గుజ‌రాత్ ప్ర‌జ‌ల గొంతు అణచ‌డం ఎవ‌రికీ సాధ్యం కాదు

359

గుజ‌రాత్ ప్ర‌జ‌ల గొంతు అణిచివేయ‌డం ఎవ‌రికీ సాధ్యం కాద‌ని రాహుల్ గాంధీ అన్నారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న రాహుల్ గాంధీ బిజెపిపై మండిప‌డ్డారు. బిజెపి అనుస‌రిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు.

మెహ‌సానా వ‌ద్ద జ‌రిగిన ర్యాలీలో మాట్లాడిన రాహుల్ ప‌టేల్ ఉద్య‌మ నాయ‌కుడు హార్దిక్ ప‌టేల్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. కాషాయ పార్టీకి వ్య‌తిరేకంగా గ‌ళాన్ని వినిపిస్తున్నందుకు అభినందించారు.

బిజెపి కుళ్లు రాజ‌కీయాల‌కు పాల్ప‌డి ప‌టేల్ ఉద్య‌మాన్ని అణిచేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ హార్ధిక్ ప‌టేల్ వెన‌క‌డుగు వేయ‌లేద‌ని రాహుల్ అభినందించారు. గుజ‌రాత్ యువ‌త‌కు ప్ర‌తినిధిగా హార్దిక్ ప‌టేల్ ఎదిగాడ‌ని రాహుల్ ప్ర‌శంసించారు.

బ్రిటీష్ వాళ్లు కూడా గుజ‌రాత్‌కు చెందిన మ‌హాత్మాగాంధీ, స‌ర్ధార్ ప‌టేల్ వంటి గొప్ప‌నేత‌ల గొంతు అణ‌గ‌దొక్కాల‌ని ప్ర‌య‌త్నించి భంగ‌ప‌డ్డార‌ని రాహుల్ గుర్తుచేశారు. చివ‌ర‌కు బ్రిటీష్ వారినే వారు త‌రిమి కొట్టార‌ని తెలిపారు.

అవినీతి విష‌యంలో ఎన్నో గొప్ప‌లు చెబుతున్న ప్ర‌ధాని మోడీ సూర‌త్‌లో ప‌ర్య‌టించి చూడాల‌ని రాహుల్ సూచించారు. సూర‌త్‌లో అవినీతి రాజ్య‌మేలుతోంద‌ని తెలిపారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు, జీఎస్టీ అక్క‌డి వ్యాపారాల‌ను నాశ‌నం చేసింద‌ని అన్నారు.

గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా షెడ్యూల్ కులాల నాయ‌కుల‌తో రాహుల్ గాంధీ స‌మావేశ‌మ‌య్యారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్ధి విభాగం ఎన్‌.ఎస్‌.యూ.ఐ కార్మికుల‌ను క‌లుసుకున్నారు. అనేక ఆల‌యాల‌ను ద‌ర్శించారు.

NEWS UPDATES

CINEMA UPDATES