పరిటాల కుటుంబం, యనమలపై రేవంత్‌ ఆరోపణల్లో నిజమెంతా?

328

రేవంత్‌ రెడ్డి టీడీపీని వీడడం దాదాపు ఖాయమైపోయింది. కాంగ్రెస్‌లో చేరిక వార్తలను ఖండిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓపెన్ అయ్యారు. ఒక్క చంద్రబాబును మినహాయించి మిగిలిన ఏపీ నేతలపై విరుచుకుపడ్డారు. పరిటాల రవి కుమారుడి వివాహానికి కేసీఆర్‌ హాజరైన సమయంలో టీడీపీ నేతలు వంగివంగి దండాలు పెట్టారని మండిపడ్డారు. ఇదే చంద్రబాబు వరంగల్‌లో సీతక్క కుమారుడి పెళ్లికి వస్తే ఎర్రబెల్లి గానీ, కడియం గానీ కనీసం పలకరించారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో చంద్రబాబుకు కనీస మర్యాద ఇవ్వనప్పుడు ఏపీలో మాత్రం కేసీఆర్‌కు రాచమర్యాదలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

తోటి టీడీపీ నేతనైన తనను జైల్లో పెట్టిన కేసీఆర్‌కు వంగివంగి దండాలు పెట్టి ఆయన అడుగులకు మడుగులు ఒత్తడం ఎంతవరకు సమంజసమన్నారు. అన్నంపెట్టిన వారికి సున్నం పెట్టినట్టు ఏపీ టీడీపీ నేతల తీరు ఉందని ఆరోపించారు. యనమల రామకృష్ణుడికి తెలంగాణలో రెండు వేల కోట్ల కాంట్రాక్టులు అప్పగించారని అందుకే కేసీఆర్‌పై ఈగవాలకుండా యనమల వెనుకేసుకొస్తున్నారని మండిపడ్డారు. పరిటాల కుమారుడు, అల్లుడికి కలిసి బీర్ తయారీ లైసెన్స్‌ను కేసీఆర్‌ ఇచ్చారని ఆరోపించారు.

కాంగ్రెస్‌తో కొద్దికాలంగా కలిసిపనిచేస్తున్నామని.. ఇప్పుడు ఆ పార్టీతో పెట్టుకోకుండా టీఆర్‌ఎస్ వైపు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. టీఆర్‌ఎస్తో పొత్తు ఉంటుందో లేదోచంద్రబాబు తేల్చిచెప్పాలని… దాని బట్టి తాను నిర్ణయం తీసుకుంటానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ నేతల స్వార్థం కోసం తాము తెలంగాణలో బలవాల్సి వస్తోందన్నారు. తెలంగాణలో టీడీపీ అంటూ ఏమీ లేదని.. మిగిలిని కేసీఆర్‌ అనుకూల, కేసీఆర్ వ్యతిరేక సమూహం మాత్రమేనన్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES