‘రాజా ది గ్రేట్’ సినిమా రివ్యూ

1282

రివ్యూ: రాజా ది గ్రేట్‌
రేటింగ్‌: 2.75/5
తారాగణం: రవితేజ, మెహ్రీన్‌, ప్రకాష్‌రాజ్‌,రాజేంద్రప్రసాద్‌, రాధిక, శ్రీనివాసరెడ్డి, సంపత్‌ రాజ్‌  తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
నిర్మాత: దిల్‌ రాజు
దర్శకత్వం: అనిల్‌ రావిపూడి

అనగనగా ఒక ఊళ్ళో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ( ప్రకాష్ రాజ్). విలన్ ఆగడాలు మితిమీరితే ఒక ఎన్ కౌంటర్ లో వాడి తమ్ముడిని చంపేస్తాడు. దీనికి ఆగ్రహించిన ఆ విలన్ పోలీస్ ఆఫీసర్ ని చంపేస్తాడు. కూతురిని కూడా చంపాలని వెంటపడతాడు కాని తను తప్పించుకుని దూరంగా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. తనను కాపాడే  పోలీస్ టీంతో డిపార్టుమెంటుకు సంబంధం లేని హీరో కూడా అక్కడికి వెళ్తాడు. హీరొయిన్ ని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చి ఆమెను టార్గెట్ చేసిన విలన్ నుంచి ఆమెను రక్షించి అప్పటికే తనతో ప్రేమలో ఉన్న తనను పెళ్లి చేసుకుని శుభం కార్డు వేసుకుంటాడు.

రాజా ది గ్రేట్ రివ్యూలో ఈ పాత అరిగిపోయిన కమర్షియల్ సినిమా కథ ఎందుకు చెప్పాం అని డౌట్ వచ్చింది కదా. నిజానికి ఈ సినిమాలో ఉన్న కథ ఇదే. కాకపోతే కమర్షియల్ సినిమాలో హీరోకు అన్ని ఉంటాయి. ఇందులో కథానాయకుడికి కళ్ళు ఉండవు. అంతే తేడా. నిజంగా రాజా ది గ్రేట్ లో ఇంతకు మించి కథ లేదు. కాకపోతే హీరోకు కళ్ళు లేవు కదా అనే సింపతి మీద ప్రేక్షకుడు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తో సినిమా చూస్తాడు. కాబట్టి ఆ అడ్వాంటేజ్ ని తీసుకుని అనిల్ రావిపూడి చాలా తెలివిగా కొత్తగా అనిపించే ఒక పాత కథను రాజా ది గ్రేట్ గా చూపించాడు. అంతే….

రవితేజ బలం అతని ఎనర్జీ. ఇడియట్ సినిమా నుంచి ఇప్పటి దాకా చూసుకుంటే రెగ్యులర్ సినిమాలు చాలా వాటిని తన టైమింగ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబెట్టిన సత్తా అతనిది. కాని అదే బలాన్ని దర్శకులు తమ బలహీనతగా మార్చుకుని రవితో రొటీన్ సినిమాలు తీసి చేదు ఫలితాలు ఇచ్చి రెండేళ్ళు గ్యాప్ తీసుకునేలా చేసారు. రాజా ది గ్రేట్ సినిమాలో కూడా అదే జరిగింది. కాని తన యాక్టింగ్ తో సినిమా చూస్తున్నంత సేపు బయటికి వెళ్ళకుండా చేయటంలో అనిల్ రావిపూడి పావలా భాగం సక్సెస్ అయితే రవితేజ ముప్పావలా భాగం సక్సెస్ అయ్యాడు. మేజర్ క్రెడిట్ అంతా రవితేజకు దక్కుతుంది. ఫిజిక్ పరంగా కొంచెం వీక్ గా మారి స్లిమ్ అయిన రవి టైమింగ్ లో మాత్రం ఎటువంటి తేడా రానివ్వకుండా మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. అతని ఫాన్స్ కి మాత్రం ఫుల్ మీల్స్ ఈ మూవీ. హీరొయిన్ మెహ్రీన్ టైం నడుస్తోంది. ఎక్స్ ప్రెషన్ పరంగా ఇంకా ఎల్కెజీ స్టేజిలోనే తనకు క్రేజీ ఆఫర్స్ రావడం అదృష్టమే. నటించడానికి తాను ఎంత కష్టపడుతోంది అనేది క్లోజ్ అప్ షాట్స్ లో బాగా గమనించవచ్చు. గ్లామర్ ఓకే కాని యాక్టింగ్ మాత్రం జీరోనే. ప్రకాష్ రాజ్ తొలి పది నిమిషాలే కనిపిస్తాడు. విలన్ గా చేసిన వివాన్ భతేనా రవితేజ తో సమానంగా స్క్రీన్ స్పేస్ పంచుకున్నాడు. బాగానే చేసాడు. హింది నుంచి దిగుమతి చేసుకున్న విలన్లు గుబురు గెడ్డంతోనే ఎందుకు ఉంటారో అర్థమైంది. యాక్టింగ్ లో లూప్ హోల్స్ ని కప్పి పుచ్చుకోవడం ఈజీ కనక. ఇది మరో సారి ప్రూవ్ అవుతుంది.

లిస్టు పరంగా ఇందులో చాలా యాక్టర్స్ ఉన్నారు. తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, అన్నపూర్ణ, విద్యుల్లత రామన్, అన్నపూర్ణ, హరి తేజ, సత్యం రాజేష్, పోసాని, సన, ప్రభాస్ శీను అందరూ ఎక్కడికక్కడ విడివిడి ట్రాక్స్ లో కనిపించి తమ నుంచి ఆశించింది ఇచ్చారు కనక బాగా చేసారు బాగా చేయలేదు అన్న ప్రశ్న రాదు. శ్రీనివాస రెడ్డి హీరో ఫ్రెండ్ గా కీలక పాత్ర పోషించాడు కాని మరీ ఎక్కువ కామెడీ పండించే ఛాన్స్ అయితే దక్కలేదు.

అనిల్ రావిపూడి తాను నమ్ముకున్న మాస్ సూత్రాన్నే ఇందులో కూడా ఫాలో అయ్యాడు. హీరో గుడ్డివాడు అయినప్పటికీ హీరోయిజంకు ఏ మాత్రం లోటు లేకుండా చూసుకున్నాడు. ఒక స్టేజి లో హీరోకు కళ్ళు ఉన్నా ఇంత బాగా సాహసాలు చేయలేడు అనేంత నమ్మశక్యం కాని రీతిలో పాత్రను డిజైన్ చేయటం చూస్తే ఇంత అవసరమా అని అనిపించక మానదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తో మేనేజ్ చేద్దామని చూసిన అనిల్ అంతగా అవుట్ పుట్ ఇవ్వలేకపోయాడు. బ్యాంకు రాబరీ సీన్ పేలలేదు. హీరొయిన్ వెనుక టాస్క్ ఫోర్సు చేసే కామెడీ కూడా ఫోర్సు తో చేసినట్టు అనిపిస్తుంది. కాని ఎక్కడిక్కడ మాస్ కి కిక్ ఇచ్చే మలుపులు, యాక్షన్ ఎపిసోడ్లు తెలివిగా ప్లాంట్ చేసుకోవడంతో రాజా ది గ్రేట్ మాస్ వరకు బాగానే అనిపిస్తాడు. కాని హీరో గుడ్డివాడుగా చూపించారు …. కథలో చాలా వైవిధ్యం ఉంటుంది అని ఆశించే వాళ్ళకు మాత్రం కొంత నిరాశ తప్పదు. సాయి కార్తీక్ సంగీతం పాటల వరకు మర్చిపోయేలా ఉంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వరకు పర్వాలేదు అనిపిస్తుంది. మోహన కృష్ణ కెమెరా వర్క్ దిల్ రాజు ఖర్చుని బాగా ఎలివేట్ చేస్తే తమ్మి రాజు ఎడిటింగ్ మాత్రం లెంగ్త్ ని కంట్రోల్ చేయలేకపోవడం మైనస్ గానే చెప్పొచ్చు. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లోనే ఉండటం రాజా ది గ్రేట్ కి అతి పెద్ద ప్లస్.

చివరిగా చెప్పాలంటే రాజా ది గ్రేట్ జస్ట్  టైం పాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రవితేజను ఎప్పుడు చూడని పాత్రలో చూడొచ్చు అనే అంచనాలు ఉంటే మాత్రం  కష్టమే. అలా కాదు మాస్ ఎలిమెంట్స్ ఉంటే చాలు లాజిక్స్ ని పట్టించుకోకుండా హీరోయిజం ఎంజాయ్ చేస్తామంటే రాజా హ్యాపీ గానే ఇంటికి పంపిస్తాడు. స్టార్ హీరో ఇలాంటి వైకల్యం ఉన్న పాత్రలు చేయటం అరుదు కాబట్టి ఆ రకంగా ఈ ప్రయత్నం మెచ్చదగిందే. కాని హీరోకు కళ్ళు కనిపించకపోవడం అనే భిన్నమైన పాయింట్ కూడా కమర్షియల్ చక్రంలో ఇరుక్కోవడం ఒకటే కాస్త బాధ కలిగించే విషయం. 

ఫైనల్ గా రాజా ది గ్రేట్…… స్వీట్ బట్ నాట్ గ్రేట్

NEWS UPDATES

CINEMA UPDATES