సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్…. మోత్కుపల్లి, అరవింద్ వాకౌట్‌

661

రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో జరిగిన టీటీడీ సీనియర్ నేతల సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకాకపోవచ్చని తొలుత భావించారు. కానీ సమావేశానికి హాజరై అందరినీ రేవంత్ రెడ్డి ఆశ్చర్యపరిచారు. సమావేశం చాలా హాట్‌హాట్‌గా సాగింది. మిగిలిన నేతలు సంయమనం పాటించగా…. ఎల్‌ రమణ, మోత్కుపల్లి నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్‌లు రేవంత్‌ రెడ్డిని కార్నర్‌ చేశారు. ముఖ్యంగా మోత్కుపల్లి ఒంటికాలిపై లేచారు.

రేవంత్ రెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందించారు. పార్టీ నాయకత్వం అనుమతి లేకుండా రాహుల్‌గాంధీని కలిసే అధికారం మీకు ఎవరిచ్చారని మోత్కుపల్లి ప్రశ్నించారు. పార్టీ మారే ఆలోచన లేకపోతే ప్రెస్‌మీట్ పెట్టి ఖండించాలని డిమాండ్ చేశారు. మోత్కుపల్లి వ్యాఖ్యలకు స్పందించిన రేవంత్ రెడ్డి… మీకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం తనకు లేదని…. అంతా చంద్రబాబుకే చెబుతానన్నారు. పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడిపై ఎందుకు ఆరోపణలు చేశారని రేవంత్‌ను మరోసారి మోత్కుపల్లి ప్రశ్నించారు. దీంతో రేవంత్ ఇంకాస్త ఘాటుగా స్పందించారు. ఓటుకు నోటు కేసులో ఇరికించి తనను జైలుకుపంపడంతో పాటు, పార్టీ పరువు తీసిన టీఆర్‌ఎస్‌తో ఏపీ నేతలు అంటకాగుతుంటే దాన్ని ప్రశ్నించకుండా తనను నిలదీయడం ఏమిటని ప్రశ్నించారు.

పార్టీ కోసం జైలుకు వెళ్లిన వ్యక్తిని తానని…. తనను నిలదీసే హక్కు ఎవరికీ లేదని రేవంత్ గట్టిగా మాట్లాడారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఎలా సాధ్యమని ఎల్‌ రమణ ప్రశ్నించగా…. టీడీపీ నేతలను వెంటాడుతున్న టీఆర్‌ఎస్‌తో పొత్తు మాత్రం సబబేనా అని రేవంత్ నిలదీశారు. ఇక్కడ ఎవరికీ తాను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదని…. తన ఢిల్లీ పర్యటన గురించి చంద్రబాబుకే వివరిస్తానని రేవంత్ రెడ్డి చెప్పేశారు. దీంతో అంతా చంద్రబాబుకే చెప్పేటప్పుడు ఈ సమావేశం ఎందుకంటూ మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

ఏపీ నేతలపై విమర్శల ప్రస్తావన వచ్చిన సమయంలో…. ఏ విషయాన్ని దాచాల్సిన అవసరం తనకు లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. సమయం వచ్చినప్పుడు అవన్నీ బయటపెడుతానని…. అందరి సంగతులు బహిర్గం చేస్తానని తేల్చిచెప్పారు. సమావేశానికి చాలా మంది సీనియర్లు హాజరైనప్పటికీ రేవంత్‌ రెడ్డిని నిలదీయకుండా…. తమకెందుకులే అన్నట్టు మౌనంగా ఉండిపోయారు. మొత్తం మీద సీనియర్ నేతల భేటీలో రేవంత్‌రెడ్డిని దులిపేస్తారనుకుంటే. … చివరకు ఆయన చేసిన ఎదురుదాడితో మోత్కుపల్లి, అరవింద్ గౌడ్‌లే వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది. రేవంత్‌ రెడ్డి వ్యూహం అంతుచిక్కక టీడీపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES