చిలక జ్యోతిష్కుడి నియోజకవర్గంలో…. ఏ పార్టీ టికెట్‌ ఎవరికో!

10324

ఒక జ్యోతిష్కుడిని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత గల ఎమ్మిగనూరు శాసనసభా నియోజకవర్గం కర్నూలు జిల్లాలో అత్యంత కీలకమైనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇక్కడి నుంచి గెలుపొందిన ఇద్దరు నేతలు ముఖ్యమంత్రులుగా పని చేశారు. వారిలో ఒకరు దామోదరం సంజీవయ్య కాగా మరొకరు కోట్ల విజయభాస్కర రెడ్డి. ద్విసభ్య నియోజకవర్గాల విధానం గతంలో ఉన్నపుడు వీరిద్దరూ 60వ దశకానికి ముందు ఎమ్మెల్యేలుగా ఒకేసారి ఇదే నియోజకవర్గం నుంచి సంజీవయ్య (ఎస్‌సి), విజయభాస్కరరెడ్డి (జనరల్‌) ఇక్కడి నుంచి గెలుపొందారు. వీరిద్దరూ వేర్వేరు కాలాల్లో ముఖ్యమంత్రులుగా పని చేశారన్నది తెలుగు ప్రజలకు తెలుసు.

వాస్తవానికి విజయభాస్కరరెడ్డి జన్మస్థలం లద్దగిరి. ఈ గ్రామం ఉండేది కోడుమూరు నియోజక వర్గంలో. అది ఎస్‌సి రిజర్వుడు స్థానం కావడంతో ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వస్తే ఎమ్మిగనూరు (జనరల్‌) నుంచే పోటీ చేసే వారు. ఓ వైపు కర్నాటక, మరోవైపు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు గల ఈ నియోజకవర్గం చుట్టూ ప్రత్తికొండ, ఆలూరు, ఆదోని అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎమ్మిగనూరు తెలుగు గడ్డపైనే ఉన్నా తెలుగు-కన్నడ సంస్కృతుల మిళితమైన ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు ఇక్కడి ప్రజల్లో విస్తృతంగా కనిపిస్తాయి. అంతే కాదు, తెలుగుతో బాటుగా కన్నడ భాషా ప్రయోగం కూడా ఎక్కువగా ఉంది. చేనేత కార్మికుల రక్తం, స్వేదంతో తయారయ్యే వస్త్రాలకు ప్రసిద్ధి గాంచిన ఎమ్మిగనూరు నేత కార్మికుల వేదనలకు కూడా నిలయమే!

ది ఎమ్మిగనూర్‌ హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ సొసైటీ గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్‌ భారతదేశంలో తెలియని వారుండరు. ప్రజలను దోమల బారి నుంచి కాపాడ్డానికి ఎన్ని అధునాతనమైన యంత్రాలు (ఆల్‌అవుట్‌, జెట్‌, గుడ్‌నైట్‌ వంటివి) వచ్చినా ఎమ్మిగనూరులో తయారయ్యే దోమ తెరలకు ఇప్పటికీ ఏదీ సాటి రాదనేది నిర్వివాదాంశం. దోమల బారి నుంచి రక్షించి ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ దోమతెరలు తయారు చేసే చేనేత కార్మికుల పరిస్థితులు మాత్రం ఇంకా దారుణంగానే ఉన్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరెన్ని మాటలు చెప్పినా వారి జీవన స్థితిగతుల్లో మాత్రం మార్పు రాలేదనేది అక్షర సత్యం. తాము చేస్తున్న చేనేత పనులకు మేలైన కూలీ లభించక మరో పని చేయడం చేత కాక నేత కార్మికులు సుదూర ప్రాంతాలకు వలస పోవడమో…. లేదా స్థానిక హోటళ్లు, లాడ్జీల్లో కూలీకి వెళ్లడమో ఇక్కడ పరిపాటి. ఇక్కడ పరిసర గ్రామాల్లో ఎక్కువగా వేసేది వేరుశనగ పంట. నూనె మిల్లులు అధికంగా ఉండటం కూడా ఇందుకు ఒక కారణం. చేనేత, గౌడ,బోయ, కురబ, పాక్షికంగా లింగాయతులు, ముస్లింలు అధికంగా గలిగిన ఈ నియోజకవర్గంలో 2 లక్షలకు పైబడి ఓటర్లున్నారు.

ఇక రాజకీయాల విషయానికి వస్తే… ఈ నియోజకవర్గం నుంచి 1982 ఎన్నికల్లో (తెలుగుదేశం ఆవిర్భవించిన కొత్తలో….) అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి పోటీ చేసి 6 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పట్లో రవూఫ్‌ అనే ముస్లిం అభ్యర్థికి ఎన్టీఆర్‌ సాహసం చేసి దేశం టికెట్‌ను ఇచ్చారు. ముస్లిం కనుక ఓడారు తప్పితే మరో సామాజికవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిని ఎంపిక చేసి ఉంటే కోట్ల ఓడిపోయి ఉండే వారని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. తక్కువ మెజారిటీతో గెలిచానని అవమాన భారమో… లేక తన సారథ్యంలోనే కాంగ్రెస్‌ 1982 ఎన్నికల్లో మట్టి కరిచిందనే నైతిక బాధ్యతతోనో…. విజయభాస్కరరెడ్డి ఆ వెంటనే తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తరువాత వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మిగనూరుతో ఏ మాత్రం సంబంధం లేని, స్థానికుడు కాని, తన వ్యక్తిగత జ్యోతిష్కుడైన బైరెడ్డి విశ్వమోహన్‌ రెడ్డి (బీవీ మోహన్‌రెడ్డి)కి ఎన్టీఆర్‌ దేశం టికెట్‌ను ఇస్తే ఆయన భారీ ఆధిక్యతతో గెలుపొందారు. ఎన్టీఆర్‌ తన కాలి చెప్పును నిలబెట్టినా ప్రజలు గెలిపిస్తారని భావించే రోజులవి. అందుకే మోహన్‌రెడ్డి గెలుపొందారు. బీవీ మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా కేంద్రంలోని అజంతా థియేటర్‌ వద్ద చిలుక జోస్యం చెబుతూ పొట్ట పోసుకునే వారని ఆయన్ను బాగా ఎరిగిన వాళ్లు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. అందరి జాతకాలు చెప్పే మోహన్‌రెడ్డి తన స్వీయ జాతకాన్ని ఎలా రూపొందించుకున్నారో తెలియదు గానీ…. అనుకోకుండా కలిసి వచ్చిన వరమే ఎమ్మెల్యే పదవి. ఇక అప్పటినుంచి ఆయన ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ దేశంకు ఆ నియోజకవర్గాన్ని పట్టుగొమ్మగా తయారు చేశారు.

కర్నూలులో ఎక్కడైనా కాంగ్రెస్‌ గెలుపొందవచ్చు గానీ ఎమ్మిగనూరులో మాత్రం అసాధ్యం అనే పరిస్థితి ఓ 20 ఏళ్ల పాటు నెలకొనింది. ఇదే పరిస్థితి 2004, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభంజనం వరకూ కొనసాగింది. 2004లో బీవీ ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2009లో కూడా ఓడారు. ఈ రెండు సార్లూ ఆయనపై కనిమెట్ల చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు. కనిమెట్ల అంతకు ముందు రెండు సార్లు బీవీ చేతిలోనే పరాజయం పాలయ్యారు. కనిమెట్ల బాగా వృద్ధ నేత, అయితే పోరాట యోధుడు, ఆర్థిక వనరులు అంతగా లేకపోయినా ప్రజాభిమానం మెండుగా గలవారు. 2009 తరువాత రాష్ట్ర రాజకీయాల్లో సంభవించిన పెనుమార్పుల్లో కనిమెట్ల జగన్‌ వెంట నడిచారు. అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఎన్ని ఆర్థిక ప్రలోభాలు పెట్టినా చెన్నకేశవరెడ్డి లొంగలేదు. పాతకాలపు రాజకీయవేత్త కనుక తాను ఎంచుకున్న బాటలోనే పయనించారు.

జగన్‌ వెంట వెళ్లినందుకు ఆయనపై స్పీకర్‌ అనర్హత వేటు వేస్తే ఫలితంగా వచ్చిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఆయన భారీ ఆధిక్యతతో బీవీపై గెలుపొందారు. బీవీ అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. అయినప్పటికీ ఆయనకు మించిన అభ్యర్థి తమకు లేరని భావించి చంద్రబాబు రంగంలోకి దింపారు. ఉప ఎన్నికల తరువాత బీవీ అనారోగ్యంతోనే కన్నుమూశారు. బీవీ జీవిత చరమాంకంలోనే ఒక మలుపు చోటు చేసుకుంది. ప్రస్తుత ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జయనాగేశ్వరరెడ్డి బీవీ కుమారుడనే విషయం ఎవ్వరికీ తెలియదు. మోహన్‌రెడ్డి తాను వివాహం జేసుకున్నట్లు, తనకొక కుమారుడు ఉన్నట్లు ఎప్పుడూ ఎవ్వరికీ మాట మాత్రంగానైనా చెప్పలేదు. ఈ విషయాన్ని ఆయన చివరి దాకా గోప్యంగా ఉంచారు. స్వతహాగా జ్యోతుష్కుడు కనుక, తనకు వివాహమైనట్లు, సంతానం ఉన్నట్లుగా బయటి ప్రపంచానికి తెలిస్తే తనకున్న శక్తులు నశిస్తాయని బీవి విశ్వసించారట. చివరకు 2012 ఉప ఎన్నికల సందర్భంగా (తీవ్ర అనారోగ్యంతో ఉన్నపుడు) గాని బయట పెట్టలేదు. తొలిసారిగా తనకు వివాహమైందని, కుమారుడున్నారని వెల్లడించారు. జ్యోతిష్యంతో పాటుగా మోహన్‌రెడ్డికి నటనారంగంలో కూడా ప్రవేశం ఉంది. నాటకాలు వేసేటపుడు పరిచయమైన వడ్డెర మహిళతో ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. వారిద్దరి సంతానమే ప్రస్తుత ఎమ్మెల్యే.

ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మంచి మాటకారి, ఉపన్యాసకుడు. వయసు రీత్యా చంద్రబాబు తనయుడు లోకేష్‌తో సాన్నిహిత్యం పెంచుకున్నారు. లోకేష్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి కనుక కర్నూలు జిల్లాలో ఒక పవర్‌ఫుల్‌ ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారనే పేరుంది గానీ ఈయన హయాంలో అవినీతి మూడుపువ్వులు-ఆరు కాయలుగా వెలుగొందుతోందనే అప్రతిష్ట మాత్రం ఉంది. ఆయన తండ్రి బీవీ మోహన్‌రెడ్డిపై రాజకీయాల్లోనూ…. ప్రజల్లోనూ ఎన్నో జోకులు ప్రచారంలో ఉండేవి గానీ, అవినీతిపరుడనే ముద్ర ఎపుడూ లేదు. ప్రజలకు అందుబాటులో ఉంటారనే మంచిపేరు కూడా ఆయనకుండేది. అందుకే అయిదు సార్లు నెగ్గారంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ గుణంతోనే మోహన్‌రెడ్డి ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లో ఆరు సార్లు మంత్రిగా పనిచేశారు. కానీ ప్రస్తుతం ఎమ్మిగనూరులో అధికారపక్షం అంటేనే అవినీతిమయం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అంగన్‌ వాడీ టీచర్‌ పోస్టుల నియామకాల్లో కూడా ఎస్‌సి, ఎస్‌టి రిజర్వుడు కేటగిరీకైతే ఒకటిన్నర లక్ష, జనరల్ కేటగిరీకైతే 2 లక్షల మొత్తం ఇస్తే కానీ పోస్టు లభించని పరిస్థితులు ఉన్నాయట. ఇక కాంట్రాక్టులు, ఇతర అంశాల్లోనైతే పర్సంటేజీలు లేనిదే కాగితం ముందుకు కదలదని అంటున్నారు. బీవీ మోహన్‌రెడ్డి బయట ఏం చేసేవారో ఏమో గాని, స్థానికంగా మాత్రం అవినీతికి పాల్పడినట్లు ప్రత్యర్థులు కూడా ఎన్నడూ వేలెత్తి చూపలేదు. కానీ ఇపుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ తరహా చెడ్డ పేరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి విజయావకాశాలపై రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపుతుందంటున్నారు. దీనికి తోడు ఆయనపై చెక్‌ బౌన్స్‌ కేసులు కూడా విచారణలో ఉన్నాయి. వ్యాపార లావాదేవీల్లో అప్పుల తాలూక కేసులే ఇవన్నీ అని స్థానికంగా ప్రచారంలో ఉంది. అంతే కాదు, ఆయన మెడిసిన్‌ చేసినట్లు ఉన్న డిగ్రీ కూడా నిజమైంది కాదనే కేసు కూడా ఒకటి ఉంది. సొంత పార్టీకే చెందిన కౌన్సిలర్‌ ఒకరు ఈ కేసు వేశారు.

ప్రస్తుత ఎమ్మెల్యే వ్యవహారశైలి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనుకుంటే చంద్రబాబు ఇక్కడ అభ్యర్థిని మారుస్తారా! అనే అనుమానం కూడా ఉంది. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వైసీపీలో గెలుపొంది, ఇటీవలనే తెలుగుదేశంలో చేరారు. ఆమెకు ఎమ్మిగనూరుతో సంబంధాలున్నాయి. ఇక్కడ పేరు మోసిన మాచాని కుటుంబంతో ఆమె వియ్యమందారు. మాచాని రఘనాథ్‌ ఆమెకు అల్లుడు. వైసీపీలో తనకు ఎంపీ టికెట్‌ లభిస్తుందన్న గ్యారంటీ లేదనే అనుమానంతో రేణుక పార్టీ ఫిరాయించారనేది ఒక కారణం. ఎంపీ టికెట్‌ ఇస్తారని చంద్రబాబు గట్టిగా హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం. అయితే చివరి నిమిషంలో ఏ కారణం చేతనైనా ఎంపీ సీటు ఇవ్వలేక పోతే, జయనాగేశ్వరరెడ్డిని తప్పించాల్సిన పరిస్థితులు వస్తే అనివార్యంగా రేణుకను చంద్రబాబు ఒప్పించి ఎమ్మిగనూరు దేశం అభ్యర్థిగా ఎంపిక చేయవచ్చని కూడా ప్రచారం ఉంది. దేశం పార్టీలో ప్రస్తుతం ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని అంటున్నారు.

వైసీపీ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు కె. జగన్మోహన్‌రెడ్డికే మళ్లీ టికెట్‌ వస్తుందనే మాట వినిపిస్తోంది. తండ్రి చెన్నకేశవరెడ్డి మంచి నాయకుడే కానీ ఆయన కుమారునికి అసలు నాయకత్వ లక్షణాలు లేవనే మాట నియోజకవర్గంలో సర్వత్రా వినిపిస్తోంది. ఏ నోట విన్నా ఇదే మాటగా ఉంది. 2012 ఉప ఎన్నికల్లో ఇక్కడ నుంచి చెన్నకేశవరెడ్డి గెలుపొందినా 2014లో రెండేళ్లు తిరగక ముందు జరిగిన సాధారణ ఎన్నికల్లో 17,000 ఓట్ల భారీ ఆధిక్యతతో జగన్మోహన్‌రెడ్డి ఓటమి పాలు కావడానికి అదే కారణం అంటున్నారు.

గత మూడున్నరేళ్ల కాలంలో వైసీపీ పిలుపునిచ్చిన ఏ పార్టీ కార్యక్రమాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేదని సొంత కార్యకర్తలే వాపోతున్నారు. తండ్రిలాగా కుమారుడు కలుపుగోలు తనంతో ఉండే స్వభావం కలవారు కాదు. అదే ఆయనను ప్రజల నుంచి దూరం చేస్తోంది. జగన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా పిలుపు నిచ్చిన ‘గడప గడపకూ వైఎస్సార్…’ కార్యక్రమాన్ని 20 శాతం మేరకు కూడా నియోజకవర్గంలో అమలు చేయలేదట. బహుశా వైసీపీ అధ్యక్షుడు ఇక్కడి పరిస్థితులు అంచనా వేసినందు వల్లనే తాను కనిమెట్ల కుటుంబాన్ని ఈ దఫా తప్పించి బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్‌ను ఇవ్వ జూపారంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలు ఎన్ని ఉన్నా వాటిని ఎత్తి చూపడంలోనూ…. ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ప్రతిపక్షం బాగా వెనుకబడి ఉందనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎమ్మెల్యేతో లోపాయికారీ లాలూచీ ఏదో ఉన్నందువల్లనే కె. జగన్మోహన్‌రెడ్డి గట్టిగా విమర్శించలేకుండా ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది. మొత్తం మీద అధికారపక్షంపై ప్రతిపక్షం ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు మాత్రం లేవు.

స్థానిక పరిస్థితుల రీత్యా గెలవగలిగే అభ్యర్థినే ఎంపిక చేయాలనుకుంటే యువకుడైన తనయుడికన్నా వృద్ధుడైన తండ్రే నయం అనే అభిప్రాయం ఉంది. జగన్మోహన్‌రెడ్డిని కాదని చెన్నకేశవరెడ్డిని ఎంపిక చేస్తే గెలుపొందవచ్చని అంటున్నారు. కానీ చెన్నకేశవరెడ్డికి వయోభారం వల్ల నియోజకవర్గంలో మునుపటి లాగా తిరిగే పరిస్థితి లేదు. ఆయన కూర్చుండి రాజకీయాలు చేయగలరే గాని, ప్రజల్లో తిరిగే పరిస్థితే లేదు. తొలి నుంచీ (కష్టకాలంలో సైతం) తన వెంట ఉండిన కనిమెట్ల కుటుంబాన్ని కాదని మరొకరికి టికెట్‌ ఇచ్చే కఠినమైన నిర్ణయం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటారా! అనేది ప్రస్తుతం అందరినీ తొలుస్తున్న ప్రశ్నగా ఉంది. ఈ కుటుంబానికి టికెట్‌ ఇవ్వకపోతే వారు మిన్నకుంటారా…. లేక ప్రత్యర్థులకు లోపాయకారీగా సాయపడతారా! అనే అనుమానం కూడా ఉంది. తన ప్రతిష్ట మసకబారుతున్న తరుణంలో ప్రస్తుత దేశం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కూడా వైసీపీ టికెట్‌ రాకపోతే కనిమెట్ల కుటుంబీకులు తనకు మద్దతు నివ్వకపోతారా అనే ఆశలు పెట్టుకుని ఉన్నారు. అనివార్యంగా అభ్యర్థిత్వాన్ని మార్చి బీసీలకు కనుక ఇవ్వాల్సి వస్తే ఎమ్మిగనూరు పట్టణానికి పక్కనే ఉన్న గుడేకల్లు గ్రామానికి చెందిన గాదె రుద్రాగౌడ్‌, ఆయన సోదరుడు డాక్లర్‌ గాదె గౌడప్పగౌడ్‌ పేర్లు పరిశీలనకు రావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

1960వ దశకంలో గాదె సోదరుల తాత గాదె లింగన్న గౌడ్‌ కోట్ల విజయభాస్కర్‌రెడ్డిపైనే ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. లింగన్న కుమారుడు గాదె వీరభద్రగౌడ్‌ కూడా 1966లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రుద్రాగౌడ్‌ 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైనా 30 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో జిల్లా ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. వారు ఆర్థికంగా సంపన్నులు. అందువల్ల ఇద్దరు సోదరుల్లో ఎవరైనా ధీటైన అభ్యర్థి కాగలరని చెబుతున్నారు. గతంలో ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన కె.ఆర్‌.హనుమంతరెడ్డి మనుమడు కె.ఆర్. మురహరిరెడ్డి కూడా ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. పార్టీ టికెట్‌ ఇస్తే వైసీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది.

కర్నాటకలో పారిశ్రామికవేత్త అయిన మురహరి ఆర్థికంగా కూడా బలవంతుడు కావడంతో బలమైన అభ్యర్థి కాగలడని భావిస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గల నాలుగు నియోజకవర్గాల్లో ప్రభావితం చూపుతున్న మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి సోదరుల కుటుంబీకుల్లో ఒకరు ఎమ్మిగనూరుపై కూడా కన్నేసినట్లు సమాచారంగా ఉంది. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), వై.సాయిప్రసాద్‌ రెడ్డి (ఆదోని) ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గుత్తి నియోజకవర్గంలో మరో సోదరుడు వై. వెంకట్రామిరెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ పోటీకి సిద్ధపడుతున్నారు. వీరందరికంటే పెద్దవాడైన వై. సీతారామిరెడ్డి కుమారుడైన ప్రదీప్‌ రెడ్డిని కనుక వైసీపీ నాయకత్వం పూరమాయిస్తే పోటీ చేయడానికి సిద్ధమవుతారని వినిపిస్తోంది. వీరికి ఆర్థిక వనరులు కూడా బాగానే ఉన్నాయి.

అయితే ఒకే కుటుంబం నుంచి ఇంత మందికి టికెట్లు ఇస్తారా? అనేది ఒక ప్రశ్న అయితే ఆ కుటుంబానికి ఇన్ని నియోజకవర్గాల్లో పట్టు కలిగి ఉండటం కూడా గొప్ప విషయమేనన్నది పరిగణించాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి సానుకూల వాతావరణం కనిపిస్తున్న ఈ నియోజకవర్గంపై పార్టీ అధినేత జగన్‌ ఆచితూచి అడుగు వేస్తే ఈ సీటును కైవసం చేసుకోవచ్చని రాజకీయవర్గాల్లో చర్చగా ఉంది.

NEWS UPDATES

CINEMA UPDATES