలో అసాధారణమైన రీతిలో నారాయణరెడ్డి వాహనాన్ని ముద్దనూరు ఘాట్‌పై వెంటాడుతూ తన వాహనం లోయలోకి తిరగబడి పోవడంతో అక్కడికక్కడే మరణించారు. ఆ తరువాత శివారెడ్డి ఇంట్లో ఫ్యాక్షన్‌కు నాయకత్వం వహించేంత సమర్థ నాయకుడు లేకుండా పోయారు. అందువల్లనే ఆ తరువాత 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో శివారెడ్డి అన్నకుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి దేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ 1999లో కూడా అదే పార్టీ గుర్తుపై గెలుపొంది మంత్రి కూడా అయ్యారు. ఆ తరువాత రామసుబ్బారెడ్డి ఇప్పటికీ వరుసగా ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓటమిపాలవుతూ ఓటమిలో హ్యాట్రిక్‌ను సాధించారు.

2019లో జరుగనున్న ఎన్నికల్లో దేశం అభ్యర్థిగా ఎవరుండబోతున్నారనేది ప్రస్తుతం చర్చగా ఉంది. అధికార పార్టీలో చేరి మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డికి టీడీపీ టికెట్‌ లభించడం ఖాయమనే ప్రచారం ఉంది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా తాను పోటీ చేస్తానని, టికెట్‌ తనకే వస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే అదంత సులభం కాదనే చర్చ జమ్మలమడుగు ప్రజల్లో జరుగుతోంది. ఆదినారాయణ రెడ్డికి సహజంగా తెగువ, వైఎస్‌ కుటుంబాన్ని ఎదిరించే ధైర్యం ఉంది కనుక ఆయన్ను కడప లోక్‌సభా నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారని అంటున్నారు.

జమ్మలమడుగులోని అన్ని గ్రామాలూ వర్గాల వారీగా విభజితమై ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో దేవగుడి కుటుంబానికి పూర్తి పట్టు ఉంటే అదే విధంగా గుండ్లకుంట కుటుంబానికి మరికొన్ని గ్రామాల్లో పూర్తి పట్టు ఉంది. వర్గ ప్రాబల్యం ఎక్కువగా గల ఈ నియోజకవర్గంలో ఈ రెండు వర్గాలూ తమతోనే ఎన్నికల నాటికీ ఉంటాయి కనుక ఇక గెలుపు తమదేనని తెలుగుదేశం ప్రగాఢంగా విశ్వసిస్తోంది. ఆదినారాయణ రెడ్డి కనుక లోక్‌సభకు పోటీ చేయడానికి ఇష్టపడకపోతే జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌ను ఆయనకే కేటాయించి రామసుబ్బారెడ్డిని బుజ్జగిస్తారని తెలుస్తోంది. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఇటీవలనే కనుక ఎన్నికల నాటికి ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉంటుంది. దానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేకు పోటీ చేయడం కన్నా ఎమ్మెల్సీగా కొనసాగడమే మంచిది కదా అని చంద్రబాబు బుజ్జగిస్తారని చెప్పుకుంటున్నారు. రామసుబ్బారెడ్డి కనుక అంతటితో సంతృప్తి చెందితే ఆదినారాయణ రెడ్డి అలవోకగా ఎమ్మెల్యేగా గెలుపొందుతారని టీడీపీ అధిష్టానవర్గం అంచనా వేస్తోంది. రామసుబ్బారెడ్డి ఎదురు తిరిగి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరి అభ్యర్థి అవుతారా? అనే అనుమానాలు కూడా ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా డాక్టర్‌ ఎం. సుధీర్‌రెడ్డి నియుక్తులై ఉన్నారు. కొంత కాలం క్రితం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను వీడిన ఈ జిల్లా సీనియర్‌ రాజకీయవేత్త ఎం.వీ.మైసూరారెడ్డికి సుధీర్‌రెడ్డి స్వయానా తమ్ముని కుమారుడు. అయితే ఈ రెండు కుటుంబాలకు పొసగదు. తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి బయటకు రావడానికి ఒక కారణం జగన్‌ తనకు చెప్పకుండా తన తమ్ముని కుమారుడిని జమ్మలమడుగు కోఆర్డినేటర్‌గా నియమించడమే అని అప్పట్లో అంతరంగికుల వద్ద ఆయన చెప్పుకున్నారు.

సుధీర్‌ రెడ్డికి ఉన్న బలం పరిమితం. ఆయనకు యర్రగుంట్ల, ముద్దనూరు మండలాల్లో పాక్షికంగా గట్టి పట్టు ఉంది. కొండకు ఇవతల ఉన్న మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు, కొండాపురం మండలాలకు సుధీర్‌ కొత్తవాడు. ఆయన తొలుత జమ్మలమడుగు మండలంలో దేవగుడి, పొన్నపురెడ్డి కుటుంబాలకు ఎదురొడ్డి నిలబడగలుగుతారా? అనేది అనుమానాస్పదంగా ఉంది. సుధీర్‌ వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్‌గా క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్నపుడు ఒక పెళ్లిలో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎదురు పడ్డారట. మర్యాదపూర్వకంగా సుధీర్‌ మంత్రికి నమస్కారం చేయగానే మంత్రి తేలిగ్గా తీసుకుని ‘రాజకీయాలంటే సూదులు పొడుచుకునేంత తేలిక కాదు డాక్టర్‌….’ అని అన్నారట. దాంతో రెచ్చిపోయిన సుధీర్‌ ‘సరేలే…. నువ్వు చేసేవే రాజకీయాలు అనుకుంటున్నావా…. ఒక పార్టీలో గెలుపొంది మరో పార్టీలోకి నీలాగా పోవడం రాజకీయాలా…?’ అని తీవ్రస్థాయిలో బదులిచ్చారట. అక్కడున్న వారు జోక్యం చేసుకుని ఇద్దరినీ తగ్గించేందుకు ప్రయత్నించారు. పొన్నపురెడ్డి, దేవగుడి కుటుంబాలు రెండూ ఒక్కటైనా ప్రజాబలంతో నేను ఎదిరిస్తానని సుధీర్‌ ధీమాగా ఉన్నారు. అందుకే ఆదినారాయణరెడ్డి మాట్లాడే ప్రతి మాటకూ ఎదురు బదులిస్తూ బహిరంగ సభల్లో ఆయనకు సుధీర్‌ ప్రతి సవాళ్లు విసురుతూ ముందుకు వెళుతున్నారు. అయితే సుధీర్‌కు ఆవేశం పాళ్లు ఎక్కువ గనుక అందరినీ కలుపుకొని పోయే తత్వం లేదంటున్నారు.

నియోజకవర్గంలోని మైనారిటీలలో మంచి పట్టు ఉన్న హిమ్మత్‌ కంపెనీతో సుధీర్‌ జగడం పెట్టుకున్నారు. అలాగే నేరుగా జగన్‌తో సంబంధాలున్న పలువురు నియోజకవర్గ కార్యకర్తలతో సుధీర్‌కు వైరం ఉంది. తమకు జగన్‌ అంటే అభిమానం ఉంది కానీ, సుధీర్‌ ప్రవర్తన తమకు నచ్చడం లేదని అంటున్నారు. పైగా సుధీర్‌కు ఆదితో పోలిస్తే అంతగా నిధులు లేవు. నంద్యాల ఉప ఎన్నికల్లో అన్ని తంత్రాలు ఉపయోగించి విజయం సాధించిన ధీమాతో ఆది ఈ దఫా జమ్మలమడుగులో నంద్యాల వ్యూహాన్నే అమలు చేస్తానని బాహాటంగానే చెబుతున్నారు. డబ్బు విషయంలో ఎంతకైనా వెనుదీయని ఆది తన మనుషులను జాగ్రత్త చేసుకునే కంటే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, నేతలను కొనేస్తాననే అభిప్రాయంతో ఉన్నట్లు భోగట్టా. ఆది ఇప్పటికి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారంటే…. అందుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఆ నియోజకవర్గం ఓటర్లకు గల ఆదరాభిమానాలు కూడా కారణం.

2009-14 మధ్య కాలంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి పక్షాన ఉన్నప్పటికి చివరి నిమిషంలో వచ్చిన ఆదికే మనసు మార్చుకుని జగన్‌ టికెట్‌ ఇచ్చారు. కొద్ది రోజులకే చంద్రబాబుకు జై అన్న విషయాన్ని జనం గమనిస్తూనే ఉన్నారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనం డబ్బు ప్రభావానికి లోనవుతారా అనేది కాలమే నిర్ణయించాలి. వైసీపీలో మహిళానేత అల్లె ప్రభావతి కూడా టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. గతంలో మండలాధ్యక్షురాలిగా పని చేసి వైఎస్‌ అభిమానిగా ఉంటూ వచ్చిన ప్రభావతి వద్ద భారీగా నగదు లేదు గానీ ఆమెకు బాగా విలువ చేసే ఆస్తులున్నాయని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. జగన్‌ కనుక తనకు టికెట్‌ ఇస్తానంటే తనకున్న స్థలాలను అమ్మి నిధులు సమకూర్చుకుంటానని, దేవగుడి సోదరులను, రామసుబ్బారెడ్డి వర్గాన్ని ఎదుర్కొంటానని ప్రభావతి చెబుతున్నారు. వైసీపీ తరపున టికెట్‌ ఆశిస్తున్న ఇద్దరు నేతలూ ఆ ఫ్యాక్షన్‌ గడ్డపై ధైర్య సాహసాలు గల వారే! కానీ వారికి ఇతరత్రా సమస్యలే ఉన్నాయి. వీరిద్దరిలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా మరొకరు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండవని చెబుతున్నారు. జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డిని కనుక ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపితే విజయం నల్లేరుపై నడకలాగా ఉంటుందని అంచనాగా ఉంది. జగన్‌ ఈ విషయంపై ఏవిధంగా ఆలోచిస్తారు? ఇంతకాలం సుధీర్‌తో పని చేయించుకుని చివరి నిమిషంలో వివేకాను దించితే మనస్ఫూర్తిగా సుధీర్‌ పని చేస్తారా? నియోజకవర్గంలోని ఇతర నేతలు ఏ స్థాయిలో స్పందిస్తారు? అసలు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ప్రస్తుత మంత్రి ఆదినారాయణ రెడ్డిలను టీడీపీ అధిష్టానం కలిపినా కింది స్థాయిలో ప్రతి ఊళ్లో గ్రామకక్షలతో ఉన్న నేతలు కలిసి పని చేయడానికి ఇష్టపడతారా? ఇది అనుకున్నంత సులువా? లేక ఆది వద్ద ఉన్న కాసుల గలగలలతో రామసుబ్బారెడ్డి వర్గాన్ని కూడా కొనేస్తారా? అనే ప్రశ్నలకు ఎన్నికల్లోనే సమాధానం లభించాలి.

తన తండ్రి, పెద్ద తండ్రి హత్యలకు గురైన తరువాత అనివార్యంగా ఫ్యాక్షన్‌ రాజకీయాలకు సారథ్యం వహించిన మంత్రి ఆది సోదరుడు దేవగుడి నారాయణరెడ్డి టీడీపీలో చేరినప్పటికీ ఆయన వైఎస్‌కు వీరాభిమాని. వైఎస్‌తో ఆయనకున్న అనుబంధం అలాంటిది. తన తమ్ముడు చేసింది తప్పని తొలుత వాదించి తీరా మంత్రి పదవి వచ్చిన తరువాత మౌనం దాల్చారు. ఎమ్మెల్సీగా ఉంటూ టీడీపీలో చేరినా ఆయనకు పార్టీలో కనీస గౌరవం లభించలేదని చెప్పుకుంటున్నారు. ఎన్నికలపుడు ఆయనేం చేస్తారనేది కూడా తేలకుండా ఉంది. ఇప్పటి వరకూ అన్నదమ్ములిద్దరూ ఫ్యాక్షన్‌ రాజకీయాల్లో కలిసే పనిచేశారు. నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి కన్నా మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డికే ప్రజలతో సత్సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. నారాయణ రెడ్డికి అందరిలో పిలిస్తే పలికే వ్యక్తిగా పేరుంది. ఆది హైదరాబాద్‌లో మకాం వేసి ‘వేరే పని’లో మునిగి తేలుతున్నపుడు నియోజకవర్గంలో నారాయణ రెడ్డి క్రియాశీలంగా ఆయన తరపున విధులు నిర్వహించే వారు. వాస్తవానికి నారాయణ రెడ్డి 2004 ఎన్నికల్లో తనకు వచ్చిన టికెట్‌ను తన వద్ద నిధులు లేని కారణంగా తన తమ్మునికి త్యాగం చేశారు. ఇది ఇప్పటికీ ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. అసలు నారాయణ రెడ్డిని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని చేస్తే సోదరుడిని చిత్తు చేస్తారనే ప్రచారం ఉన్నా…. జగన్‌ మాత్రం అన్న ఒక పక్క, తమ్ముడు మరో పక్క ఉండటం సరికాదని నారాయణ రెడ్డిని వైఎస్సార్‌సీపీలోనే ఉంచుకుందామనే ప్రయత్నం చేయలేదు. జగన్‌ కనుక నారాయణ రెడ్డిని నిలుపుకుని ఉండి ఉంటే ఈరోజు జమ్మలమడుగులో ఆయన పార్టీ అభ్యర్థి ఎవరనే విషయంలో అంత సందిగ్థత ఉండేది కాదంటున్నారు. కానీ నారాయణరెడ్డికి పుష్కలంగా నిధులు లేకపోవడంతో అది సాధ్యం కాలేదు. ఈ రోజు నెలకొన్న పరిస్థితి ప్రకారం మంత్రి ఆదినారాయణరెడ్డి అర్ధబలం, అధికారం ముందు నిలబడే దెవ్వరు? అనే దానికి సమాధానం కొంత కాలం పాటు శేష ప్రశ్నగా ఉంటుందని చెప్పక తప్పదు.

NEWS UPDATES

CINEMA UPDATES