పేరుకు దళిత నియోజక వర్గం…. పార్టీ ఏదైనా పెత్తనం మాత్రం రెడ్లదే!

10482

దామోదరం సంజీవయ్య…. ఈ మహానుభావుని పేరు తెలియని పాత తరం తెలుగువారుండరు. కొత్త తరానికి ఆయనెవరో తెలియక పోవడంలో ఆశ్చర్యం కూడా లేదు. తెలుగునాట అంతటి మహానుభావుడు ఇంత వరకూ లేడంటే అతిశయోక్తి కాదేమో! నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపం, మేథావి. ఎంత గొప్ప పదవిని అలంకరించినా ఒదిగి ఉండే మనస్తత్వం. ఆయన భారతదేశంలోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తొలి దళిత నేత. అంతే కాదు. స్వాతంత్ర్యం సిద్ధించాక అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడుగా పని చేసిన దళిత నేత కూడా ఆయనే.

ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డికి రాజకీయ వారసుడుగా ఆయన రెండో ముఖ్యమంత్రిగా పీఠాన్ని అలంకరించి రాష్ట్రాన్ని రెండేళ్లకు పైగా పాలించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ మంత్రివర్గాల్లో కార్మిక శాఖ మంత్రిగా కేంద్రంలో పని చేసిన ఘనత దామోదరంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన రోజే అన్ని మర్యాదలూ (ప్రొటోకాల్‌ను) కారుతో సహా త్యజించి సాదాసీదాగా తన సతీమణితో రిక్షాలో సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లిన వ్యక్తి ఆయన. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

దళితుడుగా పుట్టినందుకే ఆయనకు తెలుగు రాజకీయాల్లో రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదు… ఇంతకీ ఆయన గురించి ఇక్కడ ఎందుకింతగా చెప్పుకోవాల్సి వచ్చిందంటే….. అంతటి మహానుభావుడిని 1962 ఎన్నికల్లో కోడుమూరు శాసనసభా నియోజకవర్గం (కర్నూలు) ఓటర్లు ఎన్నుకుని తమ ఘనతను చాటుకున్నారు. ఒకప్పుడు ఇలాంటి గొప్ప వ్యక్తిని ఎన్నుకున్న ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మరుగుజ్జు భావాలు, రాజకీయాలను వ్యాపారంగా భావించే వారూ ఎన్నిక కావడం విశేషం.

కర్నూలు జిల్లా కేంద్రానికి కోడుమూరు నియోజకవర్గ కేంద్రం 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్నా అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇదొకటి. మాజీ ముఖ్యమంత్రి, పలుమార్లు కేంద్ర మంత్రిగా పని చేసిన దివంగత కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి జన్మస్థలమైన లద్దగిరి ఉండేది ఈ నియోజకవర్గంలోనే…. ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి ఇప్పటికీ ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఉంటారు.

కోడుమూరు ఎస్‌సి రిజర్వుడు నియోజకవర్గమే అయినప్పటికీ ఇక్కడ రెడ్డి భూస్వాముల పెత్తందారీతనమే చెలామణి అవుతోంది. ఎస్‌.సి, వాల్మీకి, కురబ, నేత వాళ్లతో సహా ముస్లింలు అధికంగా ఇక్కడ ఉన్నప్పటికీ ఆధిపత్యం మాత్రం రెడ్లదేననేది ఈ నియోజకవర్గ దశాబ్దాల రాజకీయ చరిత్ర చెప్పకనే చెబుతుంది. మాల, మాదిగ నేతల్లో ఎవరు టికెట్‌ తెచ్చుకున్నా రెడ్డి పెత్తందారుల మద్దతు లేకుండా గెలుపొందడం అనేది ఇక్కడ అసాధ్యం. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, ఎదురూరు విష్ణువర్థన్‌ రెడ్డి, కోట్ల హరిచక్రపాణి రెడ్డి, ప్రకాష్‌ రెడ్డి ఇలా ఒకరు కాక పోతే మరొక రెడ్డి పంచన ఎమ్మెల్యే అభ్యర్థులు చేరి గెలుపొందాల్సిందే తప్ప ఇక్కడ మరో మార్గం కనిపించదు. రాజ్యాంగంలో నిమ్నవర్గాలకు కల్పించిన రిజర్వేషన్‌ సీట్లలో పేరుకు వారు ప్రతినిధులుగా ఉన్నా వెనుక ఉండి నడిపించేది మాత్రం పెత్తందారులేననేది జగమెరిన సత్యం.

ప్రస్తుత ఎమ్మెల్యే ఎం. మణిగాంధీ మొన్నటి 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొంది, రెండేళ్ల తరువాత అధికారపక్షం ప్రలోభాల వలలో పడి తొలి విడతలోనే పార్టీని ఫిరాయించారు. ఆయన ఫిరాయింపులో భారీ రొక్కం చేతులు మారిందనే విమర్శలు కోడుమూరు నియోజకవర్గంలో ప్రజల మధ్య విస్త్రృత చర్చగా ఉంది. ఎమ్మెల్యే మాత్రం తాను అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరానని చెప్పుకుంటున్నారు. ఆయన దేశంలో చేరి ఇప్పటికి ఏడాదిన్నరకు పైనే అయింది. ఈ సమయంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటనేది వివరణ ఇచ్చుకునే స్థితిలో మాత్రం మణి గాంధీ లేరంటున్నారు.

మణిగాంధీ తండ్రి శిఖామణి ఇదే నియోజకవర్గం నుంచి మొత్తం నాలుగు సార్లు (కాంగ్రెస్‌ నుంచి 3 సార్లు – అంతకు ముందు తెలుగుదేశం నుంచి ఒకసారి) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004-09 మధ్య కాలంలో ఆయన మృతి దరిమిలా 2009 ఎన్నికల్లో శిఖామణి తనయుడు మణిగాంధీని కాదని కోట్ల వర్గం తమ సహాయకుడు పరిగెల మురళీకృష్ణను కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దించి గెలిపించుకుంది. అప్పట్లో కోట్ల తన పలుకుబడిని ఢిల్లీలో ఉపయోగించారు. అసంతృప్తితో తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేసిన గాంధీ ఓటమిపాలయ్యారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతర పరిస్థితుల్లో మణిగాంధీ వైఎస్సార్‌సీపీలో చేరి అక్కడ టికెట్‌ పొంది కోడుమూరు నుంచి 53 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఘనవిజయం సాధించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఎన్‌. చంద్రబాబు నాయుడు తరువాత అంతటి మెజారిటీతో గెలుపొందిన స్థానం ఇదే కావడం విశేషం. దీనిని బట్టి అక్కడి ప్రజలు జగన్‌ పట్ల, వైఎస్‌ పట్ల ఏ స్థాయిలో అభిమానం ప్రదర్శించారనేది ఇట్టే అర్థం అవుతుంది.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలందరిలోకి జగన్‌ తరువాత అంత భారీ మెజారిటీతో ఎన్నికైన మణిగాంధీ ఇంత త్వరగా పార్టీ మారతారని అక్కడి ప్రజలు భావించలేదు. అర్థ, అంగబలాల పరంగా, రాజకీయంగా అన్ని విధాలా కలిసి వస్తుందని నమ్మి తెలుగుదేశంలో చేరిన గాంధీకి ప్రస్తుతం అక్కడా ప్రతికూల పవనాలు వీస్తున్నాయని భోగట్టా. స్థానిక టీడీపీ నేత విష్ణువర్థన్‌ రెడ్డికి, ఎమ్మెల్యేకు తొలి నుంచీ పొసగదు. మణిగాంధీ ఎమ్మెల్యే అయినప్పటికీ అధికారిక పనుల్లోనూ, ఇతర వ్యవహారాల్లోనూ విష్ణువర్థన్‌ రెడ్డి మాటే చెలామణి అవుతూ ఉండేది. అధికారంలోకి రాగానే చంద్రబాబు ఒక ఫార్ములాను రూపొందించారు. దాని ప్రకారం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఎలాంటి నిధులు ఇవ్వడానికి వీల్లేదు. అంతే కాక వారు చెప్పిన మాట అధికారులు వినకూడదు. స్థానికంగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు, లేదా బలీయమైన శక్తిగా ఉన్న టీడీపీ నేతలు చెప్పిందే వినాలని అధికారులకు హుకుం జారీ చేశారు.

తొలి జిల్లా కలెక్టర్ల సమావేశంలోనే విస్పష్టంగా ఆయన ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలతోనే విష్ణుతో సహా టీడీపీ నేతలందరూ చెలరేగి పోయారు. అడుగడుగునా గాంధీకి అడ్డు తగులుతూ ఆయన చెప్పిన పనులేవీ జరక్కుండా అధికారుల వద్ద మోకాలడ్డుతూ వచ్చారు. ఎన్నికల సందర్భంగా ఎంతో కొంత మొత్తం వెచ్చించి గెలుపొందిన మణిగాంధీకి ఇది బాగా ఇబ్బందిగా పరిణమించింది. ఆర్థికంగా తాను సంక్షోభంలో ఉండటం, అధికారులెవ్వరూ తన మాట వినకపోవడం ఆయనను బాగా వేధించింది. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉండటం దండుగేనన్న భావనకు వచ్చిన గాంధీ తెలుగుదేశం నుంచి వచ్చిన ‘ఆహ్వానాన్ని’ అంది పుచ్చుకుని ‘లక్ష్మీ కటాక్షం’ సిద్ధించడంతో వెనుకాముందు ఆలోచించకుండా వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఒక్క ఉదుటున వెళ్లిపోయి పచ్చ కండువాను కప్పుకున్నారు.

మణిగాంధీ వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశంలో చేరడం వెనుక వైఎస్సార్‌సీపీలో ఉంటూనే లేనట్లుగా ఉండిన ఓ గడ్డం నేతతో పాటు, టీడీపీ మంత్రి సోదరుడొకరి పాత్ర కూడా ఉందని విశ్వసనీయ సమాచారం. ఇందుకు గాను వీరిద్దరికీ భారీగానే లబ్ధి చేకూరినట్లు నియోజకవర్గంలో బాగా చెప్పుకుంటున్నారు. ఫిరాయింపునకు కారణం ఏదైనా తాజాగా అక్కడ గాంధీకి, స్థానిక దేశం నేతలకు బొత్తిగా పొసగడం లేదు. గాంధీని చంద్రబాబు పై స్థాయిలో చేర్చుకున్నా స్థానికంగా ఉండే టీడీపీ నేతలు మాత్రం వద్దని ప్రతిఘటిస్తూ వచ్చారు. చంద్రబాబు మాత్రం వాటిని లెక్క చేయక పోవడంతో స్థానికంగా నేతలు తమ నిరసనను వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. గాంధీ ఎక్కడ సర్వసభ్య సమావేశాలకు హాజరైనా టీడీపీ శ్రేణులు ఆయనను నిలదీస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే ‘అసలు నువ్వు ఎవరివి…. మా పార్టీలో చేరడానికి….?’ అనే విధంగా నిలదీస్తూ వచ్చారు. పై స్థాయిలో చంద్రబాబు అన్నీ సర్దుబాటు చేస్తారని, అధికారపక్షంలో ఉంటే తన మాట అధికారుల వద్ద చెలాయించుకోవచ్చనీ భావించిన గాంధీకి తీరని నిరాశ మిగిలింది. ‘అభివృద్ధి’ పరంగా అయితే గాంధీకి మేలు జరిగింది కానీ రాజకీయంగా అధికారుల వద్ద మళ్లీ మునుపటి పరిస్థితే ఆయనకు ఎదురయ్యింది. రాజకీయాలను వ్యాపారాత్మకంగా భావిస్తే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయని గాంధీకి ఇపుడిపుడే తెలిసి వస్తోందని అంటున్నారు. తాను ఎన్నికైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఆయన ప్రస్తుతం దూరమయ్యారు.

మరోవైపు తాను ఫిరాయించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనను సుతరామూ దరి చేరనీయడం లేదు. ఇలా ఆయన పరిస్థితి రెంటికీ చెడిన రేవడి అయిందని రాజకీయ వర్గాల్లో చర్చగా ఉంది. తనను తెలుగుదేశం పార్టీ వారు నియోజకవర్గంలో దరి చేరనీయడం లేదని గాంధీ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మొరపెట్టుకోగా… ‘నువ్వే ప్రవర్తన మార్చుకోవాలి…. స్థానిక కార్యకర్తలను నువ్వే కలుపుకొని పోవడం లేదట కదా…. వారితో సఖ్యతగా ఉండు….’ అని చెప్పి పంపారట. వైసీపీ నుంచి దేశంలోకి వచ్చినందుకు తనను ఆదరిస్తాడని భావించిన మణిగాంధీకి చంద్రబాబు నుంచి వచ్చిన సమాధానం దిమ్మెర పోయేలా చేసింది. స్థానిక టీడీపీ నేత విష్ణువర్థన్‌ రెడ్డి అనుచరులైతే ఒకటి రెండు సార్లు ఎమ్మెల్యేపై దాడికి కూడా ప్రయత్నించారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఎమ్మెల్యేకు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్లు సమాచారం ఉంది. కొన్ని సార్లు మాత్రం నేను మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరతానని ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నట్లు తెలిసింది. మణిగాంధీ ఎమ్మెల్యే హోదాలో గ్రామాల్లో పర్యటించాలంటే ఆయనకు ప్రస్తుతం కాంగ్రెస్‌ లేదా వైసీపీ కార్యకర్తలే అక్కడక్కడా అండగా నిలుస్తున్నారు తప్ప దేశం శ్రేణులెవ్వరూ పట్టించుకోవడం లేదు.

ముఖ్యమంత్రి నుంచి తనకు లభించిన సమాధానం చూశాక దేశం టికెట్‌పై ఆయనకు అట్టే ఆశలు లేవంటున్నారు. పార్టీ మారి తప్పు చేశానా! అని గాంధీ అంతర్మథనానికి గురవుతున్నట్లు అంతరంగికుల ద్వారా తెలుస్తోంది. నిన్నటి (2014) ఎన్నికల్లో మణిగాంధీకి 53 వేల భారీ ఆధిక్యత లభించడానికి ప్రధాన కారణం అక్కడ టీడీపీకి అధికార అభ్యర్థి లేకపోవడమేనన్నది సత్యం. ఆ ఎన్నికల్లో ఈ సీటును చంద్రబాబు మిత్రపక్షాల సర్ధుబాట్లలో భాగంగా బీజేపీ అభ్యర్థి మాదారపు రేణుకమ్మకు కేటాయించారు. అక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పరిగెల మరళీ కృష్ణ (అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే) కూడా పోటీ చేశారు. వీరిద్దరూ చెరో 25 వేల పై చిలుకు ఓట్లు తెచ్చుకున్నా రేణుకమ్మ కొద్ది ఎక్కువగా ఓట్లు తెచ్చుకుని రెండో స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికల విషయానికి వస్తే ఇప్పటికీ తెలుగుదేశం అభ్యర్థిగా ఎవరుండబోతున్నారనేది స్పష్టం కాలేదు. ఆ నియోజకవర్గం దేశం ఇంచార్జిగా విష్ణువర్థన్‌ రెడ్డి పెత్తనం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లలో ఆయన మాటే చెలామణి అవుతోంది. అంటే రేపటి ఎన్నికల్లో విష్ణు సూచించిన వ్యక్తికే దేశం టికెట్‌ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న మాట. వైసీపీలో ఉంటూ ఇటీవలనే దేశం తీర్థం పుచ్చుకున్న ప్రకాష్‌రెడ్డి కూడా ఈ టికెట్‌ వ్యవహారంలో వేలు పెట్టవచ్చు కానీ ఆయన మాటకు చంద్రబాబు వద్ద అంతంతే విలువ అని అంటున్నారు.

గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి లభించిన మెజారిటీ చూసిన తరువాత అక్కడి నుంచి దేశం అభ్యర్థిగా పోటీకి ముందుకు రావడానికి చాలామంది దళిత నేతలు జంకుతున్నట్లుగా తెలుస్తోంది. అధికారపక్షం కనుక అభ్యర్థిని నిలబెట్టడం ఏమంత కష్టం కాదని అంటున్నారు. విష్ణుతో గాంధీకి ఉన్న విభేదాల వల్ల ప్రస్తుత ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్‌ ఇవ్వడానికి చంద్రబాబు సాహసించక పోవచ్చని అంటున్నారు. పైగా నియోజకవర్గంలో గాంధీ ప్రతిష్ట బాగా మసకబారిందనేది స్పష్టం అవుతోంది. ఆయన చేసిన ఫిరాయింపును ఓటర్లు ఎవ్వరూ సమర్థించడం లేదు సరికదా…. ఈ దఫా మళ్లీ కనుక మారిన పార్టీ టికెట్‌తో వస్తే తగు నిర్ణయం తీసుకుంటామనే భావన నెలకొని ఉంది. చంద్రబాబుకు స్థానిక పరిస్థితులు స్పష్టంగా తెలుసు కనుక గాంధీకి టికెట్‌ ఇచ్చే సాహసం చేయరని అంటున్నారు. ఒక వేళ అంతగా సరైన అభ్యర్థి దేశం నుంచి పోటీ చేయడానికి లభించక పోతే తన మిత్రపక్షమైన బీజేపీకే మళ్లీ టికెట్‌ కేటాయిద్దామని కూడా చంద్రబాబు భావించే అవకాశం ఉందంటున్నారు.

వైఎస్సార్‌సీపీ విషయానికి వస్తే…. ప్రస్తుతం పరిగెల మురళీకృష్ణ అసెంబ్లీ సమన్వయకర్తగా ఉన్నారు. 2009లో కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి వద్ద సహాయకుడిగా ఉండిన మురళీకి ఆయనే స్వయంగా కాంగ్రెస్‌ టికెట్‌ ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో మురళి ఎన్నికై నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. 2014లో మళ్లీ కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి సుమారు 25 వేల ఓట్లు తెచ్చుకుని ఓటమిపాలయ్యారు. గాంధీ వైసీపీ నుంచి నిష్క్రమించాక ఆ స్థానంలోకి మురళి వచ్చి చేరారు. మురళిని సమన్వయకర్తగా నియమించినపుడు…. కర్నూలు పార్టీ నేతలు పెదవి విరిచారు. అయితే వారి అభీష్టాన్ని జగన్‌ ఏ మాత్రం లెక్క చేయకుండా మురళినే నియమించారు. ఆయన నియామకం జరిగి ఏడాది తరువాత కూడా వైసీపీ కార్యకర్తల, నేతల అభిమానాన్ని ఏ మాత్రం మురళి చూరగొనలేక పోయారు.

కోడుమూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి (గూడూరు), వెంకటేశ్వర్లు (కర్నూలు), యర్రన్న (సి.బెళగళ్‌), కృష్ణారెడ్డి (కోడుమూరు) మురళి వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమకు జగన్‌ అన్నా, దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి అన్నా చాలా అభిమానమని అయితే మురళీకృష్ణను మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థిగా తాము ఎంత మాత్రం సమ్మతించబోమని వారు తొలి నుంచీ తెగేసి చెబుతున్నారు. శ్రేణుల పట్ల మురళి వ్యవహార శైలి సరిగ్గా లేదని, ఆయనకు టికెట్‌ ఇవ్వరాదని మొరాయిస్తున్నారు. అన్నింటికీ మించి రూపాయి కూడా ఖర్చు పెట్టే రకం కాదని కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి తన పెద్దరికంతో వారికి నచ్చ జెప్పుకుంటూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కర్నూలు జిల్లాలో ప్రస్తుతం జగన్‌ పాదయాత్ర సాగుతోంది. కొద్ది రోజుల్లో ఆయన కోడుమూరు నియోజకవర్గంలో కూడా ప్రజా సంకల్ప యాత్ర చేస్తారు. ఇందుకు గాను ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరినపుడు ఈ నలుగురు మండల పార్టీ అధ్యక్షులు తమకు మురళీకృష్ణను సమన్వయకర్తగా ఉంచి ఆయన నేతృత్వంలో పని చేయాలని కోరితే తాము అంగీకరించబోమని అంటున్నారు.

గౌరు జోక్యం చేసుకుని ముందు జగన్‌ పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులూ లేకుండా చూడాలని, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయం తరువాత చూద్దామని నచ్చ జెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కోడుమూరులో వైఎస్సార్‌సీపీకి అనుకూల పరిస్థితులే ఉన్నాయి కనుక ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేయాల్సిన అవసరం కూడా అంతగా లేదని చెప్పడానికి మురళి తొలుత ప్రయత్నించారట. అక్కడ జగన్‌ కనుక యాత్ర చేస్తే ఆ భారం తనమీద పడుతుందని, భారం మోసిన తరువాత తనకు టికెట్‌ ఇవ్వకపోతే ఎలా అని దూరాలోచన చేసిన మురళి ఇలా చెప్పారని కార్యకర్తల్లో ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ అగ్రనేతలు అందుకు ఒప్పుకోకుండా యాత్ర జరుగుతుందని ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి అనుకూల పరిస్థితులున్నాయి కనుక కర్నూలుకు చెందిన ప్రముఖ దంతవైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌, రిటైర్డు ప్రభుత్వోద్యోగి నాయకంటి సదానందం కూడా ఇక్కడి నుంచి ఆ పార్టీ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరూ పార్టీలో ప్రస్తుతం క్రియాశీలంగా లేనప్పటికీ సానుభూతి పరులుగా ఉన్నారు. అవకాశం ఇస్తే పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.

పొరుగునే ఉన్న ప్రత్తికొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి ప్రభావం కూడా ఈ నియోజకవర్గంపై ఉంది. కోట్లకు వ్యతిరేకంగా ఆయనకు ఇక్కడ ఒక గ్రూపు ఉంది. అనుచరులు కూడా మెండుగా ఉన్నారు. ప్రత్తికొండ నుంచి కె.ఇ. చేతిలో ఓటమిపాలైన కోట్ల హరిచక్రపాణి రెడ్డి (కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సోదరుని కుమారుడు)కి కూడా ఇక్కడ అనుచర వర్గం ఉంది. హరిచక్రపాణి రెడ్డి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన తరువాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏ పార్టీలోనూ చేరకుండా ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. ఆయన ఏ వైఖరి అనుసరిస్తారో వేచి చూడాలి. ఇక కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి వైసీపీలో ఏమైనా చేరతారా అనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అదే కనుక నిజమైతే ఖాయంగా కోడుమూరు అభ్యర్థిగా తాను చెప్పే వ్యక్తికే టికెట్‌ ఇవ్వాలని ఆయన కోరే అవకాశం ఉంది. ఒక వేళ అలాంటి పరిస్థితే కనుక వస్తే ఒకప్పుడు తాను ప్రోత్సహించి కాంగ్రెస్‌ టికెట్‌ ఇప్పించిన మురళీకృష్ణకు మాత్రం మద్దతు ఇవ్వరని అంటున్నారు. ఆయన సాయం పొందిన మురళీకృష్ణ ఆయనను కాదని పక్కకు వెళ్లిపోవడమే అందుకు కారణమని చెబుతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES