ఇద్దరు జిల్లా అధ్యక్షుల ప్రతిష్టకు సవాల్‌…..

10318

నాలుగు సార్లు వరుసగా ఒంగోలు ఎమ్మెల్యేగా ఎన్నికైన రికార్డును సొంతం చేసుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) ఈసారి మళ్లీ ఆరోసారి ప్రజల చేతిలో తన భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ప్రకాశం జిల్లా ప్రధాన కేంద్రమైన ఒంగోలు పేరు వింటేనే భారత జాతికే గర్వకారణమైన ఒంగోలు గిత్త గుర్తుకు వస్తుంది. గుండ్లకమ్మ నదీ తీరాన ఉన్న అద్దంకి నుంచి దిగువన దేవరంపాడు వరకూ…. సముద్రంలో ఈ నది కలిసే వరకూ ఉన్న పరీవాహక ప్రాంతమంతా ఒంగోలు గిత్తలకు పుట్టినిల్లు. ఒంగోలు గిత్తలు రంకెలు వేస్తూ మొక్కవోని పట్టుదలతో పరస్పరం తలపడే విధంగానే, ఒంగోలు శాసనసభా నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయ పోరాటాలుంటాయి.

పూర్వ గుంటూరు జిల్లాలో అంతర్భాగంగా ఉండి, నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పడిన ప్రకాశం జిల్లాకు ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతున్న ఒంగోలు నగరం ఇప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉంది. దశాబ్దాల పాటు పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఒంగోలు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అభివృద్ధిలో కొంత ముందడుగు వేసింది. రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీస్‌ ఆసుపత్రి ఇపుడిపుడే నాణ్యతా ప్రమాణాలను పెంచుకుంటోంది. గుండ్లకమ్మ ప్రాజెక్టు ఫలాలు ఒంగోలు నగరానికి అందుతున్నాయి. ఈ రెండూ కూడా వైఎస్ హయాంలోనే సాధ్యమయ్యాయని ఎవరైనా చెబుతారు.

కమ్మ, రెడ్డి సామాజికవర్గాల ప్రాబల్యం సమ స్థాయిలో ఉండే ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు రెడ్డి కులానికి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నిక కావడం బాగా ఎన్నదగిన అంశమే! వాస్తవానికి ఈ నియోజకవర్గంలో రెడ్డి, కమ్మ, కాపు (బలిజ), యాదవ, ముస్లిం, ఇతర బీసీ వర్గాల జనాభా గణనీయంగా ఉంది. గతంలో ఎపుడో ఒకసారి చింతల రామచంద్రారెడ్డి అనే రెడ్డి నేత ఎమ్మెల్యేగా కావడం తప్ప తదుపరి 1999 వరకూ ఇక్కడి నుంచి ఆ సామాజికవర్గం నుంచి ఎవరూ ఎన్నిక కాలేదు. వైఎస్‌ జీవించి ఉన్న రోజుల్లో 1999 సంవత్సరం నుంచి వరుసగా 2004,2009 ఎన్నికల్లోనూ బాలినేని ఘనవిజయం సాధించారు. వైఎస్‌ మరణానంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పక్షాన నిలబడిన వాసు 2012 ఉప ఎన్నికల్లో కూడా మరో సారి మంచి ఆధిక్యతతో గెలుపొందారు.

బాలినేని 1999లో టీడీపీ ఓట్ల చీలిక ప్రభావం వల్ల గెలుపొందారు. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు టికెట్‌ లభించక పోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి వాసు గెలుపునకు, టీడీపీ అభ్యర్థి యక్కల తులసీరావు (వైశ్య) అభ్యర్థి ఓటమికి కారణమయ్యారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభంజనంలో స్పష్టమైన ఆధిక్యతతో వాసు గెలుపొందితే ఆ తరువాత 2009లో పీఆర్పీ అభ్యర్థి ఓట్ల చీలిక ఫలితంగా బాలినేని గెలుపొందారనేది అంచనా…. అంతే కాదు 2012లోనూ పీఆర్పీ అభ్యర్థి ఓట్ల చీలిక ఫలితంగా బాలినేని గెలుపొందారనేది అంచనా.

2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన్‌ నుంచి ఎదురైన ముఖాముఖి పోటీలో అప్పటి వరకూ అప్రతిహతంగా గెలుస్తూ వచ్చిన వాసుకు ఓటమి ఎదురైంది. ఇప్పుడు మళ్లీ 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు.

జగన్‌కు చిన్నాన్న (అమ్మ చెల్లెలి భర్త) అయిన వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు ఎంపీ)కి చెల్లెలి భర్త అయిన వాసుకు ఆ కారణంగానే వైఎస్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. వైవీ సుబ్బారెడ్డి ద్వారానే వైఎస్‌ కుటుంబంతో బంధుత్వం ఏర్పడిన బాలినేనికి ఎందుకనో తన బావమరిదితోనే తీవ్ర స్థాయిలో రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైవీ పోటీకి సిద్ధపడినపుడు కూడా వాసు ఒక పట్టాన సమ్మతించలేదనే వార్తలు అప్పట్లో వచ్చాయి.

2014 ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేకపోయిన వాసు బాగా కుంగిపోయి కొంతకాలం పాటు నియోజకవర్గానికి దూరంగా మసులుకుంటూ వచ్చారు. రెండేళ్లయితే అజా అయిపూ లేకుండా ఉన్నారు. నాలుగు సార్లు గెలిపించి ఆదరాభిమానాలు చాటుకున్న ప్రజలు తనను ఐదో సారి కూడా ఎన్నుకోలేదనే అలకతో వాసు ఇలా దూరంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు ఏ అంశంలోనైనా అలుక పూనవచ్చు గానీ తన నియోజకవర్గ ఓటర్లపై అలగ రాదనే విషయాన్ని వాసు గ్రహించలేక పోయారు. ఉంగరం పోయిన చోటే వెతుక్కోవాలనే అక్షర సత్యమైన సామెతను ఆయన పట్టించుకోలేదు. తనను తన నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓడించారు? నాలుగు సార్లు తనకు ఓట్లేసిన వారు ఈ సారి తనకు ఎందుకు ఓట్లేయలేదు? అనే అంశాలను విశ్లేషించుకుని లోపాలను సవరించుకుని మళ్లీ ప్రజలతో మమేకమై వారికి దగ్గరగా ఉండి ఓటర్ల విశ్వాసాన్ని చూరగొని తిరిగి విజయం సాధించాలే తప్ప వారిపై ఆగ్రహంతో నియోజకవర్గ వ్యవహారాల్లో అంటీముట్టనట్లు ఉండటం ఎంత మాత్రం సరికాదని వాసు అనుచరులు తరచూ వాపోతూ ఉంటారు. వాసు వచ్చి ముందర నిలబడితే చాలు తాము దూసుకు వెళతామని, మళ్లీ ఆయనకు పూర్వ వైభవం తెప్పిస్తామని చెప్పే వారూ ఉన్నారు. భారీ స్థాయిలో అనుచరగణం ఉన్న వాసుకు ఆలస్యంగా తత్వం భోద పడినట్లుగా ఉంది. అందుకే మళ్లీ కొంతకాలంగా క్రియాశీలంగా కార్యక్రమాలకు హాజరవుతున్నారు.

బాలినేని, జగన్‌కు బంధువు అయినప్పటికీ జిల్లాలో వైఎస్సార్‌సీపీ తరపున ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం వెనుక వాసు హస్తం ఉందనే ప్రచారం ఒక దశలో తీవ్ర స్థాయిలో జరిగింది. జగన్‌పై ఆగ్రహంతోనా…. లేక బావమరిది వైవీ వైఖరిపై అసంతృప్తితోనా…. అనేది తెలియదు గానీ కొందరు ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమై అందరమూ కలిసి జెండా తిప్పేద్దాం (పార్టీ మారుదాం) అనే విధంగా సంప్రదింపులు జరిపారని సమాచారం. ఆ జిల్లా నుంచి పార్టీ ఫిరాయించిన ముత్తుముల అశోక్‌రెడ్డి, గొట్టిపాటి రవి, పోతుల రామారావు, పాలపర్తి డేవిడ్‌ రాజుల నిష్క్రమణకు ఆయన ప్రోత్సాహమే కారణమని చెప్పుకున్నారు. ( ఈ వార్తలను వాసు అనేక సార్లు ఖండించారనేది వేరే విషయం) ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి ఎవరి కారణాలు వారికి బలంగా ఉన్నప్పటికీ…. వాసు ద్వారా పార్టీ టికెట్‌ పొందిన పోతుల రామారావు, ముత్తుముల అశోక్‌రెడ్డిలు టీడీపీలోకి ఫిరాయించడమే కాక వారిద్దరూ అంతరంగిక చర్చల్లో తాము బాలినేని సలహాపైనే వెళ్లామని వెల్లడించినట్లు సమాచారంగా ఉంది. వైఎస్‌ వల్ల రాజకీయంగా ఎంతో ఎదిగిన బాలినేని జగన్‌కు వ్యతిరేకంగా ఇలా వ్యవహరిస్తారా? అని అప్పట్లో అందరూ ముక్కున వేలు వేసుకున్నారు.

చాలా కాలం పాటు ఎమ్మెల్యేగానూ…. కొంతకాలం మంత్రిగానూ పని చేసిన బాలినేని ఆర్థికంగా ఏ మేరకు బాగుపడ్డారనే మాటను పక్కన బెడితే…. తదనంతర పరిస్థితుల్లో సంక్షోభంలో పడినపుడు జగన్‌ సహకారం కోరారట. ఆయన తన పలుకుబడిని ఉపయోగించి తెలంగాణలో కాంట్రాక్టులు ఇప్పించిన ఫలితంగా ప్రస్తుతం బాలినేనికి కొంత ఉపశమనం లభించిందంటున్నారు. వాసు మనస్తత్వం రీత్యా కొన్ని బలహీనతలున్నాయని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం ఉంది. తీరిక వేళల్లోనే కాదు, అవకాశాన్ని, సమయాన్ని దొరక పుచ్చుకుని ‘ఆట’లు ఆడుతుంటారని ఆర్థికంగా చితికి పోవడానికి ఈ ‘ఆట’లే కారణమని చెప్పే వారూ ఉన్నారు. బలహీనతల మాట ఎలా ఉన్నా సాధు స్వభావి కనుక ఒంగోలులో మెండుగా అభిమానులు, అనుచరులూ ఉన్నారు. ఆయనంటే పడి చచ్చేవారూ ఉన్నారు. తన దగ్గర డబ్బు ఉంటే విచ్చలవిడిగా ఖర్చు పెడతారని అవసరాల్లో ఉన్న వారొచ్చి అడిగితే కాదనకుండా తృణమో…. పణమో ఇస్తారనే మంచిపేరు కూడా ఉంది. ఆయన రాజకీయ వ్యూహంలో ప్రధాన లోపం ఒక్కటే…. అది ప్రజలకు రెండేళ్ల పాటు దూరం కావడం. ఎన్నికలు మరో ఏడాదిన్నర మాత్రమే ఉన్న నేపథ్యంలో వాసు కనుక తన క్రియాశీలతను మరింతగా కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ధీటైన పోటీ ఇచ్చి పూర్వ విజయం సాధించగలరని అంటున్నారు.

నిశాచరుడు దామచర్ల

తెలుగుదేశం రాజకీయాల్లో ఒంగోలు బిర్లాగా పేరుమోసిన మాజీ మంత్రి దివంగత దామచర్ల ఆంజనేయులు మనవడే (కుమారుని కుమారుడు) జనార్థన్‌. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా కూడా బాధ్యతలు మోస్తూ ఉండటం ఆయన హోదాను బాగా పెంచింది. హోదా పెద్దదే అయినా ఆయన రాజకీయ సామర్థ్యం అంత గొప్పగా లేదనేది ఇటీవల చోటు చేసుకున్న అనేక పరిణామాలు సూచిస్తున్నాయి. గొట్టిపాటి రవి-కరణం బలరాం మధ్య చెలరేగిన గొడవల సర్దుబాటులో దామచర్ల విఫలం అయ్యారనే విమర్శ కూడా ఉంది. 400 మంది తెలుగుదేశం కార్యకర్తల సమావేశానికి వెయ్యి మంది పోలీసులు కాపలా ఉన్నారంటే జనార్థన్‌ హయాం చరిత్రలో ఎలా నిలిచి పోతుందో అర్థం చేసుకోవచ్చు. జనార్థన్‌ తాత ఆంజనేయులు దివంగత ఎన్టీ రామారావుకు చాలా సన్నిహితుడు, ఎన్‌.చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులతో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. అదే జిల్లాలో పెత్తనం చేసే కరణం బలరాంతో ఆంజనేయులు ఎప్పుడూ బాహాటంగా సంఘర్షణకు దిగక పోయినా లోపాయికారీగా మాత్రం ఆయనను ఎదుర్కొంటూ తన ఉనికిని, ప్రత్యేకతను నిలుపుకున్నారు.

బలరాంతో సహా పలువురు నేతలు పార్టీలు మారినా, తెలుగుదేశం ఆవిర్భవించినప్పటి నుంచీ ఆంజనేయులు కుటుంబం మాత్రం తెలుగుదేశంతోనే పయనిస్తోంది. తాత వారసత్వంగా రాజకీయాల్లో కొనసాగుతున్న జనార్థన్‌కు నిశాచరుడిగా పేరుంది. రాత్రిపూట ఎంతసేపైనా మేల్కోవడం, పగలు పొద్దు ఎక్కిన దాకా నిద్రపోవడం ఆయన దినచర్యట. అది ఆయన వ్యక్తిగతమే అయినా…. ప్రజా జీవితంలో చురుగ్గా ఉండాల్సిన వ్యక్తి పగటిపూట నిద్రపోతే ప్రజలకు దూరమవుతారనేది గతంలో ఎన్నో ఉదంతాలు నిరూపించాయి. పగటిపూట అంతగా అందుబాటులో లేని నేతలను కూడా ప్రజలు పట్టించుకోక పోయే అవకాశం ఉందనేది ఎందరో రాజకీయవేత్తల విషయంలో నిజమైంది. రాత్రి ఇంటికి చేరుకున్న తరువాత తెల్లవారుజామున ఒక్కొక్కసారి 4 గంటల వరకూ ఆయన రాజకీయ మంతనాలు జరుపుతూ ఉంటారని నియోజకవర్గంలో చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయం కాస్త పక్కన బెడితే జనార్థన్‌ రాజకీయ కుట్రలు, కుతంత్రాలు చేసేవాడు కాదని పార్టీలోని ఇతర నేతలతో పోలిస్తే మంచివాడనే పేరుంది.

2014 ఎన్నికల్లో ఆయన గెలుపు అనూహ్యంగా సాధ్యమైందేమీ కాదు. బలమైన ప్రత్యర్థి వాసును ఎదుర్కొన్న జానార్థన్‌కు నియోజకవర్గంలోని కాపుల ఓట్లన్నీ ఏకపక్షంగా పడ్డాయి. అదే ఆయనను విజయతీరాలకు చేర్చింది. ముఖాముఖి పోటీ జరగడం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. వాస్తవానికి జనార్థన్‌ తాత ఆంజనేయులు ఎపుడూ కొండపి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. ఆ తరువాత ఆ నియోజకవర్గం ఎస్‌సి రిజర్వుడుగా మారి పోయింది. అందుకే జనార్థన్‌ ఒంగోలు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. తెలుగుదేశంతో ఆ కుటుంబానికి పెనవేసుకుని ఉన్న బంధం కారణంగా వారు అదే పార్టీలో నేటికీ క్రియాశీలంగా ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు.

మూడున్నరేళ్లుగా జనార్థన్‌ ఒంగోలు నగరానికి సిమెంటు రోడ్ల శోభను తెచ్చారు. గుండ్లకమ్మ రిజర్వాయరు నుంచి నగరానికి తాగునీటి సరఫరా అందించగలిగారు. (గుండ్లకమ్మ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందీ, నిర్మించిందీ దివంగత వైఎస్‌ హయాంలోనే అనేది వేరే విషయం – బాలినేని కృషి కూడా ఇందులో కొంత ఉందనేది వాస్తవం) నాడు గుండ్లకమ్మ నిర్మాణం వల్లనే నేడు ఒంగోలుకు జనార్థన్‌ నీటి పైపులైన్లు వేయించడానికి కారణమైందనేది అందరికీ తెలిసిన సత్యం. జనార్థన్‌ అభివృద్ధి విషయంలో మెరుగైన సేవలు ఒంగోలుకు అందించినా ఓ ఇద్దరు మనుషులకు(ఒకరు కాపు, మరొకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు) నగరాన్ని అప్పగించారనే విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఆ ఇద్దరిలో కాపునేత నిన్న మొన్నటి వరకూ వైఎస్సార్‌సీపీలో ఉండి వాసు పక్కన తిరిగిన వాడే కావడం విశేషం. ఇపుడు ఆ కాపు నేతే బాలినేనిపై ఎగబడి విమర్శలు చేయడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

మరో కమ్మనేత మాజీ కౌన్సిలర్‌, ఆ నేత చెప్పనిదే స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో చీమైనా కదలదని నగర ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి వల్ల ఇప్పటికే జనార్థన్‌ కావాల్సినంత అప్రతిష్ట మూటగట్టుకున్నారనే ప్రచారం కూడా జోరుగా ఉంది. ఇక సంక్షేమ పథకాల కేటాయింపు విషయంలో సరే… సరి…. పక్కాగా తెలుగుదేశం వారైతేనే లేదా సానుభూతి పరులుగా ఉంటేనే…. స్థానిక పార్టీ నేతలు చెబితేనే పింఛన్లు, గృహాలు మంజూరు చేయిస్తున్నారనే అసంతృప్తి కూడా అధికార పార్టీపై ఉంది.

ఇప్పటి సమాచారం ప్రకారం రానున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మధ్యనే జరిగే అవకాశం ఉంది కనుక అధికారపక్షం నుంచి మళ్లీ జనార్థన్‌, ప్రతిపక్షం నుంచి బాలినేని పోటీ పడతారనేది తెలిసి పోతోంది. వీరిద్దరూ ప్రస్తుతం వారున్న పార్టీలకు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. వారే కనుక రంగంలో ఉంటే అందరి దృష్టిని ఆకర్షించే విధంగా పోటీ చాలా కీలకంగా తయారవుతుంది. బలాబలాల మొహరింపు విషయం కూడా తారాస్థాయికి చేరుకుంటుంది. వీరు కాక ఇతర అభ్యర్థులెవరైనా ఉన్నారా…. అని ఆరా తీస్తే ప్రతిపక్షంలో ఇప్పటికి కనుచూపుమేరలో ఎవరూ కనుపించడం లేదు. బాలినేని ఏ కారణం చేతనైనా తప్పుకుంటే వైవీ సుబ్బారెడ్డే ఇక్కడి నుంచి తలపడాలి అంటున్నారు.

బాలినేని ఈ దఫా తనకు సురక్షితంగా ఉండే సీటుకు దర్శి లేదా మార్కాపురం వెళతారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అదే నిజమైతే బాగా అర్థబలం ఉన్న కాపు లేదా యాదవ సామాజికవర్గం నుంచి కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారనే ప్రచారం ఉంది. అయితే వారెవరు? అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. నిజంగా బాలినేని మదిలో ఆ ఆలోచన ఉందా అనేది కూడా తేలాల్సి ఉంది. జనార్థన్‌ విషయంలో పరిస్థితి కొంచెం వేరుగా ఉంది. ఆయనతో పాటుగా పలువురు కొత్త అభ్యర్థులు రంగంలోకి రావచ్చు. జనార్థన్‌ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నప్పటికీ అదే నియోజకవర్గానికి ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఈదర హరిబాబు, ఎమ్మెల్సీ కరణం బలరాం పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

1994 తెలుగుదేశం ప్రభంజనంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన హరిబాబు ఎన్టీఆర్‌ వీరాభిమాని. అదే ప్రస్తుతం ఆయనకు తెలుగుదేశంలో పెద్ద అనర్హతగా మారింది. ఎన్టీఆర్‌ అభిమానులను సమయం, సందర్భం చూసి ఒక్కొక్కరినీ వెతికి, వెతికి ఏరి పారేసిన చంద్రబాబు ఈదరపై తొలి నుంచీ తీవ్రమైన విముఖతతో ఉన్నారు. (నెల్లూరులో ఎన్టీఆర్‌ వీరాభిమాని, మాజీ ఎమ్మెల్యే తాళ్లపాక రమేష్‌ రెడ్డి విషయంలో కూడా చంద్రబాబు ఇలాగే చేశారు) ఆ విముఖతతోనే ఈదర సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయినప్పటికీ 1999లో పార్టీ టికెట్‌ ఇవ్వలేదు. దాంతో అప్పట్లో హరిబాబు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గణనీయమైన సంఖ్యలో ఓట్లు తెచ్చుకుని అధికార తెలుగుదేశం అభ్యర్థి ఓటమికి కారణమయ్యారు (అప్పట్లో ఈదరకు టికెట్‌ రాకుండా కరణం బలరాం అడ్డుపడ్డారని కూడా అంటారు).

మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈదర జడ్పీటీసీగా ఎన్నికైనప్పటికీ ఆయనను కాదని చంద్రబాబు ఛైర్మన్‌ పదవిని మరొకరికి ఖారారు చేశారు. చివరి క్షణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మద్దతును తీసుకుని జడ్పీ ఛైర్మన్‌ పదవికి పోటీ చేసి వివాదాస్పద పరిస్థితుల నేపథ్యంలో గెలుపొందిన హరిబాబు టీడీపీపై తిరుగుబాబు చేశారు. ఆ తరువాత పరిస్థితులు సర్దుకున్నా హరిబాబుపై చంద్రబాబుకు ఏ మాత్రం ఇష్టం లేదు. స్వతంత్ర వ్యక్తిత్వం గలవాడు, ఎన్టీఆర్‌ అభిమాని అయినందు వల్లనే ఈదరకు తెలుగుదేశంలో ప్రాధాన్యత లేకుండా చేశారని వినిపిస్తోంది. ప్రజలతో సత్సంబంధాలున్న ఈదరకు తెలుగుదేశంలో మళ్లీ పదవి అంటూ లభిస్తుందా? అనేది కూడా అనుమానాస్పదమేనని అంటున్నారు.

కందుకూరు నియోజకవర్గం నుంచి జడ్పీటీసీగా ఎన్నికైన కంచర్ల శ్రీకాంత్‌ కూడా ఒంగోలు టికెట్‌ ఇస్తే తెలుగుదేశం తరపున పోటీ చేయాలనే ఉబలాటంతో ఉన్నారు. కులాల వారీగా ఓటర్ల ప్రభావం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు ఏ విధంగా కాపు, యాదవ, ముస్లిం వర్గాలను మచ్చిక చేసుకుంటారనే దానిమీద ఆధారపడి 2019 ఎన్నికల్లో జయాపజయాలు ఉంటాయి.

NEWS UPDATES

CINEMA UPDATES