నేను శివ‌భ‌క్తుడిని : రాహుల్ గాంధీ

435

ఆల‌యాల ద‌ర్శ‌నంపై బిజెపి చేస్తున్న‌విమ‌ర్శ‌ల‌కు రాహుల్ కౌంట‌ర్ ఇచ్చారు. తాను శివ భ‌క్తుడిన‌ని తెలిపారు. ఆద్యాత్మికం ఎవ‌రో ఒక‌రి సొత్తు కాద‌ని స‌మాధానం చెప్పారు. ఆల‌యాల ద‌ర్శ‌నం ఎన్నిక‌ల జిమ్మిక్ అని బిజెపి చెప్ప‌డాన్ని రాహుల్‌గాంధీ ఖండించారు.

గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాహుల్ గాంధీ అనేక ఆల‌యాల‌ను ద‌ర్శించారు. అక్ష‌ర్‌ధామ్ ఆల‌యంతో పాటు ఆంబాజీ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. రోడ్ షో లో భాగంగా ద‌గ్గ‌ర‌లో ఉన్న ఆల‌యాల‌ను రాహుల్ త‌ప్ప‌కుండా ద‌ర్శిస్తున్నారు. సోమ‌వారం నాడు రాహుల్ గాంధీ మెహ‌సానాలో బాహుచ‌రాజీ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు.

బిజెపి జాతీయ కార్య‌ద‌ర్శి భూపేంద‌ర్ యాద‌వ్ రాహుల్ ఆలయాల ద‌ర్శ‌నంపై విమ‌ర్శ‌లు చేశారు. ఎన్నిక‌ల స్టంట్‌గా కొట్టిపారేశారు. ఆల‌యాల‌ను ద‌ర్శించ‌డం అక్క‌డ ప్రార్ధ‌న‌లు చేయ‌డం భార‌తీయ సంస్కృతిలో భాగమ‌ని అలా చేయ‌డం మంచిదే న‌ని యాద‌వ్ అన్నారు. అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఎందుకు ఆల‌యాలు గుర్తుకొస్తున్నాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఒక వ్య‌క్తికి భ‌క్తి భావం స్వ‌తహాగా రావాల‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌జ‌ల మ‌న్‌కీ బాత్ తెలుసుకుంటాం

గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న రాహుల్ గాంధీ ప్ర‌ధాని నిర్వ‌హిస్తున్న మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంపై పరోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము గుజ‌రాత్‌లో అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల మ‌న్ కీ బాత్ వింటామ‌ని….వారి మ‌నోభావాల‌కు అనుగుణంగా పాల‌న ఉంటుద‌ని స్ప‌ష్టం చేశారు.

త‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడడానికి బిజెపి ప్ర‌త్యేకంగా కొంద‌రిని నియ‌మించింద‌ని వారు త‌న‌పై విష ప్ర‌చారం చేస్తున్నార‌ని రాహుల్ తెలిపారు. ఏది ఏమైనా గుజరాత్ ప్ర‌జ‌ల‌కు నిజానిజాలు తెలుస‌ని అన్నారు.
——

NEWS UPDATES

CINEMA UPDATES