వచ్చాడు…. గెలిచాడు….. మసిపూసి పోయాడు

8872

పొలిటికల్‌ రౌండప్‌

తెలుగు రాష్ట్రాలకు మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార, ప్రతిపక్షాలు ఇప్పుడే ఎన్నికలకు సిద్ధమైపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఏఏ నియోజక వర్గాలలో పరిస్థితి ఎలా ఉంది? వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ అభ్యర్ధి ఇక్కడనుంచి విజయం సాధించే అవకాశం ఉంది? ఆయా నియోజక వర్గాలనుంచి ఏఏ అభ్యర్ధులు ఎన్నికల్లో తలపడే వీలుంది? ఆయా పార్టీల తరపున టిక్కెట్లు ఆశిస్తున్న కొత్త అభ్యర్ధులు ఎవరు? ఏ పార్టీ తరపున ఎవరు అభ్యర్ధిగా ఉంటే గెలుపు అవకాశాలు ఎక్కువ…. ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయా నియోజక వర్గాల విశ్లేషణను మా తెలుగుగ్లోబల్‌.కామ్‌ వ్యూయర్స్‌కు అందజేయాలని సంకల్పించాం. వారానికి రెండు మూడు నియోజకవర్గాల సమాచారాన్ని  ధారావాహికగా అందజేస్తాం.

– ఎడిటర్‌

***

అనంతపురం జిల్లాలో కదిరి ఓ కీలక అసెంబ్లీ నియోజకవర్గం. 2014 ఎన్నికల్లో జిల్లా అంతటా తెలుగుదేశం ప్రభంజనం వీస్తే ఇక్కడ మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అత్తారు చాంద్‌ బాషా సుమారు వెయ్యి ఓట్ల తేడాతో విజయం సాధించారు. తక్కువ మెజారిటీతోనైనా ఆయన గట్టెక్కడానికి ప్రధాన కారణం ముస్లింలంతా గుండు గుత్తగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికి మద్దతు నివ్వడమే.

ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న ఈ నియోజకవర్గం అభ్యర్థిగా బాషాను జగన్‌ చివరి నిమిషంలో ఖరారు చేశారు. అప్పటి వరకూ వైఎస్సార్‌సీపీలో పని చేస్తున్న వారిని కాదని, టీడీపీ నుంచి చివరి నిమిషంలో వచ్చిన బాషాకు టికెట్‌ ఇవ్వడం వెనుక జగన్‌ మేనమామ పి. రవీంద్రనాథ్‌ రెడ్డి ప్రోద్బలం ఉంది. బాషా డబ్బు బాగా ఖర్చు చేయగలడనే ఏకైక కారణంతో రవి సిఫార్సు మేరకు జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారంటారు. అప్పట్లో రవికి కూడా బాగా లబ్ది చేకూరిందని చెవులు కొరుక్కున్నారు. ఏమైనా ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే చాంద్‌ రెండేళ్ల తరువాత తన సొంత గూటికి (టీడీపీ) తిరిగి చేరుకున్నారు.

2014 ఎన్నికల సందర్భంగా బాగా డబ్బు ఖర్చు చేసినందున తాను అర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చాంద్‌ చెప్పుకుంటున్న తరుణంలో రాష్ట్ర మంత్రి వర్గంలో బీజేపీ కోటాలో మంత్రిగా కొనసాగుతున్న కామినేని శ్రీనివాస్‌ ఆయనకు గాలం వేసి చంద్రబాబు పార్టీలో చేర్పించారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి మైనారిటీల పట్ల ఆయన చూపుతున్న ఆదరణకు ముగ్ధుడనై టీడీపీలో చేరుతున్నానని, అయినా అది తనకు జన్మనిచ్చిన పార్టీ కనుక సొంత ఇంటికి వెళ్లినట్లుగా ఉందని చాంద్‌ బాషా తన చేరికను సమర్థించుకున్నారు. తెలుగుదేశంలో చేరాక తమ ఎమ్మెల్యేకు బాగానే గిట్టుబాటు అయిందని కదిరిలో చెప్పుకుంటున్నారు. రాష్ట్రాభివృద్ధి మాట దేవుడెరుగు…. కానీ, చాంద్‌ బాషా మాత్రం ఇపుడు పసుపు పచ్చదనంతో నిత్యం కళకళలాడుతున్నారని ఆయన సన్నిహితులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు . అయితే ఆయన చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలైన కందికుంట వెంకటప్రసాద్‌, తెలుగుదేశంలోకి బాషా రాకను తీవ్రంగా ప్రతిఘటించారు. వారిద్దరికీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ నియోజకవర్గంలో ఉప్పూ-నిప్పూలాగా ఉండేది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ ఇద్దరూ జోక్యం చేసుకుని కందికుంటకు నచ్చ జెప్పి, జగన్‌ను దెబ్బతీయాలంటే ఇలాంటి ఫిరాయింపులు తప్పవని బాషాను పార్టీలోకి తీసుకున్నారు. ఆ తరువాత కందికుంట సహజంగానే తోక ముడిచారు.

ఓ పార్టీ తరపున ఎన్నికైన తమ ఎమ్మెల్యే మరో పార్టీలోకి ఎందుకెళ్లారో తెలియనంత అమాయకులైతే కదిరి ప్రజలు కాదు. అందువల్ల ఈ దఫా చాంద్‌బాషాకు ఒక వేళ టిడీపీ టికెట్‌ లభిస్తే గెలిపిస్తారా? లేదా? అనే అంశం చర్చనీయాంశంగా ఉంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండేళ్లలో ఎమ్మెల్యే పట్ల నియోజకవర్గంలో కొంత సానుభూతి ఉండేది. నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయినా ప్రతిపక్షంలో ఉండి పోరాడుతున్నాడనే భావన ఉండేది. ఇప్పటికి తెలుగుదేశంలో చేరి ఏడాదికి పైగా కావస్తున్నా…. కదిరి నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేసిన దాఖలాలు గానీ, లేదా రాష్ట్రం ప్రగతి పథం వైపు పరుగెత్తిన ఉదంతాలు గానీ ప్రజలకేమీ కనుపించలేదు.

పైగా ప్రత్యర్థులైన కందికుంటకు, అత్తారుకు సఖ్యత కూడా సాధ్యపడలేదు. ఇక్కడ గ్రూపు తగాదాలతో దేశం అధిష్టానవర్గానికి నిత్యం తలనొప్పిగా మారింది. వీరిద్దరి గొడవ ఇలా ఉంటే దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో ఒకప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన బత్తల వెంకటరమణ ప్రస్తుతం తెలుగుదేశంలో చేరి మరో కుంపటి పెట్టుకున్నారు. వడ్డెర కులానికి చెందిన బత్తల వెంకటరమణకు నియోజకవర్గంలో ఓ మోస్తరు పలుకుబడి ఉంది. గతంలో ఓసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలై ఉన్నారు. వచ్చే (2019) ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్‌ కోసం పోటీ అనివార్యంగా కందికుంట వెంకటప్రసాద్‌ లేదా ఆయన భార్య, అత్తారు చాంద్‌బాష, బత్తల వెంకటరమణ మధ్య ఉండబోతుందని అంచనాలు వేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చాను కనుక తనకు టికెట్‌ గ్యారంటీ ఉందని, అంతే కాక ఎన్నికల ఖర్చు మొత్తం తామే భరిస్తామని లోకేష్‌, చంద్రబాబు నుంచి తనకు గట్టి హామీ ఉందని చాంద్‌ చెప్పుకుంటున్నారు.

పైగా ఆర్థికలావాదేవీల వ్యవహారంలో కందికుంటకు న్యాయస్థానం శిక్ష వేసింది కనుక చంద్రబాబు ఆయనకు టికెట్‌ ససేమిరా ఇవ్వరంటున్నారు. కానీ కందికుంట వెంకట ప్రసాద్‌ కథనం వేరుగా ఉంది. తనకు టికెట్‌ ఇవ్వక పోయినా తన భార్యకు టికెట్‌ తెచ్చుకుంటాననే ధీమాతో ఆయన ఉన్నారట. ఇక డబ్బుకు వెనుకాడే స్వభావం ప్రసాద్‌ది కానే కాదు. కనుక ఎంతైనా ఖర్చు చేస్తారని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. పైగా ఆయనకు అన్ని వర్గాల్లో గట్టి అనుచరవర్గం ఉంది కనుక ఎన్నికల నాటికి ప్రసాద్‌కు గాని, ఆయన సతీమణికి గాని టికెట్‌ లభిస్తే ఆశ్చర్య పోనక్కరలేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక, అత్తారు, కందికుంటల మధ్య విభేదాల నడుమ దేశం టికెట్‌ తనకే లభించవచ్చనే ఆశతో బత్తల ఉన్నట్లుగా భావిస్తున్నారు.

వైసీపీ విషయానికి వస్తే డాక్టర్‌ సిద్ధారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా సుమారు ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజల్లో మంచి వైద్యునిగా పేరున్న సిద్ధారెడ్డిని అనివార్య పరిస్థితుల్లో జగన్‌ ఎంపిక చేశారని చెబుతున్నారు. కదిరి నుంచి ముస్లిం మైనారిటీలు గతంలో గెలుపొందిన ఉదంతాలు ఉన్నందు వల్ల, అక్కడ ఉన్న ముస్లిం ఓటర్ల సంఖ్యను బట్టి జగన్‌ తొలినుంచీ ఈ సీటును ముస్లింలకే కేటాయించడానికి మొగ్గు చూపారు. అందుకే 2014లో చాంద్‌బాషకు ఉన్న ఆర్థిక బలం కారణంగా టికెట్‌ను ఆయనకు ఖరారు చేశారు. అయితే ఎన్నికైన రెండేళ్ల తరువాత తనకు చెయ్యిచ్చి వెళ్లిపోవడంతో జగన్‌ కలత చెందారు. నియోజకవర్గంలో ముస్లిం వర్గాల్లో ఆర్థిక పరమైన సత్తా కలిగిన మరో ముస్లిం అభ్యర్థి ఆయన అన్వేషణలో కనుపించక పోవడంతో తప్పని పరిస్థితుల్లో సిద్ధారెడ్డిని అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

వైసీపీ అభ్యర్థి సిద్ధారెడ్డేనన్నది ఖరారైంది కనుక తెలుగుదేశం నుంచి కందికుంట లేదా అత్తారు లేదా బత్తల…. వీరిలో ఎవరు రంగంలో ఉంటారనేది ఇంకా స్పష్టత రాలేదు. కందికుంటకు గాని, ఆయన సతీమణికి గాని టికెట్‌ లభించని పక్షంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉండటం ఖాయమని కదిరిలో వినిపిస్తోంది. అత్యంత వెనుకబడిన ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షం మళ్ళీ తన స్థానం నిలబెట్టుకుంటుందా? అనేది వేచి చూడాలి.

వైసీపీని ఎందుకు వీడానంటే…!

పార్టీ ఫిరాయించిన అత్తారు చాంద్‌బాషను ముస్లిం పెద్దలు నిలదీశారు. అసలు తాను టీడీపీలోకి ఎందుకు వెళ్లానంటే…. అని అప్పట్లో ముస్లిం పెద్దల వద్ద, ఇతర ప్రముఖుల వద్ద ఆయన ఒక వాదనను వినిపించారు.
2014 ఎన్నికల ముందు వరకూ టీడీపీలో ఉండిన తనకు అప్పటి దాకా వైసీపీలో ఉండిన కొందరు ముస్లిం నేతలను కాదని ఉన్న ఫళంగా జగన్‌ టికెట్‌ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనా పార్టీ ప్రతిపక్షంలో ఉంది కనుక తైలం ఆరి పోయిందని బాష వాపోతూ వచ్చారు. తాను మళ్లీ పోటీచేసి గెలుపొందడానికి అవసరమైనన్ని నిధులు లేవు, ఎన్నికల నాటికి తనకు డబ్బుల్లేవని టికెట్‌ ఎగనామం పెట్టి, డబ్బున్న మరో నేతకు జగన్‌ టికెట్‌ ఇవ్వరని గ్యారెంటీ ఏమిటి? అనే అపనమ్మకంతో ఉండేవారు. అయితే జగన్‌ మాత్రం ఆయనకు అలాంటి అపోహలు పెట్టుకోవద్దని, డబ్బు సమకూర్చడంతో పాటు టికెట్‌ను కూడా ఇస్తానని భరోసా ఇచ్చినా బాషకు నమ్మకం కలుగలేదు.

ఇపుడు ఇలాగే జగన్‌ చెప్పినా 2014లో అప్పటి వరకూ పార్టీలో పనిచేసిన వారిని కేవలం డబ్బు లేదనే ఒక్క కారణంతో టికెట్‌ ఇవ్వకుండా మొండి చేయి చూపినపుడు, తనకు మాత్రం అలాంటి పరిస్థితి ఎదురు కాదని గ్యారంటీ ఏమిటి? అని చాంద్‌బాష అందరికీ చెప్పుకొచ్చారు. ఈలోపుగా చంద్రబాబు నుంచి మంచి ‘ఆఫర్‌’ రావడంతో అభివృద్ధి పేరు చెప్పి జంప్‌ అయి పోయారు. అమ్మో…. చాంద్‌బాషా…. చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నావే…! అని అందరూ అప్పట్లో విస్తుపోయారని నియోజకవర్గంలో పెద్దలు అనుకుంటూ ఉండడం విశేషం.

NEWS UPDATES

CINEMA UPDATES