రికార్డు దిశ‌గా మ‌రో మ‌హిళ‌

5558

మ‌హిళ‌లు అన్నీ సాధించేశారు… వాళ్లు వ‌దిలిన ఫీల్డ్స్ ఇంకెక్క‌డ ఉన్నాయి? అని మెచ్చుకోలుగా అంటుంటాం. కానీ అప్పుడ‌ప్పుడూ ఒక్కో కొత్త రికార్డు సృష్టించి… అవును ఈ రంగంలోకి ఇంకా అడుగు పెట్ట‌నేలేదు క‌దా! అని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు. అలాంటిదే ఈ రికార్డు కూడా.

సైకిల్ తొక్కారు, మోటార్ బైక్, కారు న‌డిపారు. ఆటోలు, ట్రాక్ట‌ర్‌లు, లారీలు, విమానాలు కూడా న‌డిపేశారు. యుద్ధ విమానాల‌నూ అందుకున్నారు. ఇంకా ఏ స్టీరింగ్ మిగిలి ఉంద‌ని… అనుకునే లోపు రేష్మా అనే చెన్నై అమ్మాయి నేల‌, నింగీ మాట స‌రే… నీటి మాటేమిటి అంటోంది.

రివ‌ర్ పైల‌ట్‌!

షిప్ న‌డ‌ప‌డంలో శిక్ష‌ణ పూర్తి చేసుకుంటోంది రేష్మా. మ‌రో ఆరు నెల‌ల్లో గ్రేడ్ త్రీ పార్ట్ వ‌న్ పూర్తి చేసి గ్రేడ్ త్రీ పైల‌ట్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నుంది. అప్పుడు ఆమెది తొలి రివ‌ర్ పైల‌ట్ గా రికార్డు అవుతుంది. ఈ ఉద్యోగం పేరు రివ‌ర్ పైల‌ట్టే కానీ స‌ముద్రంలో షిప్పుల‌ను న‌డుపుతారు ఈ పైల‌ట్‌లు.

స‌ముద్ర‌తీరాన పుట్టిన చేప‌పిల్ల‌!

చెన్నై న‌గ‌రంలో పుట్టిన రేష్మా నీలోఫ‌ర్ నాహా డిగ్రీలో బిఎస్‌సి నాటిక‌ల్ సైన్స్ చ‌దివింది. ఆ ప‌ట్టాతో కోల్‌క‌తా పోర్ట్ ట్ర‌స్ట్‌లో చేరింది. అందులో అన్ని ద‌శ‌ల శిక్ష‌ణ‌నూ పూర్తి చేసింది. మ‌రో ఆరు నెల‌ల్లో చివ‌రి ద‌శ ప‌రీక్ష‌లు పూర్త‌వుతాయి. అప్పుడు ఆమెచేతికి పెద్ద నౌక‌ను ఇస్తారు.

ఆ నౌక పొడ‌వు 300 మీట‌ర్లు, బ‌రువు 70 వేల ట‌న్నులు ఉంటుందని మెరైన్ డిపార్ట్‌మెంట్ డైరెక్ట‌ర్ జెజె బిశ్వాస్ తెలిపారు. శిక్ష‌ణ‌లో ఆమె ఇప్ప‌టికే 223 కిలోమీట‌ర్ల దూరం పెద్ద నౌక‌ను న‌డిపింది. ఆ దూరంలో దాదాపుగా 150 కిలోమీట‌ర్లు అత్యంత క్లిష్ట‌మైన జోన్‌. స‌ముద్రంలో కొన్ని చోట్ల ఇసుక తిన్నెల బారులు, ఊహించ‌ని మ‌లుపులు ఉంటాయి. వాటిని క‌చ్చితంగా అంచ‌నా వేసి షిప్పుని చాక‌చ‌క్యంగా న‌డ‌ప‌డంలో రేష్మా ఆరితేరింది.

సో… ఇంత వ‌ర‌కు మ‌హిళ‌ల చూపు ప‌డ‌ని ఒక చోటును ఈ అమ్మాయి శోధించింది, ల‌క్ష్యాన్ని ఛేదించింది.

NEWS UPDATES

CINEMA UPDATES