కందుకూరులో జనం వైసీపీవైపు…. నాయకులు టీడీపీ వైపు

9854

పొలిటికల్‌ రౌండప్‌

తెలుగు రాష్ట్రాలకు మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార, ప్రతిపక్షాలు ఇప్పుడే ఎన్నికలకు సిద్ధమైపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఏఏ నియోజక వర్గాలలో పరిస్థితి ఎలా ఉంది? వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ అభ్యర్ధి ఇక్కడనుంచి విజయం సాధించే అవకాశం ఉంది? ఆయా నియోజక వర్గాలనుంచి ఏఏ అభ్యర్ధులు ఎన్నికల్లో తలపడే వీలుంది? ఆయా పార్టీల తరపున టిక్కెట్లు ఆశిస్తున్న కొత్త అభ్యర్ధులు ఎవరు? ఏ పార్టీ తరపున ఎవరు అభ్యర్ధిగా ఉంటే గెలుపు అవకాశాలు ఎక్కువ…. ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయా నియోజక వర్గాల విశ్లేషణను మా తెలుగుగ్లోబల్‌.కామ్‌ వ్యూయర్స్‌కు అందజేయాలని సంకల్పించాం. వారానికి రెండు మూడు నియోజకవర్గాల సమాచారాన్ని ఈరోజునుంచి ధారావాహికగా అందజేస్తాం.

– ఎడిటర్‌

***

ఇదో ఫిరాయించిన ఎమ్మెల్యే నియోజకవర్గం. ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో అక్కడి ఓటర్లు పోతుల రామారావును వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధిగా గెలిపిస్తే, ఆ తరువాత రెండేళ్లకు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కుబేరుడైన పోతులకు వ్యాపారాలెక్కువ. తన వ్యాపార ప్రయోజనాల పరిరక్షణకో మరొకందుకో తెలియదు గానీ ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలాపించిన అభివృద్ధి గాన బృందంలో సభ్యుడయ్యారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రామారావు గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉండేవారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఒకసారి ఎమ్మెల్యే. మరోసారి ఎంఎల్‌సీగా ఉన్నారు. 2014 ఎన్నిక ముంగిట్లో వైఎస్సార్‌సీపీలోకి వచ్చి టికెట్‌ తీసుకుని 4 వేల ఓట్లకు పైబడిన మెజారిటీతో గెలిచారు. దేశంకు బాగా పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో వరుసగా ఆ పార్టీ 2004,2009, 2014 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ మూడుసార్లూ ఆ పార్టీ తరపున ఓడింది దివి శివరామ్‌ కావడం విశేషం. 2019 ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నప్పటికీ టీడీపీ టికెట్‌ కోసం ఇక్కడ ఎక్కువ డిమాండ్‌ కనిపిస్తోంది. ఆ పార్టీలో మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్‌, టీడీపీలోకి ఫిరాయించిన పోతుల రామారావు (ప్రస్తుత ఎమ్మెల్యే), కాంగ్రెస్‌ పార్టీలో మున్సిపల్‌ మంత్రిగా పనిచేసి బాగా వెనకేసుకున్న మానుగుంట మహీధర్‌ రెడ్డి టీడీపీలో టికెట్‌ తెచ్చుకునేందుకు వెయిటింగ్‌లో ఉన్నారు. మానుగుంట ఇంకా దేశంలో చేరలేదు గానీ, టికెట్‌ ఇస్తే వచ్చి చేరతానని అధికార పార్టీకి సంకేతాలు పంపారు. లేని పక్షంలో స్వతంత్రుడిగానైనా రంగంలోకి దగి తన సత్తాను తేల్చుకోవాలని భావిస్తున్నారని సమాచారం.

టీడీపీ వ్యవహారంలో ఇంత హడావుడిగా ఉంటే వైఎస్సార్‌సీపీలో అసలు టికెట్‌ అడిగే వారే కరువయ్యారు. ప్రజల్లో మంచి పలుకుబడి, కాంగ్రెస్‌ సంప్రదాయిక ఓటర్లు వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గు చూస్తున్నా… అంతో ఇంతో ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేత ఉన్నా ఇప్పటికైతే ఆ పార్టీకి స్థిరంగా ఆ పార్టీ తరపున పోరాడే అభ్యర్ధి కనిపించడం లేదు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ పట్ల అభిమానం మెండుగాగల ఓటర్లున్నారు. వైఎస్‌ అంటే పడి చచ్చే జనమూ ఉన్నారు. కానీ పటిష్ట నాయకత్వ లేమి ఆ పార్టీని వెంటాడుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న తూమాటి మాధవరావు జనం చూపులకు ఆనడం లేదు. హేమా హేమీల సమరాంగణంగా ప్రతిసారీ ఉండబోతున్న ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ అంత పలుకుబడిలేని మాధవరావు నెగ్గుకొస్తారా! ఎమ్మెల్యేగా గెలుపొందగలరా? అనే అనుమానాలు అందరినీ పీడిస్తున్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ శకం ముగిసిన తరువాత మహీధర్‌ రెడ్డిని వైఎస్సార్‌సీపీలోకి తీసుకురావాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీలో చేరతానని చెప్పి రెండుసార్లు జగన్‌ను కలిసినా మహీధర్‌రెడ్డి కండువా వేసుకోవడానికి నిరాకరించి వెళ్లిపోయారు. అందుకు కారణం ప్రధానంగా…. ఆయన మున్సిపల్‌ శాఖ మంత్రిగా ఉన్నపుడు కొన్ని వివాదాస్పద ఫైళ్లపై సంతకాలు చేసి బాగా లబ్ది పొందారట. ఈయన కనుక వైఎస్సార్‌ సీపీలో చేరితే తమకు ఇబ్బంది ఎదురవుతుందని భావించిన మంత్రి లోకేష్‌, మహీధర్‌రెడ్డి వ్యవహారాలన్నీ బయట పెడతామని సంకేతాలు పంపారట. దాంతో ఆయన చేరిక ఆగిపోయింది. అయితే టీడీపీలో చేరితేనైనా టికెట్‌ ఇస్తారా? అనేది ఇప్పటికీ తేల్చలేదు. అయితే ఎన్నికలు సమీపించేటప్పటికి మాధవరావే ఈ పార్టీ తరపున అభ్యర్ధిగా ఉంటారా? లేక మానుగుంట చివరిలో జంప్‌ చేసి అభ్యర్ధి అవుతారా? అనేది కాలమే నిర్ణయించాలి.

వైఎస్సార్‌సీపీ నుంచి ఆహ్వానం ఉన్నప్పటికీ మహీధర్‌రెడ్డి ఆ పార్టీలో చేరకపోవడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అదేమిటంటే…. మహీధర్‌రెడ్డికి ఓ స్వామీజీ ఉన్నారు. ఆయన మాట ఆయనకు గీటురాయి. రామ్‌రతన్‌ బాబా అనే స్వామీజీ వైఎస్సార్‌సీపీలో చేరొద్దు అని సలహా ఇచ్చారట. నీకు తెలుగుదేశంలోనే భవిష్యత్తు ఉంటుందన్నారట. ఆయన మాట మేరకే టీడీపీ పిలుపుకోసం ఆయన పడిగాపులు కాస్తున్నట్లు చెబుతున్నారు. అంతే కాదు. ఇది వరకు తన నియోజకవర్గంలో ప్రజలు ప్రధాన శుభకార్యాలకు ఆహ్వానించినా ఏదో మొక్కుబడిగా వెళ్లి రావడానికి అలవాటు పడ్డ మహీధర్‌ రెడ్డి ఇప్పుడు ఓణీల ఫంక్షన్‌కు పిలిచినా అమిత శ్రద్ధతో వెళ్లి అక్కడే వారితో గంటల తరబడి గడిపి సుష్ఠుగా భోంచేసి మరీ వస్తున్నారట. వస్తూ వస్తూ వారితో తానే సెల్ఫీలు తీసుకుని ఫేస్‌బుక్‌లో పెట్టుకుంటున్నారని నియోజకవర్గం ప్రజలు విశేషంగా చెప్పుకుంటున్నారు.

ఇక పోతుల విషయానికి వస్తే ఆయనకు చంద్రబాబు ఖరాఖండీగా ఓ మాట చెప్పారట. వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశంలో చేరినంత మాత్రాన టికెట్‌ ఇస్తానని గ్యారంటీగా చెప్పలేనని, రెండు మూడు మార్గాల ద్వారా సర్వే చేయించుకుని అందులో సానుకూలంగా నివేదికలు వస్తేనే పోతులకు తెలుగుదేశం అభ్యర్ధిత్వం ఖరారు చేస్తానని ఆయనకు ముఖ్యమంత్రి చెప్పారట. టికెట్‌ ఇవ్వకపోయినా మునుపు కాంగ్రెస్‌ ఇచ్చిన మాదిరిగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని పోతులకు చెప్పడంతో ఆయన ‘మీ నిర్ణయమే శిరోధార్యం…’ అని ముఖ్యమంత్రికి తన భవిష్యత్తును వదలి వేశారని ప్రచారంలో ఉంది.

NEWS UPDATES

CINEMA UPDATES