జేడీయూలో చేరిన ప్ర‌శాంత్ కిషోర్…. ప్రాంతీయ పార్టీల కూట‌మి క‌డ‌తారా?

1364

ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్‌ కిషోర్ పొలిటిక‌ల్ బాస్‌గా మారాడు. వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన…. ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నేతగా అవతారమెత్తాడు. బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్‌కుమార్ సమ‌క్షంలో ఆయ‌న జేడీయూలోచేరాడు. ఈ మేర‌కు ఆయ‌న జేడీయూ కండువా క‌ప్పుకున్నాడు.

2019 ఎన్నికల్లో తమ పార్టీల తరఫున పనిచేయాలని…. బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రశాంత్ కిషోర్‌కి ఆఫర్‌ వచ్చినా.. ఆయన మాత్రం వాటిని తిరస్కరించి తానే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల్లో చేరితే పెద్దగా ప్రాధాన్యత దక్కదని…. ప్రాంతీయ పార్టీతోనే రాజకీయంగా ఎదిగేందుకు ఎక్కువగా అవకాశాలుంటాయని భావించిన ఆయన అందుకు వేదికగా జేడీయూను ఎంచుకున్నారు.

రాజ‌కీయ నాయ‌కుడిగా అవ‌తార‌మెత్తిన ప్ర‌శాంత్ కిషోర్ రేప‌టి నుంచి ఏం చేయ‌బోతున్నార‌న్న‌ది కీల‌కంగా మారింది. కాంగ్రెస్, బీజేపీకి వ్య‌తిరేకంగా ప్రాంతీయ పార్టీల కూట‌మి క‌డ‌తారా? లేక బీహార్‌లో నితీష్ త‌ర్వాత జేడీయూ ప‌గ్గాలు చేప‌డ‌తారా? త‌దుపరి సీఎంగా రేసులో ఉంటారా? అనే విష‌యాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.

బీహార్‌లోని నాసారం ప్రాంతానికి చెందిన ప్రశాంత్ కిశోర్ గతంలో ఐక్యరాజ్యసమితిలో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేశారు. అనంతరం ఎన్నికల వ్యూహకర్తగా తన ప్రయాణం ప్రారంభించారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ప్రశాంత్ కిశోర్…. 2014 ఎన్నికల్లో బీజేపీ వ్యూహకర్తగా పనిచేసి మోడీ విజయంలో కీలక పాత్ర పోషించారు.

2015 బీహార్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి తరపున పనిచేసి విజయవంతమయ్యారు. 2017 పంజాబ్ ఎన్నికల్లోనూ కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సలహాదారుగా ఉండి…. కాంగ్రెస్ విజయానికి కారణమయ్యారు. చాలా కాలంగా ప్ర‌శాంత్ కిషోర్ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు జేడీయూలో చేర‌డంతో నిజ‌మైంది. రేప‌టి నుంచి ప్ర‌శాంత్ కిషోర్ ఏం చేయ‌బోతున్నారన్నదానిపై అందరూ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి.

NEWS UPDATES

CINEMA UPDATES