ప్రబోధానంద ఆశ్రమం వెనుక సంచలన విషయాలు….

2589

తాడిపత్రి. ఈ పేరు చెబితే జేసీ బ్రదర్సే గుర్తుకొస్తారు. అక్కడ ఏం జరిగినా జేసీ బ్రదర్స్‌ కనుసన్నల్లోనే జరుగుతుందని చెబుతుంటారు. ఇప్పుడు అలాంటి జేసీ బ్రదర్స్, వారి అనుచరులు ఒక బాబా దెబ్బకు పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది.

తాడిపత్రి వద్ద ఉన్న ప్రబోధానంద ఆశ్రమం బాబా ఇప్పుడు జేసీ బ్రదర్స్‌నే సవాల్ చేసే స్థాయికి ఎదిగిపోయారు. ఒక్క జేసీ బ్రదర్సే కాదు…. వందలాది మంది పోలీసులు ప్రబోధానంద ఆశ్రమంలోని అల్లరి మూకల నుంచి వచ్చిన రాళ్ళ దాడిని తట్టుకోలేక పరుగులు తీశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 15 ఏళ్ల క్రితం ఇక్కడ ఆశ్రమం పేరుతో దుకాణం మొదలుపెట్టారు.

ప్రబోధానంద. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ప్రైవేట్ రాజ్యంగా ప్రకటించుకుని హవా చెలాయిస్తున్నారు. శ్రీకృష్ణుడి అవతారం అని చెప్పుకుంటూ…. శాంతిని స్థాపిస్తామంటూ చెబుతూ…. ఆశ్రమం ముందు వినాయకుడి విగ్రహాల ఊరేగింపు జరిగితే మాత్రం సహించలేకపోయారు. శనివారం వినాయక విగ్రహాలు ఊరేగింపుగా తీసుకెళ్తున్న రెండు గ్రామాల ప్రజలపై ఆశ్రమంలోని ప్రైవేట్ సైన్యం దాడి చేసింది. ఏకంగా ట్రాక్టర్లు, ఆటోలు, బైకులు తగలబెట్టి భయానక వాతావరం సృష్టించారు. ఆశ్రమానికి చెందిన సైన్యం చేతిలో 15 మంది గాయపడగా…. వారిలో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. దీంతో గ్రామస్తులకు మద్దతుగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముందుకు వచ్చారు.

అప్పటికే వందల మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జేసీ వైపు వేలు చూపించడానికి కూడా భయపడే చోట పోలీసుల సమక్షంలో ఆశ్రమంలోని ప్రైవేట్ సైన్యం దాడికి దిగింది. రాళ్లు, కర్రలతో దాడి చేస్తుంటే 300 మంది పోలీసులు పరుగులు తీశారు. ఆ సమయంలో ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు కూడా ఉన్నారు. వారు కూడా భయంతో పారిపోయారు.

జేసీ దివాకర్ రెడ్డికే నేరుగా రాళ్లు తగిలాయి. జేసీ దివాకర్‌ రెడ్డి గన్‌మెన్‌లు కూడా పారిపోయారు. ఆసమయంలో జేసీ కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి జేసీ దివాకర్ రెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి పేరు ఉన్న ఒక కారును సంఘటన స్థలంలోనే వదిలేసి పారిపోయారు. దీంతో ఆశ్రమంలోని ప్రైవేట్ సైన్యం బలాన్ని చూసి పోలీసులే భయపడిపోతున్నారు. ఇతడో మరో డేరా బాబాలా ఉన్నాడే అని కంగుతిన్నారు.

ఆశ్రమంలో దాదాపు 400 మంది ప్రైవేట్ సైన్యం ఉన్నట్టు చెబుతున్నారు. వారు నిత్యం ఆశ్రమంలోనే ఉంటారు. ఎవరైనా ఎదురిస్తే ఇలా దాడి చేస్తారని చెబుతున్నారు. ఈ ఆశ్రమం ఎదురుగా ఉన్న ప్రభుత్వ రహదారిపై ఎలాంటి ఊరేగింపులు చేయకూడదు. ఇలా చేస్తే వినాయక నిమజ్జనం సందర్భంగా చేసినట్టుగానే విధ్వంసం సృష్టిస్తారు. గ్రామస్తుల సంగతేమో గానీ ఎస్పీ, డీఎస్పీలు, సీఐల సమక్షంలోనే ప్రబోధానంద ప్రైవేట్ సైన్యం దాడి చేస్తే వందలాది మంది పోలీసులే చేతగాక పారిపోవడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆశ్రమం లోపల ప్రైవేట్ సైన్యం ఉందని…. అక్కడ ఆయుధాలతో వారు ఉన్నారని తెలిసినా పోలీసులు లోనికి వెళ్లేందుకు సాహసించడం లేదు. పోలీసుల చేతగానితనం చూసే జేసీ వర్గీయులు తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందు హిజ్రాలతో నినాదాలు చేయించారని చెబుతున్నారు. గతంలో డేరా బాబా ఆశ్రమంలోకి పోలీసులు ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ఇదే తరహాలో దాడి చేశారు.

ఇప్పుడు చంద్రబాబు ఏలుబడిలో, జేసీ బ్రదర్స్ సొంత రాజ్యంలో ఇలాంటి బాబా పేట్రేగిపోతున్నా ఎందుకు చర్యలు లేవన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు శాంతిని బోధించే ఆశ్రమంలో ఏకంగా వందలాది మంది పోలీసులను తరిమికొట్టే ప్రైవేట్ సైన్యం ఉంటే ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES