ప్రకాష్‌ రాజ్‌ చెప్పిందొకటి….. మన జర్నలిస్టులు ఎవరికి కావాల్సింది వారు రాసుకున్నారు….

864

బెంగుళూరు ప్రెస్ క్లబ్‌లో ప్రకాష్‌ రాజ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ మధ్య వివిధ రాష్ట్రాల్లో సినీ నటులు రాజకీయాల్లోకి రావడంపై అడిగిన ప్రశ్నకు ప్రకాష్‌ రాజ్‌ చక్కటి సమాధానం చెప్పాడు. సినిమా నటన వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లోకి రావాలనుకున్న నటులకు దేశం గురించి, సమస్యల గురించి మంచి అవగాహన ఉండాలి. మంచి కమిట్‌మెంట్‌ ఉండాలి. రాజకీయాల్లోకి వచ్చే నటులు తమకు వివిధ సమస్యల పట్ల ఉన్న అవగాహన ఏమిటి? దేశం పట్ల తమ నిబద్దత ఏమిటి? అని ప్రశ్నించుకోవాలి. దానిని బట్టే ప్రజలు ఓటేయ్యాలి. తమ అభిమాన నటుడన్న కారణంతో సమర్థించడం, ఓట్లేయడం సమంజసం కాదు అని ప్రకాష్‌ రాజ్‌ చెప్పారు. అయితే కొందరు జర్నలిస్టులు ”గతంలో ప్రకాష్‌ రాజ్‌ చేసిన ప్రకటనలకు భిన్నంగా మాట్లాడాడని, యూ టర్న్‌ తీసుకున్నాడని” రాసేశారు. మరికొంత మంది జర్నలిస్టులు ”సినీ నటులకు ఓటు వెయ్యవద్దని నేను ప్రచారం చేస్తా” అని ప్రకాష్‌ రాజ్‌ చెప్పాడంటూ వార్తలు రాసేశారు.

దీనికి మండిపడ్డ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, పవన్‌ కళ్యాణ్‌, ఉపేంద్ర అభిమానులు ప్రకాష్‌ రాజ్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. వీటికి స్పందించిన ప్రకాష్‌ రాజ్‌ బెంగుళూరు ప్రెస్‌ క్లబ్‌ కు ఒక లెటర్‌ రాశారు. మీరు అడిగిన ప్రశ్నలకు నేను చెప్పిన సమాధానం ఏమిటి? మీరు రాసిందేమిటి? ఇంత బాధ్యతారహితంగా రాస్తారా? అని నిలదీశాడు.

విశేషం ఏమిటంటే ఇటీవలి కాలంలో ప్రకాష్‌ రాజ్‌ ఇచ్చిన ఇంటర్య్వూలను చూసిన వాళ్లు సామాజిక రాజకీయ వ్యవహారాల మీద ప్రకాష్‌ రాజ్‌ కు ఉన్న అవగాహనను చూసి ఆశ్చర్యపోతున్నారు. సమాజం గురించి మన రాజకీయ నాయకుల్లో, జర్నలిస్టులలో కనీసం 10 శాతం మందికైనా ప్రకాష్‌ రాజ్‌ కు ఉన్న స్పష్టమైన అవగాహన ఉండి ఉంటే ఈ దేశంలో రాజకీయాలు, జర్నలిజము ఇంత దౌర్భగ్య స్థితిలో ఉండేవి కావని మేథావులు అభిప్రాయ పడుతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES