రాయపాటి వర్సెస్ బాబు…. కేంద్రానికి ఫిర్యాదు

718

16వేల కోట్లుగా ఉన్న పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం చంద్రబాబు అధికారంలోకి రాగానే ఊహించని విధంగా ఏకంగా 40వేల కోట్లకు చేరింది. ఇప్పుడు అది 50వేల కోట్లని ప్రభుత్వం చెబుతోంది.  పోలవరం కాంట్రాక్టు కూడా టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ నిర్వహిస్తోంది. మూడేళ్లుగా చంద్రబాబు కనుసన్నల్లోనే పోలవరం పనులు జరుగుతున్నాయి.

జాతీయప్రాజెక్ట్ అయినప్పటికీ  నిర్మాణ బాధ్యతలు మాత్రం తామే చూస్తామంటూ చంద్రబాబు అనుమతి తెచ్చుకున్నారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు కొత్త అంకానికి తెరలేపారు. పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చేందుకు అనుమతించాలంటూ కేంద్రాన్ని చంద్రబాబు కోరడం చర్చనీయాంశమైంది.  చంద్రబాబు నిర్ణయంపై రాయపాటి ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఒక దశలో ప్రధాని మోడీని కలిసేందుకు ప్రయత్నించిన రాయపాటి…. బీజేపీ ముఖ్యులను కలిసి పోలవరం అసలు సంగతులు వివరించినట్టు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై రాయపాటి ఘాటుగానే ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు.

మొయిన్‌ కాంట్రాక్టర్‌ను తాను అయినా పనులు చేస్తున్నది మాత్రం చంద్రబాబు తీసుకొచ్చిన సబ్‌ కాంట్రాక్టర్లేనని…. బిల్లులు కూడా నేరుగా చెల్లిస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ట్రాన్స్‌ట్రాయ్‌ను ముందు పెట్టి నాలుగు పెద్ద సంస్థలను సబ్‌ కాంట్రాక్టర్లుగా పెట్టి పనులు చేస్తున్నట్టు వివరించారని తెలుస్తోంది. రాయపాటి చెప్పిన విషయాలను పరిశీలించిన తర్వాతే కాంట్రాక్టర్‌ను మార్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ప్రత్యేక విమానంలో నాగపూర్ వెళ్లి గడ్కరిని కలిసి చర్చించారు. అయితే గడ్కరి కూడా కాంట్రాక్టర్‌ను మారిస్తే 30 శాతం ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతుందని అభ్యంతరం తెలిపారు. 

ఇక్కడ మరో విషయం ఏమిటంటే…. పనులు వేగంగా చేయడం లేదని ట్రాన్స్‌ ట్రాయ్‌పై చంద్రబాబు ప్రభుత్వం విమర్శ చేస్తున్నా ఇప్పటి వరకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. టెర్మినేషన్ ప్రాసెస్ మొదలుపెట్టలేదు. అలాంటప్పుడు హఠాత్తుగా కాంట్రాక్టర్‌ను మార్చడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్‌ట్రాయ్‌ కోర్టుకు వెళ్తే పోలవరం నిర్మాణం ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని 16వేల కోట్ల నుంచి 50 వేల కోట్లకు తీసుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం…. ఇప్పుడు కాంట్రాక్టర్‌ను మార్చడం ద్వారా ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం మరో 30 శాతం పెరగాలనే కోరుకుంటోందా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES