ప‌ద్మావ‌తికి అండ‌గా నిలిచిన స‌ల్మాన్ ఖాన్‌

257

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌ ప‌ద్మావతి చిత్రానికి అండ‌గా నిలిచాడు. ద‌ర్శ‌కుడు సంజ‌య్‌లీలా భ‌న్సాలీ త‌న చిత్రాల్లో ఎవ‌రినీ అనుచిత‌ రీతిలో చూప‌డ‌ని స‌ల్మాన్ ఖాన్ తెలిపాడు. ఈ సినిమా విష‌యంలో త‌లెత్తిన వివాదాన్ని సెన్సార్ బోర్డ్‌కు వ‌దిలేయాల‌ని స‌ల్మాన్ కోరాడు.

ఒక ప్ర‌ముఖ టివి ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌ల్మాన్ ఖాన్‌ ఈ విష‌య‌మై స్పందించాడు. భ‌న్సాలీ ఎంతో అంద‌మైన అద్భుత చిత్రాల‌ను తీస్తాడని స‌ల్మాన్ తెలిపాడు.

భ‌న్సాలీతో ఖామోషీ, హ‌మ్ దిల్ దే చుకే హై స‌న‌మ్‌, సావ‌రియా వంటి చిత్రాల్లో న‌టించిన స‌ల్మాన్ త‌న అభిమాన ద‌ర్శ‌కుడికి అండ‌గా నిలిచాడు. సినిమా చూడ‌కుండా ఒక నిర్ణ‌యానికి రావ‌డం మంచిది కాద‌ని స‌ల్మాన్‌ ఆందోళ‌న‌కారుల‌కు సూచించాడు.

భ‌న్సాలీ చిత్రాల్లో హీరోయిన్స్ ఎంతో చ‌క్క‌గా, అందంగా ఉంటార‌ని…ఎటువంటి అస‌భ్య‌క‌ర స‌న్నివేశాలు లేకుండా భ‌న్సాలీ సినిమాలు తీస్తాడ‌ని స‌ల్మాన్ ఖాన్ నిర‌స‌న‌కారుల‌కు భ‌రోసా ఇచ్చాడు. భ‌న్సాలీ పాత రికార్డుల‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం అర్ధ‌మౌతుంద‌ని స‌ల్మాన్ తెలిపాడు.

ఇదిలా ఉంటే క‌ళాకారుల భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు భంగం క‌లగ‌కుండా చూడాల‌నే ప్ర‌చారం సినీ రంగం నుంచి మొద‌ల‌యింది. వీ స‌పోర్ట్ ప‌ద్మావ‌తి అనే నినాదంతో వీరు ముందుకు వ‌చ్చారు. భ‌న్సాలీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇండియ‌న్ ఫిల్మ్ అండ్ టివి డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ తో పాటు మ‌రో నాలుగు సంఘాలు భ‌న్సాలీకి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి.

భ‌న్సాలీకి సంఘీభావం ప్ర‌క‌టించిన సంఘాల‌న్నీ న‌వంబ‌ర్ 16న ఫిల్మ్‌సిటీ వ‌ద్ద స‌మావేశం కానున్నాయి. ఉద‌యం 11 గంట‌ల‌కు 15నిమిషాల పాటు మౌనం పాటించిన త‌ర్వాత త‌మ కార్యాచ‌ర‌ణపై ఓ నిర్ణ‌యం తీసుకోనున్నాయి.

ర‌ణ‌వీర్‌సింగ్‌, ష‌హీద్ క‌పూర్‌, దీపికా ప‌దుకోనే త‌దిత‌రులు ఈ చిత్రం లో న‌టించారు. అన్ని ఆటంకాలు అధిగ‌మిస్తే ప‌ద్మావ‌తి చిత్రం డిసెంబ‌ర్ 1 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

NEWS UPDATES

CINEMA UPDATES